Road Dust: స్వేచ్ఛ బ్యూరో: పట్టణ వాయు కాలుష్యంలో ధూళికణాల కాలుష్యాన్ని నియంత్రించేందుకు రోడ్ డస్ట్ నియంత్రణకు ప్రాధాన్యత ఇస్తున్నామని అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ అన్నారు. రోడ్ల మెరుగుదల, ఎండ్-టు-ఎండ్ పేవింగ్, మెకానికల్ రోడ్ స్వీపింగ్, బహిరంగ ప్రాంతాల్లో పచ్చదనం పెంపుదల, ట్రాఫిక్ కారిడార్లలో గ్రీన్ కవర్, మినీ ఫారెస్టులు, మియావాకీ ప్లాంటేషన్లు వంటి చర్యలను నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (ఎన్ క్యాప్ ) కింద చేపడుతున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో బుధవారం ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)ఆమోదించిన ఎక్యుఎంసీ కార్యాచరణ ప్రణాళికలోని అంశాల పై చర్చించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఎక్యుఎంసీ చేపడుతున్న కార్యక్రమాలను సీనియర్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ ప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా నదీమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాయు కాలుష్య నియంత్రణ, వాయు నాణ్యత మెరుగుదల కోసం ఎయిర్ క్వాలిటి మానిటరింగ్ కమిటీ(ఎక్యుఎంసీ) ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయనితెలిపారు. శాస్త్రీయ పర్యవేక్షణ, కాలుష్య మూలాల గుర్తింపు, నియంత్రణ చర్యలు, పచ్చదనం పెంపు, ప్రజా అవగాహన కార్యక్రమాలతో కూడిన సమగ్ర కార్యాచరణను కొనసాగిస్తుండటం అభినందనీయమన్నారు.
ఎయిర్ క్వాలిటి డ్యాష్ బోర్డు అభివృద్ధి ప్రక్రియ
క్యూర్ ప్రాంతంలో వాయు నాణ్యతను మరింత ఖచ్చితంగా, నిరంతరంగా పర్యవేక్షించేందుకు 13 ‘నిరంతర పరిసర వాయు నాణ్యత పర్యవేక్షణ వ్యవస్థ’ల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతున్నదని, పర్యవేక్షణ కేంద్రాల స్థానాలను శాస్త్రీయంగా నిర్ణయించి, ఆయా ప్రాంతాల్లోని వాయు నాణ్యతకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని పొందేలా సాంకేతిక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. సీఏఏఈక్యూఎంఎస్లనుంచి లభించే డేటాను సమగ్రంగా అందుబాటులోకి తీసుకురావడానికి ‘ఎయిర్ క్వాలిటి డ్యాష్ బోర్డు’ అభివృద్ధి ప్రక్రియ కూడా కొనసాగుతున్నదని, సంబంధిత శాఖలకు ఎస్ఎంఎస్ అలర్ట్ ల ద్వారా వాయు నాణ్యతకు సంబంధించిన సమాచారం చేరవేస్తారన్నారు.
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులు పెంచే చర్యలు..
వాహనాల ఉద్గారాలను తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, ఈవీ ఛార్జింగ్ మౌలిక వసతుల విస్తరణ, పీయూసీ వ్యవస్థ బలోపేతం వంటి చర్యలు కొనసాగుతున్నాయని, ప్రభుత్వ వాహనాల కొనుగోలు, అద్దెకు తీసుకునే వాహనాల్లో ఈవీలకు ప్రాధాన్యత కల్పించే చర్యలు అమలయ్యాయన్నారు. పీయూసీవ్యవస్థను మరింత సమర్థవంతం చేసేందుకు రాష్ట్రంలోని 516 పీయూసీ కేంద్రాలను కేంద్ర సర్వర్‌తో అనుసంధానం చేయడం జరిగిందని, ఇప్పటివరకు 36,14,208 పరీక్షలు నిర్వహించినట్లు రవాణా శాఖ నివేదించిందన్నారు. పీయూసీ గడువు ముగిసిన వాహనాలపై ఆటోమేటిక్ చలాన్ల విధానం అమలు చేసేందుకు వాహనాల నంబర్ ప్లేట్లను స్వయంచాలకంగా గుర్తించే (ఏఎన్పీఆర్) కెమెరాల ఏర్పాటుకు కూడా చర్యలు చేపడుతున్నారన్నారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా రంగంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని పెంచే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఆర్టీసీ ప్రస్తుతం జీహెచ్ఎంసీపరిధిలో 310 ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోందన్నారు. పీఎం ఈ డ్రైవ్ కింద రాష్ట్రానికి కేటాయించిన ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టే ప్రక్రియ కూడా కొనసాగుతున్నదన్నారు.
అధికారులకు సూచనలు..
ఎన్ క్యాప్ దేశవ్యాప్తంగా 130 నగరాల్లో తొలిసారిగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు పర్యవేక్షణ్ లో తెలంగాణకు గుర్తింపు లభించిందని, నల్గొండలోని 16వ వార్డు కేటగిరి 3 (10 వేల జనాభా) కింద జాతీయ స్థాయిలో రెండో ర్యాంక్ సాధించి రూ.20 లక్షల పురస్కారం పొందిందన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్ 215వ వార్డు, గన్‌ఫౌండ్రీ 154వ వార్డు, సంగారెడ్డిలోని 31వ వార్డు రాష్ట్ర స్థాయిలో కేటగిరి 1,2,3 కింద అత్యుత్తమ పనితీరు కనబరిచిన వార్డులుగా నిలిచాయన్నారు. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ హైదరాబాద్, సికింద్రాబాద్ లలో సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను విస్తరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. రవాణా, మున్సిపల్ పరిపాలన, పరిశ్రమలు, ట్రాఫిక్ వ్యవసాయం, పట్టణాభివృద్ధి తదితర శాఖల సమన్వయంతోనే వాయు కాలుష్యానికి దీర్ఘకాలిక పరిష్కారం సాధ్యమని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి మెంబర్ సెక్రటరీ, కమిటీ మెంబర్ కన్వీనర్ రవి స్పష్టం చేశారు. రియల్‌టైమ్ వాయు నాణ్యత డేటా, కాలుష్య మూలాల అధ్యయన ఫలితాలు, ఉద్గారాల సమగ్ర లెక్కింపు, శాస్త్రీయ అధ్యయనాలు, ఫీల్డ్ లెవల్ చర్యలను సమన్వయం చేసి కాలుష్య మూలాలను లక్ష్యంగా చేసుకుని టిజిపిసిబి చర్యలు చేపడుతున్నదని తెలిపారు. ఎన్ క్యాప్ నోడల్ ఆఫీసర్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
Also Read: ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!