BigTV English

BRS Troubles: గులాబీ నేతల పక్క చూపులు

BRS Troubles: గులాబీ నేతల పక్క చూపులు

BRS Troubles: ఒకప్పుడు ఆ జిల్లా అంటే గులాబీ పార్టీకి పెట్టని కోటగా చెప్పేవారు. ఇంకా చెప్పాలంటే మలి దశ తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచీ గులాబీ బాస్‌కు అది సెంటిమెంట్ జిల్లా కూడా. అలాంటి చోట ఇప్పుడు బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందట. నేతలు పక్క చూపులు చూస్తుండడంతో ఏ క్షణం ఎవరు ఉంటారో.. ఎవరు జంపవుతారో తెలియని పరిస్థితి నెలకొందట. ఇదే ఇప్పుడు కారు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.


బీఆర్ఎస్‌కు అండగా నిలిచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా

ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. బీఆర్ఎస్‌కు కంచుకోటగా చెబుతుంటారు. మలి దశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడినప్పటి నుంచీ ఈ జిల్లా.. కారు పార్టీకి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. నిజానికి కరీంనగర్ జిల్లాను సెంటిమెంట్‌గా భావిస్తుంటారు గులాబీ బాస్ కేసీఆర్. అందుకే ఏ కొత్త కార్యక్రమం మొదలు పెట్టాలన్నా ఫస్ట్ ఛాయిస్ కరీంనగర్ జిల్లానే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఇక్కడి నుంచే ఎదుర్కొన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉన్నప్పటి నుంచి లేటెస్ట్ అసెంబ్లీ ఎన్నికల వరకు జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున ఆదరించారు. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 13 స్థానాల్లో 12 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికలు, జెడ్పీ పీఠాలు, ఇలా ఎన్నికలు ఏవైనా 95 శాతానికి పైగా గులాబీ నేతలే కైవసం చేసుకున్నారంటే ప్రజలు కారు పార్టీని ఏ స్థాయిలో అక్కున చేర్చుకున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


మొత్తం ఐదు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయం

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా వీచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు సైతం ఐదు స్థానాల్లో కారు పార్టీ ఎమ్మెల్యేలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో విజయం సాధించారు. సిరిసిల్ల, కరీంనగర్, హుజురాబాద్, జగిత్యాల, కోరుట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. అయితే.. ఎన్నికలైన కొద్ది రోజులకు జగిత్యాల ఎమ్మెల్యే అధికార పార్టీకి జైకొట్టగా.. ప్రస్తుతం కేటీఆర్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ కుమార్ మాత్రమే మిగిలారు.

కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న గులాబీ నేతలు

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకెళుతున్నారు. ఇదే సమయంలో గత ప్రభుత్వంలో జరిగిన అనేక తప్పులు, లోపాలు, స్కాములు ఒక్కోటిగా బయటకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై దూకుడుగా వెళ్లడంలో వెనుకబడుతున్నారన్న చర్చ జరుగుతోంది. జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేటీఆర్ సైతం కేసుల చుట్టూ తిరగాల్సి రావడంతో నియోజకవర్గంలో నాయకులకు అందుబాటులో ఉండలేని పరిస్థితి నెలకొందట.

ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో కొనసాగలేకపోతున్న..

కేవలం ఇదే కాదు.. తెలంగాణలో బీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా వలస నేతలకే పదవులు కట్టబెట్టిందన్న విమర్శలున్నాయి. దీంతో.. ఉద్యమ కాలం నుంచి పార్టీని అంటి పెట్టుకొని ఉన్న నేతల్లో పెద్ద ఎత్తున అసంతృప్తి నెలకొంది. అయితే.. పార్టీ పవర్‌లో ఉండడంతో ఎలాగోలా సర్థుకుపోయారట. కానీ, ఇప్పుడు చూస్తే అగ్రనేతలు అందుబాటులో లేకపోవడం, ఇప్పటికే ఉన్న ఎమ్మెల్యేలు కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుండడంతో భరోసా ఇచ్చే వారే లేరన్న ఆలోచనలో ఉన్నారట కొందరు. ఇలాంటి పరిస్థితుల్లో మరో మూడేళ్లకు పైగా కారు పార్టీలో కొనసాగటం కష్టమేనని భావిస్తున్నారట కొందరు వలస వచ్చిన నేతలు. ఈ క్రమంలోనే హస్తం పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే.. కాంగ్రెస్ పార్టీ వలసలకు తలుపు తియ్యకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారట గులాబీ పార్టీకి చెందిన వలస నాయకులు.

Also Read: రాజ్‌భవన్‌తో పాటు కొన్ని ప్రాంతాలకు హైఅలర్ట్.. ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

బీజేపీ ఎంపీల హామీ లభిస్తే చేరేందుకు రెడీ

కేంద్రంలో అధికారంలో ఉండడంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు కొనసాగుతున్నారు. ఇక, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన మరో నేత ఈటల రాజేందర్ సైతం మల్కాజ్‌గిరి ఎంపీగా కీలక పాత్ర పోషిస్తున్నారు. దీంతో.. కమలం పార్టీలో చేరితే ఎలా ఉంటుందన్న దానిపై ఆలోచనలు చేయడం, లెక్కలు వేయడం చేస్తున్నారట కారు పార్టీ నేతలు. బీజేపీ ఎంపీల నుంచి తమ భవిష్యత్‌కు సంబంధించి స్పష్టమైన హామీ లభిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లోగా కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారట. మొత్తంగా చూస్తే రాబోయే రోజుల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయన్న టాక్ విన్పిస్తోంది.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×