Congress MLAs: స్వేచ్చ బ్యూరో: సర్కార్ మారినా.. ఆ నియోజకవర్గాలకు మాత్రం నిధుల వరద కొనసాగుతూనే ఉన్నదని సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అసంతృప్తిని వ్యక్త పరుస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్, సిద్ధిపేట్, సిరిసిల్లా నియోజకవర్గాలే కేంద్రంగా పాలన సాగిందని, అభివృద్ధంతా ఆ మూడు ప్రాంతాలకే పరిమితమైందని అప్పటి ప్రతిపక్ష పార్టీగా రేవంత్ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కానీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అదే బాటలో వెళ్తుందని సొంత పార్టీకి చెందిన కొందరు శాసనసభ్యుల్లో తీవ్ర అసంతృప్తిని రగిలిస్తోంది.
వాస్తవానికి బీఆర్ఎస్‌ను పూర్తిగా రాష్ట్రం నుంచి తొలగించాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, రాజకీయంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లతో గులాబీని కనిపించకుండా చేయాలని ప్లాన్ చేశారు. ముఖ్యంగా గులాబీ పార్టీ ముఖ్య నేతల కోటలైన గజ్వేల్, సిద్ధిపేట్, సిరిసిల్ల నియోజకవర్గాలను తమ పూర్తి గ్రిప్‌లోకి తెచ్చుకోవాలనేది సీఎం రేవంత్ ఆలోచన. అందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు, అభివృద్ధి ప్రాజెక్టులకు వందల కోట్ల నిధులను ప్రకటిస్తున్నారు. ఇది సొంత పార్టీలోని కొందరి ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణమైంది.
సిరిసిల్లా, సిద్ధిపేట్, గజ్వేల్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని, తాను విస్తృతంగా పర్యటిస్తానని సీఎం రేవంత్ కూడా ఇటీవల ప్రకటించారు. దీనిలో భాగంగానే సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ సీఎం తన స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. అయితే ఆయా సభల్లో నియోజకవర్గాలకు నిధులు ప్రకటించడం సొంత పార్టీలో వివాదాస్పదమైంది. తాజాగా సిరిసిల్లాలో సభ నిర్వహించిన సీఎం…పవర్ లూమ్ డెవలప్ కు, యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటుతో పాటు వివిధ అభివృద్ధి పనులకు దాదాపు రూ. 345.78 కోట్లను సీఎం మంజూరు చేశారు. ఆ తర్వాత సిద్టిపేట్ లో సభ నిర్వహించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ నియోజకవర్గంలోనూ నిధులు విడుదల చేసేందుకు సీఎం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత గజ్వేల్ లోనూ నిధులు కురిపించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటి నిర్ణయాలపైనే సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది.
Also read: సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!
అధికార పార్టీ శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో చిన్న చిన్న రోడ్ల మరమ్మతులకు, డ్రైనేజీ పనులకు నిధులు లేక ఇబ్బందులు పడుతుంటే, బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలకే కోట్ల రూపాయలు విడుదల చేయడం ఏమిటని? పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమ నియోజకవర్గాల్లో ప్రజలు చిన్న పనుల కోసం నిలదీస్తుంటే ముఖం చాటేయాల్సి వస్తోందని ఓ ఎమ్మెల్యే తెలిపారు.
రాజకీయంగా సిరిసిల్ల, సిద్దిపేట్, గజ్వేల్‌లను తమ గ్రిప్‌లోకి తెచ్చుకోవాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నప్పటికీ, బీఆర్ఎస్ ముఖ్య నేతలకు నిధులు రిలీజ్ చేయడం వలన స్థానిక ప్రజల్లో పెద్దగా మార్పు ఉండదనే వాదనను ఆయా ఎమ్మెల్యేలు వినిపిస్తున్నారు. పైగా తమ నాయకులు ఒత్తిడి తీసుకురావడం వలనే నిధులు రిలీజ్ చేశారని బీఆర్ ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటారని ఎమ్మెల్యేలు వివరిస్తున్నారు. రాజకీయ గ్రిప్ కోసం రాజకీయ స్ట్రాటజీలనే అమలు చేయాలని, ఆర్ధికంతో ముడి పడి ఉన్న అంశాలకు లైన్ క్లియర్ చేయడం వలన పెద్దగా మైలేజ్ రాదని అధికార పార్టీకి ఓ సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు.
Also read: ఆధ్యాత్మికత కాదు.. దేవుడిని పూజించేటప్పుడు కళ్లు మూసుకోవడం వెనుకున్న పక్కా సైన్స్ ఇదే!