LTPO Display: సాధారణంగా స్మార్ట్‌ఫోన్ కొనేటప్పుడు డిస్‌ప్లే క్వాలిటీ గురించి మనం చాలా రకాలుగా ఆలోచిస్తుంటాం. AMOLED, OLED అంటూ రకరకాల పేర్లు వింటుంటాం. అయితే ఈమధ్య ప్రీమియం ఫోన్లలో LTPO అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది కేవలం ఒక డిస్‌ప్లే రకం మాత్రమే కాదు.. ఫోన్ స్క్రీన్ పనితీరును, బ్యాటరీ లైఫ్‌ను పెంచే ఒక అద్భుతమైన బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీ. దీని గురించి కాస్త వివరణాత్మకంగా తెలుసుకుందాం రండి..
LTPO అంటే లో-టెంపరేచర్ పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్. ఇది స్క్రీన్ లోపల ఉండే పిక్సెల్స్‌ను నియంత్రించే ఒక ప్రత్యేక వ్యవస్థ. ఇందులో ఎల్‌టీపీఎస్, ఆక్సైడ్ టిఎఫ్ టీ అనే రెండు వేర్వేరు సాంకేతికతలను కలిపి వాడుతారు. స్క్రీన్ వేగంగా స్పందించడానికి ఎల్‌టీపీఎస్ సహాయపడితే.. తక్కువ విద్యుత్ ఖర్చు అవ్వడానికి ఆక్సైడ్ ఉపయోగపడుతుంది. అంటే ఇది AMOLED లేదా OLED స్క్రీన్లను రీప్లేస్ చేయదు. కానీ వాటి కింద ఉండి పనితీరును మెరుగుపరుస్తుంది.
Also Read: ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?
మనం ఫోన్ వాడేటప్పుడు ప్రతి క్షణం ఒకేలాంటి రిఫ్రెష్ రేట్ అవసరం ఉండదు. గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు స్క్రీన్ వేగంగా స్పందించాలి. అదే ఒక ఫొటో చూస్తున్నప్పుడు లేదా ఈ-బుక్ చదువుతున్నప్పుడు అంత స్పీడ్ అవసరం లేదు. LTPO టెక్నాలజీ మనం చేసే పనిని బట్టి స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ను తనంతట తానే మార్చుకుంటుంది. అవసరాన్ని బట్టి 120Hz నుండి 1Hz వరకు తగ్గించుకుంటూ పవర్ ఆదా చేస్తుంది.
ఈ టెక్నాలజీ వల్ల అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాటరీ లైఫ్ పెరగడం. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే వాడుతున్నప్పుడు స్క్రీన్ కేవలం 1Hz రిఫ్రెష్ రేట్‌పై పనిచేసి చాలా తక్కువ బ్యాటరీని వాడుకుంటుంది. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం ఉండదు. అలాగే స్మూత్ ఎక్స్‌పీరియన్స్ కోల్పోకుండానే మంచి బ్యాటరీ బ్యాకప్ పొందవచ్చు. యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా స్క్రీన్ స్పందించడం దీని ప్రత్యేకత.
ఇన్ని మంచి విషయాలు ఉన్నప్పటికీ.. ఈ డిస్‌ప్లేల తయారీ ఖర్చు చాలా ఎక్కువ. అందుకే ఇవి కేవలం ప్రీమియం ఫోన్లు, యాపిల్ వాచ్ లాంటి ఖరీదైన గ్యాడ్జెట్లలోనే కనిపిస్తాయి. సాధారణ OLED స్క్రీన్లతో పోలిస్తే.. వీటి డిజైన్ కొంచెం కాంప్లికేటెడ్. తయారీ ఖర్చు ఎక్కువగా ఉండటం వల్ల బడ్జెట్ ఫోన్లలో ఈ ఫీచర్ ఇవ్వడం కంపెనీలకు కాస్త కష్టమైన విషయమే.
Also Read: ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్ ఆన్ చేసుకోండి!