అమెరికాలో అసలేం జరుగుతోంది..? డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్‌గా రెండోసారి పదివి చేపట్టిన తర్వాత ప్రపంచంలో పరిస్థితులన్నీ అల్లకల్లోలంగా మారాయి. ఇప్పుడు ఏకంగా అమెరికా ఆర్థిక వ్యవస్థే అతలాకుతలం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ట్రంప్ దెబ్బకు ఇది వరకు ఎన్నడూ లేని విధంగా తాజాగా అమెరికన్ స్టాక్ మార్కెట్ భారీ పతనాన్ని చవిచూసింది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, అమెరికాలో మళ్లీ మాంద్యం రాబోతోందా అనే డౌట్లు వస్తున్నాయి. ఇంతకీ, అమెరికా మార్కెట్ ఇంతగా క్రాష్ అవ్వడానికి కారణం ఏంటీ…? అక్కడ స్టాక్స్ ఎందుకు అమ్మేస్తున్నారు..? ప్రపంచ వ్యాప్తంగా దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది…?
ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో పరిస్థితి.. ముఖ్యాంశాలు
⦿ దారుణంగా పడిపోయిన నాస్‌డాక్, ఎస్ అండ్ పీ
⦿ తుడిచిపెట్టుకుపోయిన రూ.349 లక్షల కోట్లు
⦿ అగ్రరాజ్యంలో ఆర్థికమాంద్యం నెలకొందనే వాదన
⦿ ఫలితంగా భారీగా కొనసాగిన అమ్మకాలు
⦿ టెక్నాలజీ సెగ్మెంట్‌కు చెందిన షేర్లను అమ్ముకున్న ఇన్వెస్టర్లు
⦿ 2022 తర్వాత ఈ సెగ్మెంట్‌లో అతిపెద్ద ఇంట్రాడే నష్టాలు రికార్డు
⦿ ఎస్ అండ్ పీ 2.7, నాస్‌డాక్ 4% క్షీణత
⦿ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 890 పాయింట్లు పతనం
⦿ 41,911.71 వద్ద ముగిసిన డౌ జోన్స్ ట్రేడింగ్
⦿ ఎస్ అండ్ పీ 155.64 పాయింట్లు నష్టం.. 5,614.56 వద్ద ముగింపు
⦿ నాస్‌డాక్ 727.90 పాయింట్ల మేరకు నష్టం
⦿ 17,468.32 వద్ద ముగిసిన ట్రేడింగ్
⦿ 15 శాతానికి పైగా పడిపోయిన టెస్లా షేర్లు
⦿ మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా, మెటా, ఆల్ఫాబెట్‌లకు అమ్మకాల ఒత్తిడి
⦿ 4% నుండి 11% మధ్య పడిపోయిన షేర్ల ధరలు
⦿ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాల ప్రభావం
⦿ అమెరికాలోని వినియోగదారులపై ద్రవ్యోల్బణ భారం
⦿ రెండేళ్ల నోట్ దిగుబడి 10.4 బేసిస్ పాయింట్లు తగ్గి 3.898%
⦿ పదేళ్ల నోట్ దిగుబడి 9.3 బేసిస్ పాయింట్లు తగ్గి 4.225%
⦿ 30 ఏళ్ల బాండ్ దిగుబడి 6.9 బేసిస్ పాయింట్లు తగ్గి 4.548%
⦿ కొనుగోళ్లు తగ్గించుకుని, పొదుపు పెంచుకుంటున్న వినియోగదారులు
⦿ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తి అయిన వినియోగంపై ప్రభావం
⦿ భారీగా పడిపోతున్న అమెరికా డాలర్ ఇండెక్స్
⦿ ఈ సూచీ ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 6 శాతం క్షీణత
⦿ 3 నెలల్లో గరిష్ట స్థాయి నుండి నిఫ్టీ ఐటి ఇండెక్స్ 20% క్షీణత
⦿ వస్తువుల ధరలను పెంచే సుంకాలు
⦿ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యం పరిమితం
⦿ పెట్టుబడులు పెట్టాలంటే భద్రతా హామీ అవసరం
⦿ యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి
⦿ 2025 అమెరికాలో మాంద్యం అంచనా 15% నుండి 25%
⦿ నిరుద్యోగం పెరగడం ప్రధాన కారణం
⦿ అమెరికాలో 2021 నిరుద్యోగిత రేటు 4.3%
⦿ 2006లో హౌసింగ్ మార్కెట్ పతనం
⦿ 2020లో కరోనా మహమ్మారి షాక్
⦿ కఠినమైన ఆర్థిక పరిస్థితుల నుండి ప్రస్తుత మాంద్యం
⦿ ఉద్యోగాలను తగ్గించడం, నిలిపివేయడం వంటి సమస్యలు
