Teenmaar Mallanna: ఏకు మేకు అవ్వడం కాదు.. ఏకంగా బల్లెంలా తయారైందంట.. సరిగ్గా కాంగ్రెస్‌లో ఆ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం అలాగే తయారైందని పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.. టీవీ వ్యాఖ్యతగా కెరీర్ ప్రారంభించి కాంగ్రెస్ చలవతో ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లన్న కాంగ్రెస్ ముఖ్యనేతలపై విమర్శలు గుప్పిస్తుండటం.. పదేపదే వాటిని రిపీట్ చేస్తుండటంపై కాంగ్రెస్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. తాజాగా బీసీల రాజకీయ యుద్దభేరి అంటూ హడావుడి చేసిన ఆయన రేవంత్ రెడ్డే తెలంగాణకు ఆఖరి ఓసీ సీఎం అని వ్యాఖ్యానించడం.. మల్లన్న తనను తాను సీఎం క్యాండెట్‌గా ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేయడం మరింత వివాదాస్పదంగా తయారైంది.
దీంతో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలకు టీపీసీసీ సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రేపో మాపో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. మల్లన్నపై పీసీసీ చీఫ్‌కు నేతల నుంచి భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఇటీవల మల్లన్న బీసీ కులగణనతోపాటు పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.
తీన్మార్ మల్లన్నగా పొలిటికల్ సర్కిల్స్‌లో పాపులర్ అవుతూ.. జెఎన్‌టీయూ నుంచి ఎంబీఏ పట్టభద్రుడైన ఆయన తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే చేస్తున్న కొలువు మానేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 2015లో వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం తొలిసారి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓటమి మూటగట్టుకున్నారు.
అప్పటి నుంచి గెలుపుగుర్రం ఎక్కడానికి గజనీ మహమ్మద్‌లా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019లో కాంగ్రెస్ సీనియర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలిచి హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. అప్పుడు హుజూర్‌నగర్‌కు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న పరోక్షంగా బీఆర్ఎస్ విజయానికి సహకరించారన్న ప్రచారం జరిగింది. తర్వాత రెండో సారి వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఎప్పటిలాగే మళ్లీ ఓడిపోయారు. ఇండిపెండెంట్‌గా మల్లన్న 83,520 ఓట్లు చీల్చుకోవడంతో, బీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఓట్లతో 12,806 ఓట్లతో గట్టెక్కారు.
తర్వాత ఢిల్లీ వెళ్లి బీజేపీ సెంట్రల్ ఆఫీసులో కాషాయ కండువా కప్పుకుని కొన్నిరోజులు హడావుడి చేశారు. మళ్లీ ఏమనుకున్నారో ఏమో సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగి కాంగ్రెస్ పంచకే చేరారు. అప్పటికే ఎన్నికల్లో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన మల్లన్నకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖాళీ అయిన వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్స్‌లో కాంగ్రెస్ క్యాండెట్‌గా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న ఎట్టకేలకు చట్టసభలో అడుగుపెట్టగలిగారు.
ఇక అప్పటి నుంచి మల్లన్న హడావుడి మొదలైంది. గ్యాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీనని మర్చిపోయి సభా వేదికల మీద బూతు పంచాంగంతో చెలరేగి పోయే మల్లన్న కాంగ్రెస్ లైన్ దాటి వ్యవహరిస్తూ పార్టీకి తలనొప్పిగా తయారయ్యారు . మొన్నామధ్య మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జన సభలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన కేబినెట్‌లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన మల్లన్న కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి గురయ్యారు. ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దోచుకున్నావంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై తీన్మార్ మల్లన్న విమర్శలు చేశారు.
ఆ మిర్యాలగూడ సభలోనే ఇక తెలంగాణ రాష్ట్రానికి ఆఖరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డని మల్లన్న జోస్యం చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ క్రమంలో తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై అధికార కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన మల్లన్నను ఎమ్మెల్సీని చేసి సముచిత గౌరవమిస్తే.. సొంత పార్టీనే టార్గెట్ చేయడం ఏంటని సీనియర్లు, యువనేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మల్లన్న పార్టీ గీత దాటి ప్రవర్తించినా పార్టీ పెద్దలు. వెయిట్ అండ్ సీ.. సిద్దాంతాన్ని ఫాలో అయినట్లు ఆయనపై చర్యలు తీసుకోలేదు.
