Typhoon Bavi: ఒకవైపు చైనాలో ‘బావీ’ తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే.. మరోవైపు బంగ్లాదేశ్‌లో కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ రెండు దేశాల్లోనూ ప్రకృతి ప్రకోపానికి జనాలు తీవ్రంగా అల్లాడిపోతున్నారు. చైనాలో ‘బావీ’ తుఫాన్ ధాటికి కుండపోత వర్షాలు, వరదలు విరుచుకు పడ్డాయి. ‘లియావోనింగ్’ ప్రావిన్స్ పూర్తిగా మునిగిపోయింది. షెన్యాంగ్, జిలిన్ లాంటి పెద్ద నగరాల్లో రోడ్లు నదులను తలపిస్తున్నాయి. పాఠశాలలు, శిక్షణా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటివరకు ఏకంగా 2 లక్షల 60 వేల మందికి పైగా ప్రజలను ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
కార్లు, బస్సులు మాత్రమే కాదు ఏకంగా ఒక భారీ లైట్ హౌస్ కూడా వరద ప్రవాహానికి తట్టుకోలేక నీటిలో కొట్టుకుపోయింది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ బావీ తుఫాన్ తూర్పు చైనాలో తీరం దాటిన తర్వాత కూడా బలం తగ్గకుండా మరింత ముందుకు దూసుకెళ్తోంది. బంగ్లాదేశ్‌లోనూ భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. 54 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా దాదాపు 6 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఖగ్రాచారి, రంగమతి, బందర్‌బన్, కాక్స్‌బజార్, చటోగ్రామ్ జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒక్క కాక్స్‌బజార్‌లోనే అత్యధికంగా 31 మంది చనిపోయారు.
Also read: Power Complaints: మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉందా.. వెంటనే ఇలా చేయండి?
‘తిస్తా’ నది ప్రమాదకర స్థాయిని దాటి పొంగిపొర్లుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి. లాల్మోనిర్‌హాట్ ప్రాంతంలో వేలాది మంది ప్రజలు వరద నీటిలోనే చిక్కుకుపోగా బొగురా జిల్లాలో ‘జమునా’ నది ఉధృతికి పంట పొలాలు, ఇళ్లు, చెట్లు నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. రెండు దేశాల్లోనూ రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. చైనా, బంగ్లాదేశ్ లో మరో ఐదు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖలు హెచ్చరించాయి. వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Storey By: Appa rao big Tv
Also read: POCSO Case: షాబాద్ ఘటనను మించిన ట్విస్ట్.. మైనర్ బాలికను ఎత్తుకెళ్లిన పోక్సో కేసు నిందితుడు!