AP Local Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను రద్దు చేసింది. అలాగే సర్ ప్రక్రియ పూర్తయిన తరువాతే ఎన్నికలు జరపాలన్న వైసీపి పిటీషన్‌ను కూడా సుప్రీం కొట్టేసింది. ఇక హైకోర్టు తీర్పు ప్రకారం ఆరు వారాల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏపీ ఎన్నికల సంఘం సంసిద్ధతను వ్యక్తం చేసింది. సుప్రీంతీర్పు రావడంతో ఏపీలో లోకల్ ఎలక్షన్ హీట్ మరింత పెరిగింది.
స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ
స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కోసం ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50శాతం పరిధిని దాటొద్దన్న హైకోర్టు తీర్పునే సుప్రీం సమర్ధించింది. మరోవైపు సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించొద్దన్న వైసీపీ పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు కొట్టేసింది. వార్డుల పునర్విభజన అంశంపై వైసీపీ వాదన.. కేవలం ఎన్నికలను ఆలస్యం చేసే ప్రయత్నమేనంది సుప్రీం. ఎన్నికలను ఆపాలని చూడ్డం అంటే ప్రజాప్రయోజనాలను అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించింది సుప్రీం.
34% కంటే ఎక్కువ సీట్లిచ్చి గెలిపించుకుంటాం..
బీసీలకు న్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైసీపీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లి అడ్డుకుందని ఆరోపించారు సీఎం చంద్రబాబు . అయినా పార్టీపరంగా బీసీలకు 34శాతం కంటే ఎక్కువ సీట్లిచ్చి గెలిపించుకుంటామన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లపై నిజంగా చిత్తశుద్ది వుంటే అసెంబ్లీలో ఆపై పార్లమెంట్‌లో చట్టం చేయాలి. అలా చేసే అవకాశం వున్నా సరే కూటమి ప్రభుత్వం ఆ పని చేయలేదు. వీగి పోతుందని తెలిసి కూడా మళ్లీ సుప్రీంకు వెళ్లారని విమర్శించారు వైసీపీ నేత మార్గాని భరత్
టీడీపీ క్యాడర్‌కు దిశానిర్ధేశం..
సుప్రీం తీర్పు క్రమంలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల హీట్ పెరుగుతోంది. గెలుపే లక్ష్యంగా జనసేన, బిజేపీలతో కలిసి పనిచేయాలని టీడీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. ఇక 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జనసేన అడ్‌హాక్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు పవన్ కల్యాణ్. ఇక 175 నియోజకవర్గాల ఇంచార్జ్‌లతో వన్ టు వన్ భేటీలను నిర్వహించారు వైసీపీ అధినేత జగన్ .నెల్లూరు కార్పొరేషన్ వైసీపీ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డిపేరును ప్రకటించారు.
6 వారాల్లో ఏపీ స్థానిక పోరు నోటిఫికేషన్?
ఇక హైకోర్టు ఆదేశాల మేరకు 6వారాల్లో స్థానిక ఎన్నికల నోటిషినక్ ఇవ్వడానికి తాము సిద్దమని ఏపీ ఎన్నికల సంఘం సుప్రీంకు తెలిపింది. నోటిఫికేషన్ ఇచ్చే లోపు సర్ ప్రక్రియ పూర్తయితే ఆ జాబితాను తీసుకోవాలి , లేదంటే పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది సుప్రీం.
Also Read: లండన్‌కు మీనాక్షి నటరాజన్.. తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇంచార్జ్ ఎవరు?