⦿ వినియోగదారులు డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడే స్థితి
సుమారు రూ.349 లక్షల కోట్లు హాంఫట్
అమెరికా స్టాక్ మార్కెట్ క్రాష్ అయ్యింది. ఇటీవల ఎప్పుడూ లేనంతగా భారీ పతనాన్ని చవి చూసింది. అధిక అమ్మకాల ఒత్తిడితో అమెరికన్ మార్కెట్ టెన్షన్ పెంచింది. నాస్‌డాక్, ఎస్ అండ్ పీ దారుణంగా పడిపోగా… ఏకంగా నాలుగు ట్రిలియన్ డాలర్లు… అంటే, రూ.349 లక్షల కోట్ల మేరకు తుడిచిపెట్టుకుపోయింది. ఫ్రాన్స్, యూకే వంటి కొన్ని దేశాల జీడిపి కంటే ఇది ఎక్కువ మొత్తం. ఈ పరిణామంతో అగ్రరాజ్యంలో ఆర్థికమాంద్యం నెలకొందనే వాదనలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే, దీనింతటికీ కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తోన్న వాణిజ్య విధానాలే అని అభిప్రాయం ఉంది. మెక్సికో, కెనడా, చైనాలపై భారీగా సుంకాలు విధించడం వంటి చర్యలు స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడానికి దారి తీశాయని అంటున్నారు. భారత్ సహా వివిధ దేశాలపై ట్రంప్ టారిఫ్ యుద్ధం తర్వాత ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ వార్ మొదలవ్వగా… ఆర్థిక మాంద్యం ఏర్పడిందనే ఆందోళనలు ఇన్వెస్టర్లను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఫలితంగా భారీగా అమ్మకాలు కొనసాగాయి. ప్రధానంగా టెక్నాలజీ సెగ్మెంట్‌కు చెందిన షేర్లను ఇన్వెస్టర్లు అమ్ముకున్నారు. 2022 తర్వాత ఈ సెగ్మెంట్‌లో అతిపెద్ద ఇంట్రాడే నష్టాలు రికార్డు ఇదే. ఈక్విటీలు మాత్రమే కాకుండా… కార్పొరేట్ బాండ్స్, క్రిప్టోకరెన్సీ సహా ఇతర రంగాల్లో కూడా భారీ అమ్మకాల రోజంతా కొనసాగాయి.
కొత్త టారిఫ్ ప్రకటనతో గందరగోళం
ఇక, భారత్ సహా కెనడా, మెక్సికో, చైనా వంటి అనేక దేశాలపై డొనాల్డ్ ట్రంప్ కొత్తగా టారిఫ్‌ను ప్రకటించడం మార్కెట్‌లో అనిశ్చితికి దారి తీసినట్టయింది. ఎస్ అండ్ పీ 2.7, నాస్‌డాక్ నాలుగు శాతం మేర క్షీణించింది. గత ఏడాది డిసెంబర్‌లో గరిష్ట స్థాయిలో అమెరికా షేర్ మార్కెట్ పతనం కాగా.. ఈ నాలుగు నెలల్లో దాన్ని మించిన స్థాయిలో పడిపోవడం చర్చనీయాంశమైంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 890 పాయింట్లు పతనమైంది 41,911.71 వద్ద దాని ట్రేడింగ్ ముగిసింది. ఎస్ అండ్ పీ 155.64 పాయింట్లను నష్టపోయి.. 5,614.56 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలో ఇదే అతిపెద్ద పతనం. ఈ క్రమంలో… నాస్‌డాక్ 727.90 పాయింట్ల మేర నష్టపోయింది. 17,468.32 వద్ద ట్రేడింగ్ ముగిసింది. ఇక, ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా షేర్లు కూడా 15 శాతానికి పైగా పడిపోయాయి. డిసెంబర్ 17 నుండి ఈ సంస్థ షేర్ వాల్యూ 50 శాతం ఆవిరయ్యింది. 2020 సెప్టెంబర్ తర్వాత అతిపెద్ద ఇంట్రాడే పతనం ఇదే. దీనితో, ఆర్థిక మాంద్యం భయంతో అమెరికా ట్రెజరీ దిగుమతులు భారీగా పడిపోయాయి. టాప్ టెక్ కంపెనీలైన మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా, మెటా, ఆల్ఫాబెట్ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోగా వాటి షేర్ల ధరలు 4% నుండి 11% మధ్య పడిపోయాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్ షేర్లు కూడా కుదేలయ్యాయి.
అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడమే కారణమా?
వాస్తవానికి ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా దాని పనితీరును అక్కడి స్టాక్ మార్కెట్లు ప్రతిబింబిస్తుంటాయి. అలాగే, అమెరికా మార్కెట్లు ఒక్కసారిగా భారీ క్షీణతను చూడటానికి అసలు కారణం యూఎస్ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటమేనని నిపుణులు చెబుతున్నారు. అయితే, దీనిపై స్పందించిన ట్రంప్… ‘తాను అమెరికా దీర్ఘకాలిక భవిష్యత్తు దృష్ట్యా తీసుకుంటున్న నిర్ణయాలను… స్వల్పకాలిక ప్రభావాలకు లోనయ్యే స్టాక్ మార్కెట్లకు ముడిపెట్టొద్దని’ అంటున్నారు. మరోవైపు, అమెరికా ఉన్నతాధికారులు, సలహాదారులు పెట్టుబడిదారుల భయాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ… ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాల ప్రభావం అందరికంటే ముందుగా అమెరికాలోని వినియోగదారులపై ద్రవ్యోల్బణం రూపంలో పడుతోందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే, ప్రపంచంలో అంత్యత శక్తివంతమైన కన్జూమర్ ఎకానమీగా అమెరికా ఉన్న ప్రస్తుతం ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేయిస్తున్నాయా అనే అనుమానాలు ప్రజల్లో రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అయితే దీనిపై కొందరు నిపుణులు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ యూరోపియన్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు మాత్రం అమెరికా స్టాక్ మార్కెట్ల పతనంతో క్షీణతను చూస్తున్నాయి.
ప్రపంచంపై ప్రభావం
అమెరికా మార్కెట్ల పతనం ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించింది. మార్చి 11 ప్రారంభ వాణిజ్యంలో, జపాన్ నిక్కీ 225 2.5 శాతం, దక్షిణ కొరియా కోస్పి 2.3 శాతం, ఆస్ట్రేలియా S&P/ASX 200 1.8 శాతం తగ్గాయి. అంతకుముందు, పాన్-యూరోపియన్ STOXX 600 ఇండెక్స్ 1.29 శాతం తగ్గింది. వాల్ స్ట్రీట్ రాత్రిపూట పతనమైన తర్వాత ఆసియా మార్కెట్లలో విస్తృత అమ్మకాలతో భారత ఈక్విటీలు దిగువన ప్రారంభమయ్యాయి. భారత స్టాక్ మార్కెట్లో… సెన్సెక్స్ 1,018 పాయింట్లతో 1.32% తగ్గి 76,293 వద్ద ముగిసింది. నిఫ్టీ 310 పాయింట్లతో 1.32% తగ్గి 23,071 వద్ద స్థిరపడింది. ఈ పరిణామాల వల్ల భారత స్టాక్ మార్కెట్లలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాపిటలైజేషన్ సుమారు రూ.9 లక్షల కోట్ల మేర తగ్గింది. ట్రంప్ ప్రకటించిన దిగుమతులపై సుంకాల పెంపు, ముఖ్యంగా స్టీల్ అల్యూమినియం పై విధించిన 25% సుంకాలు, ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధ భయాలను రేకెత్తించాయి. ఈ నిర్ణయాలు అమెరికా, ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ప్రభావితం చేసి, పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని సృష్టించాయి. అందులోనూ… ఇటీవల ట్రంప్ భారత్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని, అందువల్ల అమెరికా నుండి ఆర్థిక సహాయం అవసరం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో, పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరించాలని భారతీయ ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ట్రంప్ నోటి దురద.. పెట్టుబడిదారుల్లో తగ్గిన విశ్వాసం
