తెలంగాణను హై ఇంటెన్సిటీ ఎర్త్ క్వేక్ వణికించింది. గత 55 ఏళ్లలో ఈ స్థాయి ప్రకంపనలను తెలంగాణ చూడలేదు. జనరల్ గా హైదరాబాద్ సేఫ్ జోన్ అంటే సెస్మిక్ టర్మినాలజీలో సెకండ్ జోన్ లో ఉంది. అలాంటిది ఇక్కడ కూడా ప్రకంపనలు రావడం భూమి లోపల పొరల్లో మార్పులకు కారణమా అన్న డౌట్లు పెరుగుతున్నాయి. ములుగు జిల్లా మేడారం సమీపంలో రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇదే ఎపిసెంటర్. భూమిలోపల 40 కిలోమీటర్లలోతులో మొదలైన ప్రకంపనలు నలు మూలలా విస్తరించాయి.
అదే జరిగి ఉంటే?
నిజానికి గోదావరి రివర్ బెల్ట్ లో స్వల్ప భూప్రకంపనలు కామనే. కానీ ఇది మాత్రం కామన్ కాదు. ఎందుకంటే గత 55 ఏళ్లలో తెలంగాణలో రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం రావడం ఇదే తొలిసారి. నిజానికి ఎపిసెంటర్ ములుగు జిల్లా మేడారం సమీపంలో ఉండడం, అది అటవీ ప్రాంతం కావడంతో పెద్దగా నష్టం జరగలేదు. అదే 5.3 తీవ్రత పట్టణ, నగర ప్రాంతాల్లో వచ్చి ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగి ఉండేవి. అంతేకాదు భూమిలోపల 40 కిలోమీటర్లలో భూ ఫలకాలు కదిలాయి. అందుకే పెద్దగా ఎఫెక్ట్ పడలేదు. అదే పదికిలోమీటర్ల లోతులోనే వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదంటున్నారు.
గోదావరి తీరం వెంబడి ప్రకంపనలు
ములుగు జిల్లా నుంచి మొదలైన భూకంపం.. మిగతా ప్రాంతాలకు ప్రకంపనలను తీసుకెళ్లింది. ముఖ్యంగా గోదావరి తీరం వెంబడి ఈ తీవ్రత కనిపించింది. మహారాష్ట్ర మొదలుకుని తెలంగాణ, ఇటు ఏపీ దాకా ప్రకంపనలు విస్తరించాయి. మొత్తం 225 కిలోమీటర్ల దాకా వెళ్లాయి. సో పొద్దున పొద్దున్నే ఈ ప్రకంపనలు రావడంతో చాలా సేపటి దాకా ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. మేడారం మహబూబాబాద్ ప్రాంతాల్లో తీవ్రత బాగానే వచ్చింది. భూ ప్రకంపనలు క్లియర్ గా అర్థమయ్యాయి. సీసీ ఫుటేజ్ లలో చాలా మంది బయటకు రావడం, ఇండ్లు ఎందుకు ఊగిపోతున్నాయో ఆశ్చర్యంగా చూడడం వంటివి రికార్డ్ అయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రొయ్యురు గ్రామంలో భూమి కంపించడంతో ఇంటి గోడ కూలింది. ఫ్యాన్లు ఊగాయి. సీసీ కెమెరాలు షేక్ అయ్యాయి.
ఈ ఎఫెక్ట్ ఇప్పటితో ఆగదట
ములుగు నుంచి మొదలైన ప్రకంపనలు మహారాష్ట్రలోని నాగ్ పూర్, చంద్రపూర్ దాకా వెళ్లాయి. ఇక మన దగ్గర నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు దాకా వెళ్లాయి. సో ఈ ఎఫెక్ట్ తో అన్ని ప్రాంతాల జనం షేక్ అయ్యారు. అయితే 3 నుంచి 10 సెకెండ్ల వ్యవధిలోనే ప్రకంపనలు ఆగిపోయాయి. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పటితో ఆగిపోదంటున్నారు సైంటిస్టులు. ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూ అవుతాయి. అంటే భూమి లోపలి పొరలు అడ్జెస్ట్ అవడానికి ఇంకాస్త సమయం పడుతుంది. ఈ గ్యాప్ లో ఏదైనా జరిగే అవకాశాలుంటాయంటున్నారు సైంటిస్టులు.
