Romantic Family Drama: పార్క్ లో మొదలైన ఓ ప్రేమకథ… పెళ్లి తర్వాత మాత్రం ఊహించని కష్టాల్లోకి వెళ్లిపోతే… పెళ్ళంటేనే కష్టాలు అనుకోండి, అది వేరే విషయం. మరి తల్లిదండ్రుల గతం గురించి తెలియని పిల్లలకు… ఓ రోజు అదే గతాన్ని వాళ్ల అమ్మ స్వయంగా చెప్పాల్సి వస్తే ? ఇలా ప్రేమ, పెళ్లి, అత్తింటి గొడవలు, కుటుంబ బంధాల మధ్య ఓ మహిళ జీవితం ఎలా మారిపోయింది ? అనే అంశాల చుట్టూ తిరిగే కథే ‘అలా జరిగింది’ (Ala Jarigindi). మరి ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది ? తెలుగులో చూడొచ్చా ? అన్న వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.
సరిత ఓ స్కూల్ టీచర్. తన పిల్లలతో కలిసి హ్యాపీ లైఫ్ ను గడుపుతుంటుంది. ఒక రోజు తన టీనేజ్ పిల్లలను తాను ప్రేమలో పడిన పాత పార్క్ కు తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్లకు తన గతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది. అలా కథ ప్రస్తుత కాలం నుంచి ఆమె గతంలోకి వెళ్తుంది. సరిత జీవితంలో ప్రేమ ఓ బస్‌స్టాప్ దగ్గర మొదలవుతుంది. పరిచయం క్రమంగా ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. పెళ్లికి ముందు ఉన్న ప్రేమ… పెళ్లి తర్వాత కూడా అలాగే ఉంటుందని అనుకుంటారు.
కానీ కొత్త కుటుంబంలోకి అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు అనుకున్నట్టుగా ఉండవు. అత్తింట్లో ఎదురయ్యే మాటలు, అభిప్రాయ భేదాలు, కుటుంబ సభ్యుల మధ్య వచ్చే సమస్యలు క్రమంగా భార్యాభర్తల మధ్య దూరాన్ని పెంచుతాయి. చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారి తీస్తాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్దరి మధ్య కూడా పరిస్థితులు మారుతాయని సరితకు అర్థమవుతుంది. ఇదంతా పిల్లలకు తెలియదు. వాళ్ల దృష్టిలో తమ తల్లిదండ్రుల జీవితం సాధారణంగానే ఉంటుంది. కానీ పార్క్ లో కూర్చుని సరిత తన గతాన్ని చెప్పడం మొదలు పెట్టిన తర్వాత… వాళ్లకు తమ కుటుంబం గురించి కొత్త విషయాలు తెలుస్తాయి.
అమ్మ ఎదుర్కొన్న ఇబ్బందులు, తండ్రితో ఆమెకు వచ్చిన విభేదాలు, ఆ తర్వాత కుటుంబం ఎలా నిలబడిందనే విషయాలు వాళ్లకు అర్థమవుతాయి. కథలో ప్రేమకంటే కుటుంబ బంధాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, తల్లి తన పిల్లల కోసం చేసే త్యాగాలు ఎక్కువగా కనిపిస్తాయి. గతాన్ని పిల్లలకు చెప్పే ఓ తల్లి కథగా మొదలై… కుటుంబం అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండటం కాదనే భావనతో సాగుతుంది. మరి అసలు ఆ ప్రేమ జంట మధ్య విభేధాలు తెచ్చిన గొడవలు ఏంటి ? ఆ కుటుంబాన్ని ఆమె ఎలా నిలబెట్టింది ? అన్నది తెలియాలంటే మూవీని చూడాల్సిందే.
లయ (Laya), సుబ్బరాజు (Subbaraju), వినీష (Vineesha), నిఖితా రెడ్డి (Nikitha Reddy) తదితరులు నటించిన ‘అలా జరిగింది’ సినిమాకి సంతోష్ అన్నాపర్తి (Santosh Annaparthi) దర్శకత్వం వహించారు. ఇది ఎమోషనల్ ఫ్యామిలీ, రొమాంటిక్ డ్రామా. సెప్టెంబర్ 20 నుంచి ఈటీవీ విన్ (ETV Win)లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రేమలో అందరూ పడతారు. కానీ ఆ తరువాత పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ లవర్స్ కి తెలియదు. కాబట్టి ప్రేమలో ఉన్న ప్రతీ ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడాల్సిన మూవీ ఇది.