ట్రంప్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యల తర్వాత పెట్టుబడిదారుల విశ్వాసం తగ్గింది. దీనితో అమెరికా ప్రభుత్వ బాండ్లకు డిమాండ్ తగ్గింది. సాధారణంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలతో పాటు కదిలే 2 సంవత్సరాల నోట్ దిగుబడి 10.4 బేసిస్ పాయింట్లు తగ్గి 3.898 శాతానికి చేరుకుంది. ఇది మార్చి 7న ఆలస్యంగా 4.002 శాతం నుండి, సెప్టెంబర్ తర్వాత అతిపెద్ద రోజువారీ తగ్గుదలకు దారి తీసింది. బెంచ్‌మార్క్ యూఎస్ 10-సంవత్సరాల నోట్ల దిగుబడి 9.3 బేసిస్ పాయింట్లు తగ్గి 4.225 శాతానికి చేరుకోగా… 30-సంవత్సరాల బాండ్ దిగుబడి 6.9 బేసిస్ పాయింట్లు తగ్గి 4.548 శాతానికి చేరుకుంది. ఇక, ట్రంప్ ప్రకటించిన టారీఫ్‌లలో అనిశ్చితి OPEC+ ఉత్పత్తిదారుల నుండి పెరుగుతున్న ఉత్పత్తితో పాటు పెట్టుబడిదారులను టెన్షన్ పెట్టగా… చమురు ధరలు కూడా పడిపోయాయి. అయితే, ఇరానియన్ చమురు ఎగుమతులపై ఆంక్షలు నష్టాలను పరిమితం చేశాయి. అలాగే, గత వారం చివర్లో అమెరికా ద్రవ్యోల్బణ డేటాపై ఆధారపడి… భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బంగారం ధరలు కూడా పడిపోయాయి. చివరికి, క్రిప్టోకరెన్సీ కూడా నవంబర్ తర్వాత కనిష్ట స్థాయిని తాకింది.
అన్నింటికీ సిద్ధమైన ట్రంప్..
ప్రెసిడెంట్ ట్రంప్ తీరుతో పెట్టుబడిదారులు భద్రత కోసం వెతకడం ప్రారంభించారు. మార్కెట్ పడిపోయిన తర్వాత కూడా తమ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సమర్థించుకున్న ట్రంప్ కొంచెం నష్టాలను కూడా అంగీకరించడానికి రెడీ అయినట్లు నిపుణులు భావిస్తున్నారు. ట్రంప్ తన దీర్ఘకాల లక్ష్యాలను సాధించడానికి మాంద్యాన్ని కూడా అంగీకరించే విధంగా మాట్లాడటమే ఇప్పుడు సమస్యకు కారణం అయ్యింది. అందుకే, ఇది వాల్ స్ట్రీట్‌కు పెద్ద మేల్కొలుపు అంటున్నారు. ప్రెసిడెంట్ సైతం స్వల్పకాలిక వృద్ధి అంచనాల గురించి అంతగా ఆశాజనకంగా లేనప్పుడు… మార్కెట్ ఎలా ఆశాజనకంగా ఉంటుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.
గత ఏడాది నుంచే పతనం మొదలు
నిజానికి, గత సంవత్సరమే అమెరికా ఆర్థిక మాంద్యం ఉచ్చులో చిక్కుకుంటుందనే అంచనాలు వచ్చాయి. అయితే, పరిస్థితులను చక్కదిద్దడానికి చాలా ప్రయత్నాలే జరిగాయి. కానీ, ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో అగ్రరాజ్యంలో మదుపరుల సంపద నిలువునా కరిగిపోతోంది. టారిఫ్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత, పొదుపు పేరుతో ఖర్చులకు విధిస్తున్న పరిమితులు మార్కెట్లను కుంగదీస్తున్నాయి. ఇప్పటికే, నిరుద్యోగంతో ఇబ్బందిపడుతున్న అమెరికన్లకు వినియోగ శక్తి కూడా సన్నగిల్లుతుంది. కానీ దీనికి భిన్నంగా వైట్ హౌస్ మాత్రం అంతా చక్కబడుతుందని భరోసా ఇస్తోంది.