ప్రకంపనలు సాధారణమే.. కానీ, పెరిగితే?
నిజానికి గోదావరి తీరం వెంబడి భూ ప్రకంపనలు కామన్ గా వస్తూనే ఉంటాయి. ఇవి రిక్టర్ స్కేల్ పై 4 కంటే తక్కువ తీవ్రతతో నమోదవుతుంటాయి. సో ఇవి పెద్దగా ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం ఉండదు. నార్మల్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు 5.3 తీవ్రత రావడమే చర్చనీయాంశంగా మారింది. కాలం గడిచేకొద్దీ తీవ్రత పెరుగుతోందా అన్న డౌట్లు వస్తున్నాయి. గోదావరి బేసిన్ లో పరిస్థితులు మారిపోతున్నాయా అన్న క్వశ్చన్లు పెరుగుతున్నాయి. పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం ఈ ఏరియాల్లో ఎప్పుడూ ప్రకంపనలు వస్తూపోతూనే ఉంటాయి. పైగా ఈ గోదావరి బేసిన్ వెంట బొగ్గు గనులు కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఓపెన్ కాస్ట్, మిగితావి భూగర్భ గనులు. దీంతో భూమి పొరల్లో అడ్జస్ట్ మెంట్లు జరిగినప్పుడు ఈ బేసిన్ లోనే భూమి కంపిస్తుంటుంది. ఇప్పుడది మరింత పెరిగిందంటే?
కలవరపరుస్తోన్న ‘తీవ్రత’
గోదావరి రీజియన్‍ను భూకంప ప్రాంతాల్లో రెండో రీజియన్‍లో చేర్చారు. ఈ ప్రాంతంలో వచ్చే భూప్రకంపనల వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం ఉండదు. 1869 నుంచి వచ్చిన భూకంపాలను పరిశీలిస్తే 2 నుంచి 5 లోపే రిక్టర్ స్కేల్‍పై నమోదవుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం 5.3 తీవ్రతగా రికార్డైంది. గోదావరి అడుగు భాగాన హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉన్నాయి. నేల స్వభావాన్ని బట్టి గోదావరి ప్రాంతంలో గ్రాబెన్ నిర్మాణం ఉంది. దీనివల్ల భూమిపై పొరలు మాత్రమే కంపిస్తాయి. సో ఇప్పుడు వచ్చిన భూకంపాన్ని లైట్ తీసుకోవడానికి లేదు. అలాగని భయపడాల్సిన పని కూడా లేదు. కానీ అబ్జర్వేషన్స్ చూస్తే తీవ్రత అంతకంతకు పెరుగుతుండడమే ఆందోళన కలిగించే విషయం. తెలంగాణ పరిధి గోదావరి బేసిన్ లో 1869 నుంచి భూప్రకంపనలను రికార్డు చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు 5.3 తీవ్రత కీలకంగా మారింది.
55 ఏళ్ల తర్వాతే.. మళ్లీ ఇప్పుడే..
భద్రాచలం ప్రాంతంలో 5.7 తీవ్రతతో వచ్చిన భూకంపమే ఈ ప్రాంతంలో ఇప్పటి వరకు ఉన్న రికార్డు. ఇది 55 ఏళ్ల క్రితం జరిగింది. మరి ఇప్పుడు అంతే స్థాయిలో రావడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదు. కానీ అప్పుడు వచ్చింది భద్రాచలం చుట్టుపక్కలకే పరిమితం అయింది. కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం వైల్డ్ ఫైర్ అంటున్నారు. ఎందుకంటే 200 నుంచి 300 కిలోమీటర్లను కవర్ చేసింది. ఈ స్థాయిలో టెక్టానిక్ ప్లేట్స్, ఇంట్రాప్లేట్ స్ట్రెస్ మూమెంట్ ఉండడం సైంటిస్టుల్లో కొత్త చర్చకు దారి తీసింది.
