Umpire Anil Chaudhary Shocking Reveals on MS Dhoni: మహేంద్ర సింగ్ ధోనీ.. క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియనివారు లేరు. క్రికెట్ లో విజయాలే కాదు.. రకరకాల హెయిర్ స్టయిల్స్ తో అందరినీ ఆకట్టుకునే ధోనీలో మరో కోణం దాగుందని అంపైర్ అనిల్ చౌదరి తెలిపారు. ఇంతకీ అదేమిటంటే.. ధోనీలో అంపైర్ కి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయని అన్నాడు. అతను ఇంట్రస్టు చూపిస్తే మంచి అంపైర్ అవుతాడని తెలిపాడు.
నిజానికి డీఆర్ ఎస్ ను క్రికెట్ అభిమానులు ‘ధోనీ రివ్యూ సిస్టమ్’ గా ముద్దుగా పిలుచుకుంటారు. ఎందుకంటే తను కీపింగ్ చేస్తూ, టీ సింబల్ చూపించాడంటే అవుట్ రావల్సిందేనని అంటుంటారు. అంత కచ్చితత్వం ఉంటుందని అభిమానులు చెబుతుంటారు.
ఈ విషయంలో అనిల్ ఏకీభవించలేదు. తను రివ్యూ కోరినవి చాలా వరకు నిజం కాలేదని అన్నాడు. కానీ తను అవుట్ అని భావిస్తే మాత్రం, మేం కూడా సందిగ్ధంలో పడుతుంటామని తెలిపాడు. అయితే జట్టు సహచరులు రివ్యూకి వెళదామని అంటే, వద్దని.. వారిని సముదాయిస్తూ ఉంటాడు. తను వద్దు అంటే, అది అవుట్ కాదనే అర్థమని తెలిపాడు. డీఆర్ఎస్ ఎంపికలో తను కరెక్టుగా ఉంటాడని అన్నాడు.
నిజానికి , ఏ జట్టులోనైనా వికెట్ కీపర్లు బంతిని ఫాలో అయినట్టు ఎవరూ కాలేరని అన్నాడు. ఎందుకంటే వారికి దగ్గరగానే బంతి ల్యాండ్ అవుతుంది కాబట్టి, తేలికగా తెలిసిపోతుందని అన్నాడు. అందుకే చాలామంది అంపైర్లు కీపర్ల కదలికలను గుర్తించి కూడా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారని అన్నాడు.
Also Read: తర్వాత భారత్ వంతు.. బంగ్లా కెప్టెన్ నజ్ముల్
ఈ మధ్య రిషబ్ పంత్ లో చాలా పరిణితి వచ్చిందని అన్నాడు. ఎల్బీడబ్ల్యూలు, బ్యాట్ కి టచ్ అయ్యిందా లేదా? లాంటివన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడని తెలిపాడు. అది అనుభవంతో వస్తుందని వివరించాడు. ఆఖరిగా ఆయన చెప్పిన మాటేమిటంటే.. ధోనీకి గానీ.. 7 గంటలు క్రీజులో గడిపే ఓపిక ఉంటే మాత్రం, తను మంచి అంపైర్ అవుతాడని తెలిపాడు.
అయితే రాబోయే రోజుల్లో.. అంటే మరో మూడేళ్ల తర్వాత, అంటే గౌతం గంభీర్ పదవీ కాలం పూర్తయిన తర్వాత బహుశా ధోనీ .. టీమ్ ఇండియా కోచ్ గా రావచ్చునని అంటున్నారు. లేదంటే చెన్నయ్ సూపర్ కింగ్స్ కి మెంటార్ గా జీవితాంతం ఉండిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు.
మొత్తానికి అనిల్ చౌదరి ఇలా గ్రౌండులో జరిగే విషయాలను చెప్పడంపై ప్రజల్లో ఆసక్తి కలుగుతోంది. ఈయన్ని చూసి పలువురు అంపైర్లు ఇదే బాట పడతారని, సామాజిక మాధ్యమాల్లో ఇక అంపైర్ల శకం ప్రారంభం కానుందని అంటున్నారు.