BigTV English

Ram Temple : రామమందిరం వెనక కీలక యోధులు వీరే..!

Ram Temple : రామమందిరం వెనక కీలక యోధులు వీరే..!
 Ram Temple

Ram Temple : ఐదు వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో నిర్మితమైన భవ్యమైన మందిరంలో రామయ్య కొలువుదీరుతున్నాడు. అయితే.. నేటి కల సాకారం కావటానికి వెనక ఎందరో నేతలు అలుపెరగని పోరాటాలు చేశారు. రామ జన్మభూమి ఉద్యమం పేరుతో ఈ ప్రయత్నంలో భాగస్వాములైన నేతలు, వారి సేవల వివరాలు..


లాల్‌ కృష్ణ ఆడ్వాణీ : సోమనాథ్ నుంచి 25 సెప్టెంబర్ 1990న ఆడ్వాణీ రథయాత్రను ప్రారంభించారు. ‘మందిర్ వహీ బనాయేంగే’ అంటూ దేశంలోని హిందువులందరినీ ఒక్కటి చేసిన ప్రధాన నేతల్లో ముందు చెప్పుకోవాల్సింది ఈయన గురించే. అందుకే రామ జన్మభూమి ఉద్యమం అనగానే ముందుగా ఈయన పేరే గుర్తుకొస్తుంది. ఎన్నో ఏళ్లుగా సాధుసంతులు అయోధ్యలో రామాలయం కోసం పోరాడుతున్నా.. ఆ అంశాన్ని రాజకీయ, సామాజిక ఉద్యమంగా మలిచి ప్రజాబాహుళ్యంలోకి చొచ్చుకుపోయేలా చేసింది మాత్రం ఆడ్వాణీయే. ఒక టొయోటా మినీ ట్రక్కును రథంగా మార్చి ఆయన చేసిన యాత్రకు విస్తృత మద్దతు లభించింది. 1984 లోక్‌సభ ఎన్నికల్లో 2 సీట్లతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీని వరుసగా రెండుసార్లు అధికారంలోకి రావటానికీ ఈ యాత్ర కారణమైంది.

ప్రమోద్‌ మహాజన్‌ : ఆడ్వాణీ తొలుత సోమ్‌నాథ్‌ నుంచి అయోధ్య దాకా పాదయాత్ర చేపట్టాలని భావించినా, ప్రమోద్ మహాజన్ దానిని రామ రథయాత్రగా రూపకల్పన చేశారు. ఆయన ఐడియా అద్భుతంగా వర్కవుట్‌ అయ్యింది. రథయాత్ర సక్సెస్‌ అయింది.


అశోక్‌ సింఘాల్‌ : విశ్వహిందూ పరిషత్‌ 1984లో ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో వందలాది సాధువులు, హిందూ ప్రముఖులతో ‘ధర్మ సదస్సు’ నిర్వహించి, రామజన్మభూమి ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించింది. ఈ ఉద్యమ బాధ్యతను అశోక్‌ సింఘాల్‌ భుజాన వేసుకున్నారు. 1980లో రామజన్మభూమి తాళాలు తెరవాలని కోరుతూ.. రామ్‌జానకీ రథయాత్రను, అనంతరం కరసేవ ఉద్యమాన్ని నడిపారు. బాబ్రీమసీదు తాళాలు తెరుచుకున్న తర్వాత.. అక్కడ ఆలయం కట్టాలనే ఉద్యమానికి తెరతీశారు. ఆపై దాన్ని ఆడ్వాణీ అందిపుచ్చుకున్నారు.

మురళీ మనోహర్‌ జోషి : ఆడ్వాణీ చేపట్టిన రథయాత్రలో ‘సెకండ్‌-ఇన్‌-కమాండ్‌’గా వ్యవహరించిన కీలక వ్యక్తి మురళీ మనోహర్‌జోషీ. 1992లో మథురలో.. బాబ్రీమసీదు కూల్చివేతకు కారణమయ్యేలా కరసేవకులను రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

ఉమాభారతి : భక్తిరసపూరితంగా, భావోద్వేగాలను ఆకాశాన్ని అంటేలా ప్రసంగాలు చేయడంలో దిట్ట. బాబ్రీమసీదు కూల్చివేత వేళ.. ఆమె తన నినాదాలతో కరసేవకులను రెచ్చగొట్టినట్టు లిబర్హాన్‌ కమిషన్‌ తేల్చింది. ప్రణాళిక ప్రకారం ఆమె ఇచ్చిన సంకేతంతోనే మసీదు కూల్చివేత మొదలైందని ఆమెపై అభియోగాలు దాఖలయ్యాయి.

వినయ్‌ కతియార్‌ : మందిర నిర్మాణ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ఏర్పాటైన సంస్థ బజ్‌రంగ్‌ దళ్‌కు తొలి అధ్యక్షుడు వినయ్‌ కతియార్‌. ఫైర్‌బ్రాండ్‌. కాగా, బాబ్రీ తాళాలు తెరిపించి శిలాన్యా్‌సకు అనుమతించిన రాజీవ్‌ గాంధీ, మసీదు కూల్చివేత వేళ మౌనముద్ర దాల్చిన నాటి ప్రధాని పీవీ కూడా మందిర నిర్మాణంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించారు.

కల్యాణ్‌ సింగ్‌ : బాబ్రీ కూల్చివేత జరిగిన సమయంలో యూపీ సీఎం. 1991 జూన్‌లో ఆయన సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే రామ్‌లల్లా విగ్రహం వద్దకు వెళ్లి తన పాలనలోనే అక్కడ రామమందిర నిర్మాణం జరిపించి తీరుతానని ప్రతిజ్ఞ చేశారు. 1992లో మసీదు కూల్చివేస్తున్న కరసేవకులపై ఫైరింగ్‌ ఆర్డర్‌ ఇవ్వడానికి నిరాకరించారు. రామమందిర నిర్మాణ ఉద్యమంలో అత్యంత కీలక ఘట్టం అదే.

Related News

Telangana: ఆధిపత్య పోరుకు పుల్ స్టాప్.. మల్లు రవి యాక్షన్ వర్కౌట్ అవుతుందా?

Luxury Cars Scam: లగ్జరీ కార్ల అక్రమ దందా.. వెనుకున్నది ఎవరంటే!

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Big Stories

×