వెయ్యిరోజుల సర్కార్ వైఫల్యాలంటూ బీఆరెస్ మొన్నటిదాకా హంగామా చేసింది. హామీలిచ్చారు.. మరిచారు.. సర్కార్ ఫెయిలయిపోయిందని కాంగ్రెస్ సర్కార్ పై ప్రత్యేకంగా ఓ వారం పాటు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. వెయ్యి రోజులైనా ఏమీ చేయలేకపోయారని.. ఈ వెయ్యి రోజుల పాలనను బాగా ట్రోల్ చేశారు. జనం ముందుకు దీన్ని బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేశారు.
ఇప్పుడు మనం చెప్పుకోబోయేది.. కేటీఆర్ వెయ్యిరోజులు తన నియోజకవర్గానికి దూరంగా ఉన్నాడు..అనే టాపిక్ గురించి. అంటే ఆయన వెయ్యి రోజుల డుమ్మా ఎమ్మెల్యే అన్నమాట. ఆయనను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ముచ్చటగా మూడుసార్లు గెలిపించారు. కానీ ఆయన మూడోసారి గెలిచినా.. బీఆర్‌ఎస్ సర్కార్ ఓడిపోయింది.
కాంగ్రెస్ 2023 డిసెంబర్ 7న అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇవాల్టి వరకు ..అంటే .. రెండు సంవత్సరాల, 9 నెలల 14 రోజులు.. 1019 రోజులన్నమాట. కేటీఆర్ ఈ సమయంలో తన సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించింది కేవలం ఓ 15 సార్లు మాత్రమే. చివరగా ఆయన అక్కడ పర్యటించింది ఈ నెల 5న. ఇదంతా ఇప్పుడెందుకంటే.. ఈనెల 30న సిరిసిల్లలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించనున్నారు. భారీ బహిరంగ సభనుద్దేశించి ప్రసంగించనున్నారు.
తను సిరిసిల్లకు వస్తున్నానని, నీ సంగతి తేలుస్తానని ఇది వరలోనే సీఎం ప్రకటించి ఉన్నారు. దీంతో ఇప్పుడు సీఎం పర్యటన అధికారికంగా వెల్లడి కావడంతో ఈ అంశం ప్రాధాన్యతను సంతరించుకున్నది. దీనిపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లిన తరువాత జనానికి ఏమేం చేశారో చెప్పాలని, ఇటీవల తనపై 8వేల ఎకరాలను బంధువులకు పంచి ఇచ్చారని చేసిన ఆరోపణలపై క్లారిటీ ఇచ్చి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సీఎం సిరిసిల్ల టూర్‌కు ఇంకా సమయం ఉన్నా.. ఇది ఇప్పట్నుంచే రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఓ వైపు కవిత ఆ మధ్య సిరిసిల్లకు వెళ్లి .. అన్న కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. టూరిస్ట్ ఎమ్మెల్యే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేరెళ్ల దళితుల ఇష్యూపై కేసీఆర్ సర్కార్, కేటీఆర్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు.
కేటీఆర్‌పై మొన్నటికి మొన్న కవిత చేసిన టూరిస్ట్ ఎమ్మెల్యే పంచులను నిజం చేస్తున్నాడిలా కేటీఆర్. వెయ్యి రోజుల పాలన అంటూ దుయ్యబట్టిన కేటీఆర్.. తప్పులెన్నువాడు తన తప్పులెరుగడు అన్నట్టుగా.. వెయ్యి రోజుల పాటు తన నియోజకవర్గానికి డుమ్మా కొట్టాడనే అంశం కూడా పొలిటికల్ సర్కిళ్లలో బాగానే చక్కర్లు కొడుతున్నది.
గతంలో రెండు పర్యాయాలు కేసీఆర్ సీఎంగా ఉన్నా.. కేటీఆర్ షాడో సీఎంగా వ్యవహరించాడు. అందుకే చాలా బిజీగా ఉండి తన నియోజవకర్గానికి పోలేకపోయాడు. మరి ఇప్పుడేమో.. తండ్రి కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కే పరిమితం కావడం, పార్టీ పగ్గాలు చేపట్టి .. సోషల్ మీడియా బాధ్యతలను మీదేసుకుని మరింత బిజీ అయిపోయినట్టున్నాడు కేటీఆర్.
దీనికి తోడు తండ్రి, కొడుకులకు జనం మీద విపరీతమైన కోపం, అలక ఉంది. అందుకే ఆయన ఫామ్‌హౌజ్‌లోనే ఉంటున్నారు. ఈయన తన నియోజకవర్గానికే పోవడం లేదంటున్నారు. అయితే మూడుసార్లు ఇక్కడ్నుంచి గెలిచిన కేటీఆర్‌కు మూడోసారి మెజారిటీ గణనీయంగా పడిపోయిందండోయ్..!
2018లో 89, 009 ఓట్ల మెజారిటీ రాగా, 2023 లో 29, 687 తో సరిపెట్టుకున్నాడు.