రవికుమార్ అనే వ్యక్తి చుట్టూ పరకామణి వ్యవహారం
వీటన్నింటికి సమధానాలు తెలియాలంటే.. చాలా విషయాలు వివరంగా తెలుసుకోవాలి. ఈ కేసు మొత్తం.. సీవీ రవికుమార్ అనే వ్యక్తి చుట్టే తిరుగుతోంది. అతను తిరుమల పెద్ద జియ్యంగార్ మఠంలో క్లర్క్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు.. అధికారికంగా పరకామణి కార్యకలాపాల్ని పర్యవేక్షించే ప్రతినిధిగానూ ఉన్నారు. ఏప్రిల్ 29 2023న.. ఎప్పటిలాగే పరకామణిలో స్వామివారి హుండీ కానుకల లెక్కింపునకు హాజరయ్యారు. ఈ క్రమంలో తిరుమలేశునికి కానుకగా వచ్చిన అమెరికన్ డాలర్లను రవి కుమార్ దొంగిలించారు.
అమెరికన్ డాలర్లు దొంగిలించిన రవి కుమార్
తనలో దాచుకొని డాలర్లను బయటకు తీసుకెళ్తుండగా టీటీడీ విజిలెన్స్ AVSO సతీష్ కుమార్‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అతని దగ్గర్నుంచి.. 72 వేల విలువైన అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో రవికుమార్‌పై.. AVSO సతీశ్ కుమార్ ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా.. అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తర్వాత విచారణలో భాగంగా రవి కుమార్ దగ్గర్నుంచి దొంగిలించిన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. 2023 మే 30వ తేదీని.. అతనిపై ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. ఇక్కడే.. కథ మరో మలుపు తీసుకుంది.
కొన్నేళ్లుగా పరకామణి నుంచి కరెన్సీ దొంగతనం
రవికుమార్ విచారణ తర్వాత.. కొందరు పెద్దలు సీన్‌లోకి ఎంటరయ్యారనే చర్చ నడుస్తోంది. రవి కుమార్ నిరంతరం స్వామి వారి పరకామణి లెక్కింపునకు వెళ్లే వాడని, పెద్దజియ్యర్ మఠం ఉద్యోగి కాబట్టి.. అతనికి పెద్దగా తనిఖీలు ఉండకపోవడంతో.. భారీ మొత్తంలో చోరీకి పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. అలా తిరుమల వేంకటేశునికి కానుకల రూపంలో అందిన కరెన్సీని దొంగిలించి.. దాని ద్వారా తిరుపతి, చెన్నై, బెంగళూరు, మహాబలిపురం, మైసూరులో.. వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టాడని సమాచారం.
వందల కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టిన రవికుమార్
ఈ వ్యవహారం బయటకొస్తే.. తిరుమల పెద్ద జియ్యర్ మఠానికి చెడ్డపేరు వస్తుందని.. ఈ విషయం బయటకు రాకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. కానీ.. అసలు విషయం వేరే ఉంది. రవికుమార్ ఆస్తులపై కన్నేసిన కొందరు బడా బాబులు.. అతని ఆస్తుల్ని బలవంతంగా అమ్మించి.. క్యాష్ చేసుకున్నారనే ఆరోపణలున్నాయ్. కొన్ని కొసరు ఆస్తుల్ని మాత్రం స్వామి వారి పేరుతో రాయించారని అంటున్నారు.
రవికుమార్ ఆస్తుల్ని క్యాష్ చేసుకున్నారనే ఆరోపణలు
అయితే.. టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్‌లోనూ కొన్ని కీలక విషయాల్ని ప్రస్తావించారు. తిరుపతి, చెన్నైలో తమ పేరిట ఉన్న కోట్లు విలువైన ఆస్తుల్ని.. రవి కుమార్, అతని భార్య.. 2023 మే 19వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చేశారు. శ్రీనివాసుడి మీద ఉన్న అపారమైన భక్తిశ్రద్ధలతోనే తమ ఆస్తుల్ని రాసిచ్చేస్తున్నట్లుగా.. రవికుమార్ దంపతులు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ ఎపిసోడ్ తర్వాత.. సెప్టెంబర్‌లో పరకామణిలో కరెన్సీ దొంగతనం కేసుకు సంబంధించి.. లోకాయుక్తలో రాజీకొచ్చారు. చోరీ కేసులో రాజీ పడటం ఏమిటనేదే.. అర్థంకాని విషయం.
2023 ఏప్రిల్ చివర్లో కేసు నమోదైతే.. సరిగ్గా నాలుగు నెలలకు లోకాయుక్తలో రాజీ పడటమేంటి? అనేదే అసలు డౌట్? ఈ నాలుగు నెలల గ్యాప్‌లోనే.. అప్పటి టీటీడీ పెద్దలు, కొందరు ఉన్నతాధికారులు పెద్ద వ్యవహారాన్నే నడిపారనే చర్చ ఉంది. ఈ కేసులో.. వందల కోట్లు చేతులు మారటం వల్లే.. టీటీడీ పెద్దలు, పోలీసు ఉన్నతాధికారులు సహకరించి ఉంటారనే ప్రచారం కూడా నడుస్తోంది.