ఇక వరంగల్ వేదికగా బీసీల రాజకీయ యుద్దభేరి పేరుతో తాజాగా తీన్మార్ మల్లన్న హడావుడి చేశారు. ఆ సభకు ఎమ్మెల్సీ మల్లన్న ఏకంగా హెలికాఫ్టర్‌లో వచ్చి సీఎం క్యాండెట్‌లా కలర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మల్లన్న హెలికాఫ్టర్ దిగే సరికే ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న ఆయన కారు వరంగల్ సభావేదిక వద్ద రెడీగా ఉండటం విశేషం. బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య వంటి దిగ్గజ బీసీ నేతలు పాల్గొన్న ఆ సభలో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్సీ అయిన మల్లన్న తన అనుచరుల భుజాల మీదకెక్కి సభా వేదికపైకి రావడం ఇతర బీసీ నేతలను ఆశ్చర్యపరిచిదంట.
బీసీ యుద్దభేరి సభలో పాల్గొన్న మాదిగ సామాజికవర్గం సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తన ప్రసంగంలో స్వయం స్తుతి చేసుకుంటూనే మల్లన్నను ఆకాశానికెత్తేశారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబునాయుడు తనను ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్‌గా రికమండ్ చేస్తారని ఆశగా ఎదురు చూసి.. అది జరగక తర్వాత పార్టీలు మారుతూ ఒక రకంగా రాజకీయ అనామకుడిగా మారిపోయిన మోత్కుపల్లి.. సామాజికవర్గాల లెక్కలు వల్లెవేస్తూ.. తనకంటే రాజకీయాల్లో ఎంతో జూనియర్ అయిన మల్లన్నను ఉదయించే సూర్యుడని భజన చేయడం విమర్శల పాలవుతుంది
అన్ని బీసీ కులాలపై తనకే పేటెంట్ ఉన్నట్లు మల్లన్న సభలో చెలరేగిపోయారు. బీసీలు తెలంగాణ ఓనర్లని.. ఏడాదికి లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు బీసీలు రాష్ట్రానికి ఎకానమీకి ఇస్తున్నారని.. కానీ బడ్జెట్ లో మాత్రం బీసీ సంక్షేానికి 9వేల కోట్లు కేటాయించి అన్యాయం చేస్తున్నారని సొంత ప్రభుత్వాన్నే టార్గెట్ చేయడానికి ప్రయత్నించారు. రాష్ట్ర జనాభాలో పిరికెడు మందిలేని వారిలో 60మంది ఎమ్మెల్యేలుగా ఉన్నారని .. రెడ్లు, వెలమలు అసలు తెలంగాణ వారే కాదని చిత్రమైన స్టేట్‌మెంట్ ఇచ్చారు.
Also Read: నమ్మకం లేదు దొర.. కేసీఆర్‌ను లెక్క చేయని కేడర్
కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయాన్ని తీన్మార్ మల్లన్న తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీ సంఘాల ఓట్లు అడగకుండా నరేందర్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. అదేమంటే బీసీలకు మీ ఓట్లు వద్దు.. బీసీల ఓట్లు మాకు వద్దని చెప్పే దమ్ము రెడ్లకు ఉందా అని ప్రశ్నించి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం మీతాత జాగీరు కాదు. మీకు కౌలు కిచ్చినం. మీ కౌలు అయిపోయింది. 2028లో వచ్చేది బీసీల రాజ్యమే.. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మరోసారి స్టేట్‌మెంట్ ఇచ్చి కాంగ్రెస్ శ్రేణులకు టార్గెట్ అవుతున్నారు.
కుల విద్వేషాలు రెచ్చగొడుతూ మల్లన్న చేస్తున్న ప్రసంగాలతో అసలు ఆయన పాలిటిక్స్‌కి సూట్ అవుతారా? అన్న డౌట్లు వ్యక్తమవుతున్నాయి. ఆర్. కృష్ణయ్య లాంటి బీసీ నేతల ప్రసంగాల్లో కనిపించే హుందాతనం ఇసుమంతైనా మల్లన్న మాటల్లో కనపడటం లేదు. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎమ్మెల్సీ పదవి అందుకున్న తీన్మార్ మల్లన్న ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి వెనుక బీసీ మంత్రంతో లబ్ది పొందాలని చూస్తున్న బీజేపీ నేతలు ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కేంద్రంలో కీలకంగా ఉన్న బీజేపీ నేతల మద్దతు లేకపోతే ఒక సాధారణ ఎమ్మెల్సీకి హెలికాఫ్టర్ యోగం ఎక్కడ నుంచి వస్తుందంటున్నారు. ఏం మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో మల్లన్న మరింత చెలరేగిపోతున్నారని.. ఇప్పటికైనా ఆయన్ని కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.