EPAPER

Teachers Day 2024: భారత తత్వనిధి.. సర్వేపల్లి

Teachers Day 2024: భారత తత్వనిధి.. సర్వేపల్లి

Sarvepalli Radhakrishnan:‘దేవుడు, గురువు ఇద్దరూ ఎదురుగా కనిపిస్తే నేను మొదట గురువుకే నమస్కరిస్తా. ఎందుకంటే ఆయన భగవంతుడని నాకు మొదట చెప్పింది గురువే కాబట్టి’ అన్నాడు సంత్ కబీర్ దాస్. భారతీయ సమాజంలో గురువుకు ఉన్న విలువ ఎంతటిదో చెప్పే ఒక ఉదాహరణ ఇది. ‘గు’ అంటే చీకటి, ‘రు’ అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనిషిలోని అజ్ఞానపు తెరలను తీసి, జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు అన్నమాట. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన మహనీయుడు.. డా. సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 5ను మనం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.


1888 సెప్టెంబర్ 5న తిరుపతి దగ్గరి తిరుత్తణిలోని ఒక తెలుగు కుటుంబంలో రాధాకృష్ణన్ జన్మించారు. తల్లిదండ్రులు వీరాస్వామి, సీతమ్మ. రాధాకృష్ణ బాల్యం, పాఠశాల విద్యాభ్యాసం తిరుత్తణి, తిరుపతిలోనే జరిగాయి. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ హవా ఎక్కువగా నడిచేది. రాధాకృష్ణ తొలిసారి బడిలో చేరినప్పుడు.. రిజిస్టర్‌లో రాధాకృష్ణ అనే పేరుకు బదులు అక్కడి తమిళ టీచరు తనదైన శైలిలో రాధాకృష్ణన్ అని రాయటంతో నాటి నుంచి ఆయన పేరు అలాగే కొనసాగింది. బాల్యం నుంచే రాధాకృష్ణన్ అసాధారణమైన తెలివితేటలతో టీచర్లను ఆశ్చర్యపరచేవారు. రాధాకృష్ణన్ తండ్రి చిన్న రెవెన్యూ ఉద్యోగి. వీరిది పెద్ద కుటుంబం కావటంతో అయిదో తరగతి తర్వాత కొడుకును చదువు మాన్పించి పూజారి పనిలో పెట్టాలనుకున్నాడు. కానీ, చదువంటే ప్రాణం పెట్టే రాధాకృష్ణన్ తిరుపతిలోని క్రిస్టియన్ మిషనరీ హైస్కూలులో చేరి, స్కాలర్‌షిప్ పొందారు. తన ప్రతిభతో క్లాసు ఫస్ట్ ర్యాంక్ సాధించి, ఆ స్కాలర్‌షిప్‌ను నిలుపుకుంటూ తర్వాత చదువు కొనసాగించాడు. భోజనం చేసేందుకు అరిటాకు కొనలేని కటికపేదరికాన్ని అనుభవించిన రోజుల్లో.. గదిలో నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలూ అనేకం ఉన్నాయి. తర్వాత మద్రాసు చేరి అక్కడి క్రిస్టియన్ కాలేజీ నుంచి తత్వశాస్త్రంలో ఎంఏ డిగ్రీ అందుకున్నారు. తన 16వ ఏట శివకామేశ్వరిని వివాహమాడారు. వీరికి ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు.

ఆయన 1909లో, తన 21 ఏట మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో అధ్యాపకుడిగా చేరారు. తర్వాత కలకత్తా, మైసూర్ వర్సిటీల్లో బోధించారు. 1931 నుండి ఐదేళ్లు ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా సేవలందించారు. 1948లో బెనారస్ హిందూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా విద్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 1948 నుంచి నాలుగేళ్ల పాటు యునెస్కోలో భారత ప్రతినిధిగా, తర్వాత రష్యాలో రాయబారిగా పనిచేశారు. 1952లో భారత తొలి ఉపరాష్ట్రపతిగా, 1962లో రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారతీయ తాత్విక చింతనతో బాటు పశ్చిమదేశాల మహాకావ్యాలు, కళలు, దర్శనాలను రాధాకృష్ణన్ లోతుగా అధ్యయనం చేసి, తూర్పు – పశ్చిమ దేశాల తాత్విక చింతనలకు వారధిగా నిలిచి, మారిన పరిస్థితులకు అనుగుణంగా వాటిపై వ్యాఖ్యానాలు చేశారు.


తత్వశాస్త్ర ప్రధాన శాఖలైన మెటాఫిజిక్స్, లాజిక్, ఎపిస్టమాలజీ, ఎథిక్స్, సైకాలజీలను అధ్యయనం చేసి, పలు గ్రంథాలు రాశారు. వాటిలో ‘ఇండియన్ ఫిలాసఫీ’, ‘ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘హిందూ వ్యూ ఆఫ్ లైఫ్’, ‘రెలిజియన్ అండ్ సైన్స్’, ‘రికవరీ ఆఫ్ ఫెయిత్’ విస్తృత ప్రాచుర్యం పొందాయి. ఉపనిషత్తులు, భగవద్గీత, బుద్ధుని దమ్మపదాలను అసాధారమైన ప్రమాణాలతో ఇంగ్లిష్‌లోకి అనువదించి, ఆ వెలుగులను పశ్చిమ దేశాలకు ప్రసరింపజేశారు. చివరి రోజుల వరకు రోజుకు 12 గంటల పాటు చదవటం, రాయటం చేస్తూ వచ్చారు. తత్వం అనేది జీవితాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక గొప్ప మార్గమని రాధాకృష్ణన్ భావించారు. భారతీయ తత్వాన్ని అర్ధం చేసుకోవటమనేది ఒక సాంస్కృతిక చికిత్స అని, భారతీయ తాత్వికచింతన ఏ ఇతర ఆలోచనా రీతుల కంటే తక్కువ కాదని నిరూపించారు. భారతీయ తాత్విక చింతనను ఇంగ్లిష్‌లో పాశ్చాత్య ప్రపంచానికి అందించి, మెప్పించిన ధీశాలిగా నిలిచారు. పాశ్చాత్య తత్వవేత్తలు చెబుతున్న భావనలు.. ప్రాచీన భారతీయ వేదాంతంలో ఉన్నాయని ఉదాహరణలతో నిరూపించారు.