లోకాయుక్తలో రాజీ కుదిరినట్లుగా టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్
ఇక.. విజిలెన్స్ రిపోర్ట్‌లోనూ ఫిర్యాదుదారు AVSO సతీశ్ కుమార్, నిందితుడు రవికుమార్ రాజీకి వచ్చారని.. తద్వారా కేసు మూసివేస్తున్నట్లుగా ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. పరకామణి వ్యవహారం సున్నితమైన అంశం కావడం, పైగా.. పెద్ద జియ్యంగార్ మఠానికి సంబంధించిన ఉద్యోగి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండటం వల్లే.. లోకాయుక్తలో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. ఇదే విజిలెన్స్ రిపోర్టులో.. మరో విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. పోలీసుల నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడి వల్లే.. లోకాయుక్తలో.. AVSO సతీశ్ కుమార్ రాజీకి ఒప్పుకున్నారనే విషయాన్ని రిపోర్టులో తెలియజేశారు. అయితే.. పోలీసులు ఎందుకు ఇంతలా ఒత్తిడి చేశారనేది కూడా ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అసలు.. ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరికి లబ్ధి చేకూర్చేందుకు.. పోలీసులు ఇంతలా ఒత్తిడి తెచ్చారనేది సస్పెన్స్‌గా మారింది.
పోలీసులు రాజీ కోసం ఎందుకు ఒత్తిడి చేశారు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాసనమండలిలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. దాంతో.. దేవాదాయశాఖ మంత్రి మాట్లాడుతూ.. పరకామణి ఇష్యూలో వంద కోట్లకు పైగా చేతులు మారాయన్నారు. టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ ప్రకారం.. పోలీసుల ఒత్తిడి వల్లే లోకాయుక్తలో రాజీ పడాల్సి వచ్చిందంటున్నారు. అంతేకాదు.. పరకామణిలో చోరీ కేసులో.. పోలీసులు బలహీనమైన సెక్షన్లు పెట్టారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయ్.
కేవలం.. నిందితుడు రవికుమార్‌ని తప్పించేందుకే.. ప్రీ ప్లాన్డ్‌గా ఇలా చేశారనే ప్రచారం కూడా ఉంది. అందువల్ల.. ఈ వ్యహారంపై హైకోర్ట్ జడ్జితో విచారణ జరిపించి.. లబ్ధి పొందిన వాళ్లందరినీ జైలుకు పంపాలని ప్రస్తుత టీటీడీ బోర్డ్ మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇక పోలీసుల ఒత్తిడి మేరకే.. లోకాయుక్తలో రాజీకి ఒప్పుకున్నామని విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టే.. పరకామణి వ్యవహారంలో లబ్ధి పొందిన వారి మెడకు చుట్టుకుంటుందనే చర్చ జరుగుతోంది.
తిరుమల పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ!
తిరుమల పరకామణిలో 72 వేల విలువ చేసే అమెరికన్ డాలర్లు దొంగిలించి.. రవికుమార్ పట్టుబడ్డాడు. కానీ.. ఈ కేసు కేవలం ఆ 72 వేలకు సంబంధించింది మాత్రమే కాదు. దీని వెనుక.. వందల కోట్ల వ్యవహారం దాగుంది. అందుకోసమే.. ఈ రవికుమార్ కేసు ఎపిసోడ్‌పై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయ్. జియ్యర్ మఠానికి చెందిన ఉద్యోగిగా ఉన్న రవికుమార్.. కొన్నేళ్లుగా పరకామణిలో నుంచి డాలర్లు దొంగిలిస్తున్నాడనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. అతనికి మిగతా వాళ్లలా తనిఖీలు ఉండకపోవడం.. అతనికి కలిసొచ్చింది. పైగా.. డాలర్లని చాలా తెలివిగా కొట్టేసేవాడు. ఆపరేషన్ ద్వారా తన కడుపుకే కోత పెట్టించుకొని.. అందులో విదేశీ కరెన్సీ తరలించారనే ప్రచారం కూడా ఉంది.
రూ.200 కోట్లకు పైనే దోపిడీ జరిగిందా?