విజయం తర్వాత పుంజుకుని.. ఇప్పుడేమో ఇలా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత పుంజుకున్న అమెరికా స్టాక్ మార్కెట్లు… తర్వాత రోజుల్లో నీరసపడ్డాయి. ట్రంప్ వాణిజ్య విధానాలు అమెరికా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయనే ఆందోళనలు పెరిగాయి. వినియోగదారుల నుంచి వ్యాపారుల వరకు అందరూ ఆర్థిక మందగమనం తప్పదేమో అనే భావనకు వచ్చేశారు. ఈ పరిణామం… వినియోగదారులు తమ కొనుగోళ్లను తగ్గించుకోవడానికి, పొదుపును పెంచుకోడానికి దారితీసింది. అయితే, ఇలా వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే, కార్పొరేషన్లు తాజా నియామకాలను స్తంభింపజేస్తాయని అభిప్రాయాలు వస్తున్నారు. దీనితో, విస్తరణ ప్రణాళికలను కూడా నిలిపివేయొచ్చని అనుకుంటున్నారు. అయితే, ఇది… ఆర్థిక వ్యవస్థకు ప్రధాన చోదక శక్తి అయిన వినియోగంపై ప్రభావం చూపుతుందని కూడా నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో… ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థపైన ఇన్వెస్టర్లు కూడా విశ్వాసం కోల్పోతున్నారనీ… సాధారణంగా సురక్షిత స్వర్గధామంగా భావించే అమెరికా డాలర్ ఇండెక్స్ గణనీయంగా పడిపోవడం ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ఈ సూచీ ఇటీవలి గరిష్ట స్థాయి నుంచి 6 శాతం క్షీణించడమే దీనికి ఆధారం. ఈ ట్రేడ్ టెన్షన్‌లు పెట్టుబడీదారుల్ని కలవరపెడుతున్నాయనీ… డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర సురక్షిత కరెన్సీల వైపు మళ్లేందుకు ప్రేరేపిస్తున్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.
టెక్ స్టాక్స్ నుండి వైదొలుగుతున్న ఇన్వెస్టర్లు
ఇక, అమెరికా ఆర్థిక మందగమన భయాల మధ్య ఇన్వెస్టర్లు ఇటీవలి నెలల్లో టెక్ స్టాక్స్ నుండి వైదొలుగుతున్నారు. ఇది కేవలం 3 నెలల్లో గరిష్ట స్థాయి నుండి నిఫ్టీ ఐటి ఇండెక్స్ 20% క్షీణతకు దారితీసింది. దీనికి తోడు 2025లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోతలు తగ్గుతాయన్న అంచనాలు కూడా టెక్ షేర్లపై ప్రభావం చూపుతున్నాయి. సుంకాలు వస్తువుల ధరలను పెంచుతాయని, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయనే భయాందోళనలు పెరుగుతున్నాయి. ఎందుకంటే, ఫెడరల్ రిజర్వ్… వడ్డీ రేట్లను తగ్గించేందుకు సిద్దమవుతుందా లేదా అనే ప్రశ్న మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. అలాగే, ఇన్వెస్టర్లు మళ్లీ పెట్టుబడులు పెట్టాలంటే భద్రతా హామీ అవసరం. అయితే, ట్రంప్ విధానాలు, వాణిజ్య పోరు, ఆర్థిక మాంద్యం భయాలు ఈ నష్టాలకు ప్రధాన కారణాలు కాగా… అమెరికన్ ఆర్థిక వ్యవస్థపై ప్రెసిడెంట్ ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావాన్ని అంచనా వేయడానికి యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ట్రంప్ సుంకాల మోతతో దేశ ఆర్థిక ప్రగతి మందగించవచ్చన్న భయాల నేపథ్యంలో… అమెరికాలో మాంద్యం ఏర్పడితే దానిని ఎదుర్కోడానికి అవసరమైన వ్యూహాలను కూడా రచిస్తున్నారు
నిరుద్యోగమే..మాంద్యానికి కారణం?
నిజానికి, గతేడాదే అమెరికాలో మాంద్యం ఏర్పడుతుందనే అంచనాలు వచ్చాయి. గతేడాది మధ్యలో… గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ ఇంక్ ఆర్థికవేత్తలు 2025 అమెరికాలో మాంద్యం అంచనాను 15 శాతం నుండి 25 శాతానికి పెంచారు. అయితే ఆర్థిక వ్యవస్థపై మాంద్యం ముప్పు ఉన్నప్పటికీ ఒక్కసారిగా పెద్దగా నష్టపోయే ప్రమాదం లేదని కూడా సూచించారు. గోల్డ్‌మన్ సాచ్స్‌లోని ఆర్థికవేత్తలు, మాంద్యం ప్రమాదం పెరగడానికి నిరుద్యోగం పెరగడం ప్రధాన కారణమని తెలియజేశారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆందోళనకర గణాంకాలను కూడా వెల్లడించారు. అమెరికాలో నిరుద్యోగిత రేటు 4.3 శాతానికి చేరుకుందనీ… అక్టోబర్ 2021 తర్వాత అమెరికాలో ఇదే అతిపెద్ద నిరుద్యోగ సంఖ్య అని తెలిపారు. నిరుద్యోగిత రేటులో ఈ పెరుగుదల మార్కెట్ అంచనాల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి, మాంద్యం భయాన్ని మరింత తీవ్రతరం చేసింది. నిరుద్యోగం విపరీతంగా పెరగడం రాబోయే మాంద్యంకు సంకేతమని నాడు విశ్లేషకులు కూడా హెచ్చరించారు. అయితే, పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోగా… ట్రంప్ విధానాలు మాంద్యం నుండి బయటపడేయక పోగా… అమెరికా ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీస్తున్నట్లు కనిపిస్తోంది.