ములుగు భూకంపంపై ఎన్నో సందేహాలు
భూమి క్రస్ట్, మాంటిల్, కోర్ అన్న మూడు భాగాలుగా ఉంటుంది. అయితే ఈ మూడు పొరల్లో చాలా మార్పులు జరుగుతూనే ఉంటాయి. భూఫలకాల మధ్య అడ్జస్ట్ మెంట్లు రోజూ ఉంటాయి. అయితే సరైన దిశలో సరైన విధంగా మూమెంట్ ఉంటే ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఈ మూమెంట్ డిస్టర్బ్ అయితే షాక్స్ ఉపరితలం దాకా వస్తుంటాయి. ఇప్పుడు ములుగు జిల్లా కేంద్రంగా వచ్చిన భూకంపం చాలా సవాళ్లను, ప్రశ్నలను తెరపైకి తెచ్చింది. నిజానికి మనదగ్గర ఈ భూప్రకంపనలను అబ్జర్వ్ చేసేందుకు NGRI సంస్థ 41 మానిటరింగ్ స్టేషన్స్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ప్రకంపనలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తున్నారు. తాజాగా వచ్చిన ప్రకంపనలను అనలైజ్ చేసే పనిలో ఉన్నారు.
వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలి.. లేకపోతే..
సహజంగా నది పరివాహక ప్రాంతాల్లో భూకంపం వచ్చినప్పుడు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో దాని ప్రభావం ఉంటుంది. దాంతోనే హైదరాబాద్ సహా ఏపీ, మహారాష్ట్రలోనూ పలుచోట్ల భూమి కనిపించిందంటున్నారు. ఇది గోదావరి తీరం ములుగు ప్రాంతంలో మొదలై స్వల్పంగా కృష్ణానది దాకా ఎఫెక్ట్ చూపించింది. నాగ్ పూర్, చంద్రపూర్, నిజామాబాద్, సంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల, ములుగు, భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు ఇలా ప్రకంపనలు వ్యాపించాయి. ఈసారి 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది కాబట్టి.. రాబోయే రోజుల్లో కూడా మళ్లీ ఇలాంటి భూకంపాలు వచ్చే ప్రమాదం ఉంది. అంటే వాటిని ఆఫ్టర్ షాక్స్ గా పిలుస్తారు. అంటే భూఫలకాలు అడ్జస్ట్ అయ్యే వరకు ఇలాంటి ప్రకంపనలు వస్తూనే ఉంటాయి. కొద్ది రోజుల తర్వాత తగ్గుతాయి. ఇలాంటి సందర్భాల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పాత ఇండ్లు, మట్టిగోడలు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలంటున్నారు. 2015లో నేపాల్‌లోని గూర్ఖా జిల్లాలో వచ్చిన భూకంపం తర్వాత ప్రకంపనలు రెండేళ్ల పాటు కొనసాగాయి. దాదాపు 480 సార్లు ప్రకంపనలు రికార్డు అయ్యాయి. దానివల్ల అక్కడి ప్రజలు నెలల తరబడి ఇళ్ల ముందు టెంట్లు వేసుకుని ఉండాల్సి వచ్చింది. సో మన దగ్గర ఆ స్థాయి క్వేక్ రాలేదు కాబట్టి భయపడాల్సిన పని లేదంటున్నారు సైంటిస్టులు.
భారీ నష్టాలు జరిగే ప్రమాదం ఉందా?
ప్రతి 50 సంవత్సరాలకి ఒకసారి భూమిలోని ప్లేట్స్ సర్దుకుంటూ ఉంటాయి. సునామీలు వచ్చే అంత ప్రమాదకరమైన భూకంపమైతే తెలుగు రాష్ట్రాలకు లేదు. సో ఇదే భద్రాచలం దగ్గర 1969లో 5.7 తీవ్రతతో భూకంపం వస్తే 55 ఏళ్ల తర్వాత ఇదే గోదావరి తీరంలో 5.3 తీవ్రతో వచ్చింది. సో దీన్ని నేచురల్ ప్రాసెస్ గా చూడాల్సిందే అని కొందరు సైంటిస్టులు అంటున్నారు. ఇంకొందరు అబ్జర్వేషన్స్, స్టడీస్ పెంచాలంటున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల భౌగోళిక ప్రాంతం యాక్టివ్ గా కదిలే ప్లేట్లకు దూరంగా ఉంది. సో భూకంపాల వల్ల భారీ నష్టాలు జరిగే ప్రమాదం చాలా తక్కువే.
హైదరాబాద్ సేఫేనా?
నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ప్రకారం హైదరాబాద్ లో భూకంపాల ప్రమాదం చాలా తక్కువ. ఇక్కడ అప్పుడప్పుడు స్వల్ప భూకంపాలు సంభవించినా అవి ప్రాణ, ఆస్తినష్టం జరిగేంత స్థాయిలో ఉండవు. తాజా భూకంపం కూడా అలాంటిదే. భూకంపాల నుంచి హైదరాబాద్ ఫుల్ సేఫ్ జోన్. అందుకే ఇప్పుడు ప్రకంపనలు సిటీదాకా వచ్చినా ఎలాంటి నష్టం కూడా జరగలేదు. కేవలం భూకంపాలే కాదు ప్రకృతి విపత్తుల ప్రమాదం హైదరాబాద్ లో చాలా తక్కువ. ఇది దక్కన్ పీఠభూమి ప్రాంతం. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. ఇది కూడా సిటీ చాలా సేఫ్ గా ఉండటానికి మరో ప్రధాన కారణం. ప్రకృతి విపత్తులు, భూకంపాలు ఎక్కువగా సంభవించే పరిస్థితి లేకపోవడం వల్లే హైదరాబాద్ లో చాలా అంతర్జాతీయ సంస్థలు తమ ఆఫీసులను ఇక్కడే ఏర్పాటు చేసుకున్నాయి. సో ఈ ప్రకంపనలు హైదరాబాద్ ను ఏమీ చేయలేవని సైంటిస్టులు అంటున్నారు.
అంత తీవ్రతతో వస్తేనే నష్టం
భూకంపాలు ఫోర్ షాక్స్, మెయిన్ షాక్స్, ఆఫ్టర్ షాక్స్ గా ఉంటాయి. ఫోర్ షాక్స్ అన్నవి చిన్న భూకంపాలు. పెద్దస్థాయిలో వచ్చే భూకంపం మెయిన్‌షాక్. మెయిన్‌షాక్‌లు ఎప్పుడూ ఆఫ్టర్‌షాక్‌లకు కారణమవుతాయి. ఎపిసెంటర్ ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాలకు విస్తరిస్తాయి. మెయిన్‌షాక్ తీవ్రతపై ఆధారపడి, ఆఫ్టర్‌షాక్‌లు వారాలు, నెలలు, సంవత్సరాల పాటు కొనసాగే ఛాన్స్ ఉంటుంది. నిజానికి రిక్టర్ స్కేల్ పై 8 అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు జరుగుతాయి.
తెలంగాణలో అరుదే.. కానీ ఆలోచించాలి
తెలంగాణలో భూకంపాలు అత్యంత అరుదు. ఇప్పటి వరకు వచ్చిన వాటి తీవ్రత నాలుగైదు లోపే. మనకు రెగ్యులర్ గా హిందూకుష్ పర్వత శ్రేణులు, హిమాలయన్ బెల్ట్, ఇండోనేషియా ద్వీపాలు, పపువా న్యూగినియా, న్యూజీలాండ్, మొరాకో, చిలీ వంటి చోట్ల ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. అవి వస్తే ఊరికే పోవు. భారీగా ఆస్తి, ప్రాణనష్టాన్ని వెంట తీసుకెళ్తుంటాయి. ఎక్కడెక్కడో భూకంపాలు కాదు.. ఇప్పుడు మన దగ్గరే వచ్చింది. భూకంప కేంద్రం కూడా మన దగ్గరే ఉంది. వాట్ నెక్ట్స్ అన్నదే ఇప్పుడు సైంటిస్టుల ముందు ఉన్న ప్రశ్న.
మనం ఏ జోన్లో ఉన్నాం?
దేశంలో మొత్తం నాలుగు సెస్మిక్ జోన్లు ఉన్నాయి. అవి జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5. వీటిలో ఐదో జోన్ భూకంపాలు ఎక్కువగా వచ్చేది. జోన్ 2 అంటే చాలా తక్కువ భూకంపాలు వచ్చేదన్న మాట. తెలంగాణ, ఏపీ జోన్ 2లో ఉన్నాయి. దేశంలోని 11 శాతం ప్రాంతం మాత్రమే ఐదో జోన్‌లో ఉండగా, మరో 18 శాతం భూభాగం నాలుగో జోన్‌లో ఉన్నాయి. ఇక మూడో జోన్‌లో 30 శాతం ఏరియా ఉంది. మిగిలిన ప్రాంతం అంతా రెండో జోన్ పరిధిలోకి వస్తుంది. సో జోన్ 5లో భూకంపం వచ్చిందంటే చాలా ఎక్కువ తీవ్రతతో వస్తాయి. భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని సృష్టిస్తాయి. ఈ ప్రాంతాల్లో రిక్టర్ స్కేలుపై 7కంటే ఎక్కువ తీవ్రతతో భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. జమ్ము కశ్మీర్, పశ్చిమ, మధ్య హిమాలయాలు, బిహార్, ఈశాన్య రాష్ట్రాలు, రాన్ ఆఫ్ కచ్, అండమాన్ నికోబర్ దీవులు ఈ జోన్ 5 లోకి వస్తాయి. అంటే ఇక్కడ హై రిస్కే అన్న మాట.