అలా.. డాలర్లను మార్చి.. కోట్ల రూపాయలు వెనకేసినట్లు తెలుస్తోంది. ఇక్కడ సందేహం తలెత్తుతున్న మరో పాయింట్ ఏమిటంటే.. కేవలం 72 వేల విలువైన అమెరికన్ డాలర్ల కోసమైతే.. అతను తన ఆస్తుల్ని టీటీడీకి రాసి ఇవ్వడు. కేసును ఎదుర్కొంటాడు. నెల రోజుల్లో బెయిల్ కూడా వచ్చేస్తుంది. అయినా.. కోట్లు విలువైన ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చేశాడంటే.. కచ్చితంగా లోపాయికారిగా కొందరు పెద్దలకు డబ్బులు, ఆస్తులు ముట్టజెప్పాడనే ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా రవికుమార్, అతని భార్య రమ్య పేరుపై తిరుపతి పరిధిలో ఉన్న ఐదు ఆస్తుల్ని, చెన్నైలోని రెండు ఆస్తుల్ని టీటీడీకి రాయించేశారు కొందరు పెద్దలు. తిరుపతిలోని మంగళం సమీపంలో ఉన్న పసుపర్తి పనోరమ అపార్ట్‌మెంట్‌లోని 13 ఫ్లాట్స్, పీకే లే అవుట్‌లోని అశోక్ అపార్ట్‌మెంటులో ఓ ఫ్లాట్ టీటీడీకి రిజిస్టర్ చేయించేశారు. ఒకే అపార్ట్‌మెంట్‌లో 14 ఫ్లాట్‌లో కొన్నాడంటే.. రవికుమార్ ఏ స్థాయిలో పరకామణి నుంచి విదేశీ కరెన్సీ నొక్కేశాడో అర్థం చేసుకోవచ్చు.
పరకామణి కుంభకోణం!
పరకామణిలో చోరీకి పాల్పడిన వ్యక్తికి సంబంధించిన ఆస్తుల్ని.. టీటీడీకి రాయించేశాం కాబట్టి.. అతని మీద కేసులవీ వద్దని.. లోక్ అదాలత్‌లో రాజీ చేశారు. అసలు.. ఓ నిందితుడు విరాళం ఇస్తే అప్పటి టీటీడీ పెద్దలు ఎలా తీసుకున్నారు? శ్రీనివాసుడి పరకామణిలో కొట్టేసిన విదేశీ కరెన్సీతో సంపాదించిన కోట్లు విలువ చేసే ఆస్తుల్ని.. మళ్లీ శ్రీవారికే విరాళం ఇవ్వడమేంటి? ఇవన్నీ కాదు.. పెద్ద జియ్యంగార్ మఠంలో క్లర్క్ స్థాయి ఉద్యోగి.. 40 కోట్లు విలువ చేసే ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చాడంటే.. అతనెలా సంపాదించి ఉంటాడు?
ఈ విధంగా వచ్చే విరాళాల్ని ఎవరైనా ఒప్పుకుంటారా? అసలు.. టీటీడీ విజిలెన్స్ అధికారులపై పోలీసులు ఎందుకు ఒత్తిడి తీసుకొచ్చారు? ఈ మొత్తం వ్యవహారాన్ని వెనకుండి నడిపించిందెవరు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు.. అన్ని వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయ్. పైగా.. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే.. కేవలం కొన్ని ఆస్తుల్ని విరాళంగా ఇప్పించేసి.. రవికుమార్‌కు చెందిన మిగతా ఆస్తుల్ని.. కొందరు పెద్దలు కాజేశారనే ప్రచారం కూడా సాగుతోంది.
రవికుమార్ ఆస్తులపై కన్నేసిన కొందరు బడా బాబులు
రవి కుమార్ కేసుని.. లోకాయుక్త ద్వారా రాజీ చేయించడంలో.. అప్పటి టీటీడీ పాలకమండలి పెద్దలతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు అధికారులు కీలకంగా వ్యవహరించారనే ప్రచారం కూడా ఉంది. ఒకవేళ అదే నిజమైతే.. వాళ్లంతా ఏ మేరకు లబ్ధి పొందారనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. కేవలం 72 వేల విలువైన డాలర్లు చోరీ చేసిన కేసులో పట్టుబడినంత మాత్రాన.. కోట్లు విలువ చేసే ఎందుకు రాసిచ్చాడనేదే మేజర్ డౌట్.
అయినా.. ఓ దొంగతనం కేసులో నష్టపరిహారం కట్టించడమేంటి? అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు.. పోలీసులు కూడా బలహీనమైన సెక్షన్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనేది కూడా మరో అనుమానం. మైసూరు, బెంగళూరులో ఉన్న ఆస్తుల్ని కూడా రవి కుమార్ అమ్మేశాడనే ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో.. వెనకుండి నడిపించిన పెద్దలు ఎంత మేర లబ్ధి పొందారు? అనేదే.. ఇప్పుడు ప్రధానమైన చర్చ. అయితే.. రవి కుమార్‌కు చెందిన వందల కోట్ల ఆస్తుల్ని.. కొందరు పెద్దలు కాజేశారని.. దానిపై విచారణ జరపాలనే డిమాండ్లు వస్తున్నాయ్.