ఎన్నో ప్రయాత్నాలు.. ఫలితాలు మాత్రం సూన్యం
అమెరికా ఫెడరల్ రిజర్వ్… మాంద్యాన్ని ఎదుర్కోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. నాలుగు దశాబ్దాలలో అత్యంత తీవ్రమైన ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి మునిగిపోకుండా కాపాడారు. అయితే, ఇటీవలి ఆర్థిక నివేదికల ప్రకారం… దేశం ఇంకా మాంద్యం ప్రమాదం నుండి బయటపడలేదని హెచ్చరించాయి. నిజానికి, 2006లో హౌసింగ్ మార్కెట్ పతనం వంటి ఆర్థిక అసమతుల్యతల నుండి… 2020లో ప్రపంచ వ్యాపారాన్ని తీవ్రంగా దెబ్బతీసిన కరోనా మహమ్మారి వంటి ఆర్థిక షాక్ వరకు మాంద్యాలు అనేక విధాలుగా మొదలౌతాయి. అయితే, ఇప్పుడు అమెరికా ఎదుర్కుంటున్న మాంద్యం ఇంతకు మించింది. అనేక వ్యాపారాలు, వినియోగదారులు ఎదుర్కొంటున్న కఠినమైన ఆర్థిక పరిస్థితుల నుండి ఈ మాంద్యం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గతేడాది ఫెడ్ వడ్డీ రేట్లను 23 సంవత్సరాల్లో అత్యధిక స్థాయికి పెంచడం ద్వారా… ఆస్తిని కొనుగోలు చేయడానికి రుణాలు కోరుకునే వాళ్లకి, లేదంటే, క్రెడిట్ కార్డ్ రుణాన్ని ఉన్న అమెరికన్లను మరింతగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇక, ఇటీవలి మార్కెట్ పతనం ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీసింది. దీనితో కంపెనీలు ఉద్యోగాలను తగ్గించడం, కొత్త నియామకాలను నిలిపివేయడం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో వినియోగదారులు డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడే పరిస్థితి వస్తోంది. ఇదే మాంద్యాన్ని మరింత పెంచే అవకాశం ఉంది.
Also Read: పాకిస్థాన్ లో ప్రయాణికుల రైలు హైజాక్ – 100 మందికి పైగా బందీ – ఉగ్రవాదుల డిమాండ్లు ఇవే
మార్పు ప్రభావం.. ఇంకాస్త టైమ్ పడుతుందంటోన్న ట్రంప్
పరిస్థితి ఇంతగా దిగజారుతుంటే… ట్రంప్ మాత్రం దాని దిశగా ఎలాంటి కామెంట్లు చేయట్లేదు. పైగా, 2025లో ఆర్థిక మాంద్యం వస్తుందా అని ట్రంప్‌ను అడిగితే మండిపడుతున్నారు. ‘ఇలాంటి విషయాలను అంచనా వేయడం అసహ్యం అనీ… ఇది పరివర్తన కాలం గనుక… యునైటెడ్ స్టేట్స్‌కు డబ్బును తిరిగి తీసుకొచ్చే క్రమంలో… కాస్త సమయం పడుతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన స్థితిలో ఉందని, కానీ రుణ వ్యయాలను తగ్గించుకునేందుకు అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. మరోవైపు, మార్కెట్లు పతనం అవుతున్నా ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగానే ఉందని వైట్ హౌస్ అధికార వర్గాలు చెబుతున్నాయి. మాంద్యం భయాలు అవసరం లేదనీ… ట్రంప్ వేస్తున్న సుంకాల విషయంలో కూడా అస్పష్టత త్వరలో తొలగిపోతుందని అంటున్నారు. ఈ పన్ను కోతలు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఉన్న ఒకే ఒక్క హోప్… ఫెడరల్ రిజర్వ్, వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం మాత్రమే. అందుకే, దాని కోసం పెట్టుబడీదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.