నెహ్రూ ప్రభుత్వం 1948లో ఏర్పాటు చేసిన తొలి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు ఛైర్మన్‌గా రాధాకృష్ణన్‌ పనిచేశారు. వర్సిటీలు జ్ఞాననిలయాలుగా నిలిచి, కొత్త ఆవిష్కరణలు చేయాలని, దేశం స్వావలంబన దిశగా, సార్వభౌమ స్వతంత్ర దేశంగా రూపొందాలని చెబుతూ అందుకు ఎలాంటి విద్యావిధానం కావాలనేది రాధాకృష్ణన్ కమిషన్ సూచించింది. దేశంలో కాలేజీలు పెరగాలని, విద్యా వ్యవస్థను కేవలం ప్రభుత్వమే నిర్వహించాలని, విద్యపై పెట్టే ఖర్చును.. ప్రభుత్వాలు ప్రజల భవిష్యత్ కోసం వెచ్చించే పెట్టుబడిగా భావించాలని రాధాకృష్ణన్ సూచించారు. ‘ఉపాధ్యాయులు సమాజంలో అత్యున్నత మేధోజీవులు. చరిత్రను మలచడంలో, సామాజిక పునర్నిర్మాణంలో దారిచూపే దార్శనికులు. టీచర్లకు బోధనాంశాల పట్ల ప్రేమ, తమ శిక్షణలో విద్యార్థులు ఎదగాలనే ఆకాంక్ష ఉండాలి’ అని అనేవారు. క్లాసులో టీచర్ – స్టూడెంట్ నిష్పత్తి తక్కువగా ఉంటేనే విద్యార్థులు తమలోని స్వేచ్ఛను, మార్మికతను, మేధోపరమైన భావావేశాలను వ్యక్తం చేయగలరని స్పష్టం చేశారు.

‘ప్రకృతి వనరులను సద్వినియోగం చేసుకునే సామర్థ్యం కలిగించడం, వ్యక్తుల వికాసానికి, జీవితోన్నతికి తోడ్పడే సృజనాత్మక సమాజ నిర్మాణమే విద్య లక్ష్యం’ అని ఆయన ఎలుగెత్తి చాటారు. ‘భయమంటే తెలియని, అన్యాయాన్ని సహించని, నైపుణ్యం, సామర్థ్యం, దృక్పథం, సాహసం, విలువలతో కూడిన విద్యార్థులను తయారుచేయడమే’ విద్యాసంస్థల విధ్యుక్త ధర్మమని ఆయన ఉద్బోధించారు. విద్య వ్యక్తులలో వివేచనను, సమతుల్యతను, మంచి చెడుల విచక్షణను కలిగిస్తుందన్నారు. ఒక దేశం భవిష్యత్తు.. అక్కడి విద్యాసంస్థలను చూసినప్పుడు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు. సంపదను పెంపొందించే, అసమానతలు తగ్గించే, సామాజిక, ఆర్థిక అభ్యున్నతిని సాధించే, జీవన ప్రమాణాలను మెరుగుపరిచే ఉజ్వల భారతదేశాన్ని నిర్మించేందుకు విద్యను ఒక ముఖ్యసాధనంగా చేసుకోవాలని రాధాకృష్ణన్ పదే పదే చెప్పేవారు.

విద్యాసంస్థల్లో వాణిజ్య దృక్పథం అసమానతల సమాజానికి, పలు ఇతర దుష్ఫలితాలకు దారితీస్తుందని ఆనాడే హెచ్చరించారు. సత్వాన్వేషణ, సహనం, శ్రద్ధాసక్తులు పక్షపాతం లేకుండా ఉండడం, శ్రమపై గౌరవం వంటి విలువలను మన విద్యా విధానం పెంపొందించాలని ఆకాంక్షించారు. సైన్స్ మనిషికి సౌకర్యాలను ఇస్తోందని, కానీ, అదే సైన్స్ మారణాయుధాలు, ప్రపంచ యుద్ధాలకు దోహదపడుతూ.. మానవాళి మనుగడను, మానవీయ విలువలను ప్రశ్నార్ధకం చేస్తోందని, ఈ చెడు ధోరణి పోవాలంటే, విద్యాబోధనలో సామాజిక, నీతిశాస్త్రాల బోధనను తప్పనిసరి చేయాలని రాధాకృష్ణన్ సూచించారు. ప్రస్తుతం దేశ విద్యావ్యవస్థ సర్వేపల్లి దార్శనిక స్ఫూర్తికి భిన్నంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సర్వేపల్లి విద్యా దృక్పథానికి ప్రాసంగికత ఉన్నది. ఆ మహనీయుడి బాటలో ప్రభుత్వ విద్య మరింతగా పెరగాలి. అప్పుడే విలువలతో కూడిన దేశం రూపొందుతుంది.

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×