రోగానికి మందేయమంటే.. రోగినే చంపేద్దామనుకునే పాలకుడి తీరు ఇలాగే ఉంటుంది కాబోలు! నాడు కేసీఆర్ ధర్నాచౌక్‌ను మూసేశాడు. నేడు మోడీ జంతర్‌మంతర్‌కు తాళం వేసేశాడు. సమస్య అసలు రూపమేమిటో తెలిసినప్పుడు దాన్ని పరిష్కరించే దిశగా కాకుండా.. ప్రశ్నించే గొంతుకలే లేకుండా చేయాలనే పాలకుడి ఆలోచనకు ఈ పరిణమాలే ప్రతిరూపాలు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాపక్షంగా ఆలోచించే మైండ్.. అధికార దర్పం తోడు కాగానే అది అన్యాయంగా కనిపిస్తుంది. ఉద్యమాల ద్వారానే స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ దళపతి కేసీఆర్ కూడా తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. నిలదీయడాన్ని తట్టుకోలేకపోయాడు. పాలనా వైఫల్యాలను ఎండగట్టడాన్ని భరించలేకపోయాడు. అందుకే నిత్యం చికాకును తెప్పించేదిగా భావించిన ధర్నా చౌక్‌ను ఎత్తేయమని నియంతలా ఆదేశాలు జారీ చేసి అందరికీ అవాక్కయ్యేలా చేశాడు.
ప్రజా సంఘాలు దీనిపై రోడ్డుమీదకు వచ్చి ఆందోళన చేసినా ఆయన కనుకరించలేదు. తనకు తెలంగాణలో తిరుగులేదనుకున్నాడు. మొత్తం తను, తన కుటుంబమే పాలిస్తుందని అంచనాకు వచ్చేసినట్టున్నాడు అప్పటికే. తనకు మించిన రాజనీతిజ్ఞుడు ఇంకొకడు ఎవడూ లేడని కూడా అనుకుని ఉంటాడు. అందుకే అలాంటి నిర్ణయాలు తీసేసుకున్నాడు.
ఇప్పుడు అచ్చంగా మన మోడీగారు కూడా ఇదే చేస్తున్నాడు. రోగమొకటైతే మందొకటి అన్నట్టుగా.. అసలు సమస్యలకు పరిష్కారం చూపకుండా, ప్రజాగ్రహాన్ని పరిగణలోకి తీసుకుని ఆత్మపరిశీలన చేసుకోకుండా, మీరు ప్రశ్నిస్తే.. మేం అణిచేస్తామనే సూత్రానికే కమిట్ అయ్యాడు. అందుకే జంతర్‌మంతర్‌కు తాళమేసేశాడు.
ఇక మీరు దిక్కున్న చోట చెప్పుకోండని, ఉద్యమ కేంద్రం మీదే దాడి చేసినట్టు సంబురపడి చంకలు గుద్దుకున్నంత పనిచేసింది మోడీ సర్కార్. కానీ వేదిక మారినా, ప్రశ్నించే గొంతుకల్లో అణువంత కూడా వేడి తగ్గలేదనే విషయం కేంద్రం గమనించలేకపోతున్నది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు తలొగ్గేలా చేసింది జంతర్ మంతర్ వేదికే కావొచ్చు. కానీ ఆ వేదిక మీద నుంచి గళమెత్తిన ఉద్యమగళాల ఒత్తిడి.. పోరాటానికి జీవం పోసింది. ఇప్పుడు వేదిక మారినా.. జంతర్ మంతర్ స్పూర్తే కేంద్రాన్ని వెంటాడుతూనే ఉంటుంది.
ఉద్యమకారులను చెల్లాచెదురు చేయడం మూలంగా ఆ గొంతుకలో వాడిని తగ్గించొచ్చని భావించిన కేంద్రానికి .. బొద్దింకల నుంచి వచ్చిన రియాక్టు ఘాటుగానే తగిలింది. ‘ఇక దేశమే జంతర్‌మంతర్ కానుంది..’ అనే కౌంటర్ ఎటాక్… కేంద్రం చర్యలు అగ్నికి ఆజ్యంగానే ఉన్నాయనే భావనను దేశానికి అందించింది.
అంటే.. మరింత రెచ్చగొట్టి చిచ్చుపెట్టుకునే చర్యకే కేంద్రం దిగిందన్న మాట. ఇలాంటి నియంత ఆలోచనలను చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యాడు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కాకలు తీరిన యోధులే కాలగర్బంలో కలిసిపోతున్న వేళ.. మోడీ కూడా దీనికి అతీతుడేమీ కాదంటున్నాయి కాక్రోచులు.