ఆ నగరాలకు పొంచివున్న భారీ ముప్పు
జోన్ 4 లోని ప్రాంతాలకు కూడా భూకంప ప్రమాదం ఎక్కువే. రిక్టర్ స్కేలుపై 6-7 తీవ్రతతో ఇక్కడ ఎర్త్ క్వేక్స్ వస్తుంటాయి. ఈ జోన్ 4లో ఢిల్లీ ఉంది. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, చండీఘడ్, లడాక్, యూపీ, బెంగాల్ లోని కొంత ప్రాంతం ఈ జోన్ లోకి వస్తాయి. జోన్ 3 లో ఎఫెక్ట్ కాస్త తక్కువగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంభవించినట్లే స్వల్ప భూకంపాలు వస్తుంటాయి. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రతతో వచ్చే ఏరియాలను ఇందులో పెట్టారు. విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు, చెన్నై, బెంగళూరు, మంగళూరు, ముంబై, పూణే, నాసిక్, కాన్పూర్, లక్నో, అహ్మదాబాద్, రాజ్ కోట్, కోల్ కత్తా వంటి నగరాలు ఈ జోన్ లో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో భూకంప తీవ్రత మధ్యస్థంగా ఉంటుంది.
ఈ జోన్‌లో ఉండేవారు సేఫే..
ఇక అత్యంత తక్కువగా భూకంపాలు వచ్చేది జోన్ 2లోనే. ఇక్కడ రిక్టర్ స్కేలుపై కేవలం 2-4 తీవ్రతతో మాత్రమే స్వల్ప భూ ప్రకంపనలు వస్తుంటాయి. అవి వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదు. జోన్ 2 లో హైదరాబాద్, కర్నూలు, మైసూరు, మధురై, జంషెడ్ పూర్, ఉదయ్ పూర్, రాంచీ, నాగ్ పూర్, భోపాల్ వంటివి ఉన్నాయి. సో తాజా ప్రకంపనలతో సెస్మిక్ జోన్ మారే పరిస్థితి ఉండదు.
Also Read: ములుగులో భూకంప కేంద్రం.. మళ్లీ మళ్లీ ప్రకంపనలు తప్పవా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?
అదే అత్యంత తీవ్రతతో వచ్చిన భూకంపం..
నిజానికి 2004, డిసెంబర్ 26న సుమత్రా, అండమాన్ లో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం పెను విషాదాన్ని నింపింది. చరిత్రలోనే ఇది చాలా మంది ప్రాణాలు బలిగొన్న భూకంపం. సముద్ర గర్భంలో వచ్చిన భూకంపంతో సునామీ వచ్చింది. ఇండోనేషియా, థాయిలాండ్, శ్రీలంక, భారత్ సహా 12 దేశాలపై సునామీ అలలు విరుచుకుపడ్డాయి. తీర ప్రాంతాలన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాదాపు 2 లక్షల 30 వేల మంది దాకా చనిపోయారు. ఆ దెబ్బతో సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ అలర్ట్ వ్యవస్థలు వచ్చాయి. వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై ఒక అవగాహన కలిగింది. సో ప్రకృతి విపత్తులు చెప్పి రావు. రక్షించుకునే టైమ్ కూడా ఇవ్వవు. ముందస్తు సిగ్నల్స్ కూడా ఉండవు. రెప్పపాటులో అంతా జరిగిపోతుంది. అందుకే ఈ భూకంపాలపై అటు సైంటిస్టుల్లో, ఇటు జనంలో ఉత్కంఠ ఉంటుంది. భూఫలకాలపై స్టడీస్ ఎప్పటికప్పుడు కొనసాగుతుంటాయి.
Also Read: తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు.. భయాందోళనలో నగరవాసులు