UAE Golden Visa: ఒకే ఒక్క వీసా.. అదే గోల్డెన్ వీసా. భారతీయ సంపన్నుల్లో మరింత మందిని ఆకర్షించేందుకు UAE ప్రయోగించిన అస్త్రమిది. ఇప్పటికే చాలా వరకు ట్యాక్స్ ఫ్రీగా ఉన్న దుబాయ్ మనోళ్లను మరింత మందిని గోల్డెన్ వీసాతో పర్మినెంట్‌గా సెటిల్ కావాలని ఊరిస్తోంది. జస్ట్ 23 లక్షలు వన్ టైమ్ పేమెంట్ కట్టండి. దుబాయ్ లోనే శాశ్వత నివాసం పొందండి అంటోంది. మొదట భారత్, బంగ్లాదేశ్ కు మాత్రమే ఈ ఆఫర్ ప్రకటించింది. ఎందుకిలా? దుబాయ్ మనసులో ఏముంది? తెరవెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి?
లేటెస్ట్ నామినేషన్ బేస్డ్ గోల్డెన్ వీసా..
UAE గోల్డెన్ వీసా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 2019లోనే ప్రవేశపెట్టింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా తెచ్చిన నామినేషన్ బేస్డ్ గోల్డెన్ వీసా.. మరీ స్పెషల్. ఎందుకంటే దుబాయ్‌లో పర్మినెంట్‌గా ఉండొచ్చు. బిజినెస్ చేయక్కర్లేదు. పెద్దగా డబ్బులు ఉండాల్సిన పని లేదు. కాస్త తెలివిపరులైతే చాలు. మీకు ఈ గోల్డెన్ వీసాను దుబాయ్ పర్మినెంట్ గా ఆఫర్ చేస్తుంది. వన్ టైం సెటిల్ మెంట్ కింద.. ఒక్కసారి 23 లక్షల 30 వేల రూపాయలు చెల్లిస్తే చాలు దుబాయ్ లో బిందాస్ గా ఉండొచ్చు. గతంలో ఈ వీసా కింద ఐదు నుంచి పదేళ్ల వ్యవధితో లాంగ్ టర్మ్ వీసా ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడది పర్మినెంట్ వీసాగా మారిపోయింది. దుబాయ్ చెప్పిన అర్హతలు ఉంటే చాలు.. UAEలో ఉండడానికి, పనిచేయడానికి, చదువుకోవడానికి అనుమతిస్తుంది. గతంలో ఇలాంటి వీసా కావాలంటే.. 4.66 కోట్ల రూపాయల పెట్టుబడిని దుబాయ్ లో ఇన్వెస్ట్ చేసేట్లు ఉంటేనే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ రూల్ లేదు. ఉన్న ఆస్తులు అమ్మినా, పెట్టుబడులు వెనక్కు తీసుకున్నా ఈ గోల్డెన్ వీసా రద్దు కాదు. ఇది ట్రెడిషనల్ గోల్డెన్ వీసాతో పోలిస్తే పెద్ద మార్పు. ఈ వీసా రావాలంటే UAE కొన్ని రూల్స్ పెట్టింది. అర్హతలు కావాలన్నది. అవి పాస్ అయ్యారా మీ పంట పండినట్లే. అంతే కాదు.. గోల్డెన్ వీసా అప్లై చేసుకున్న వారి నేపథ్యం, వర్కింగ్ స్కిల్స్ కెపాసిటీ, సోషల్ మీడియా స్క్రీనింగ్ అంటే ఎలాంటి పోస్టులు పెడుతున్నారు.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారా.. మానవతావాదా అన్నవి చూస్తారు. అలాగే యాంటీ మనీ లాండరింగ్, ఫైనల్ గా క్రిమినల్ రికార్డ్ చెక్ చేస్తారు.
నెల రోజుల్లోపే దుబాయ్ గోల్డెన్ వీసా చేతికి
పాస్‌పోర్ట్, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, విద్యార్హతలు, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ వంటివి చూస్తారు. ఇవి ఏ దేశమైనా కామన్‌గా చూసేవే. అయితే గోల్డెన్ వీసా ఇచ్చే టైంలో అభ్యర్థి బ్యాక్ గ్రౌండ్ చాలా కచ్చితత్వంతో చెక్ చేస్తారు. ఎక్కడ ఏ చిన్న లిటిగేషన్ కనిపించినా ఇవ్వరు. ఈ వీసాను 30 నుంచి 60 రోజుల్లో ఇస్తారు. ఫాస్ట్ ట్రాక్ ఆప్షన్ పెట్టుకుంటే అన్నీ క్లియర్ గా ఉంటే నెల రోజుల్లోపే దుబాయ్ గోల్డెన్ వీసా చేతికి అందుతుంది. ఉన్నట్లుండి దుబాయ్ ఇలా పర్మినెంట్ రెసిడెన్సీకి ఎందుకు అవకాశం ఇచ్చిందన్న డౌట్ రావొచ్చు. ఇందులో విన్ విన్ సిచ్యువేషన్ ఉంది. ఇటు దేశం దాటి వెళ్లి సంపాదించాలనుకున్న వారికి బెనిఫిట్. అలాగే దుబాయ్ ఆర్థిక వ్యవస్థను నెక్ట్స్ లెవెల్ లోకి తీసుకెళ్లేందుకు ఆ దేశానికి బెనిఫిట్ గా ఉంటుందన్న మాట.
2022లో ఇండియా-UAE మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్
గోల్డెన్ వీసా హోల్డర్లు తమ జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లొచ్చు. అందరూ అక్కడే శాశ్వతంగా ఉండిపోవచ్చు. అలా అని ఈ గోల్డెన్ వీసా సిటిజన్‌షిప్ కాదు. కేవలం లాంగ్ టర్మ్ రెసిడెన్సీ మాత్రమే. UAE సిటిజన్‌షిప్ పొందడం చాలా రేర్. దాన్ని గోల్డెన్ వీసాతో భర్తీ చేయడం అన్న మాట. ఈ వీసాతో ఇండియన్లు UAEలో ఎంతకాలమైనా ఉండొచ్చు, వ్యాపారం చేయొచ్చు, కుటుంబాన్ని తీసుకురావచ్చు, ఆరోగ్య, విద్యా సౌకర్యాలను వాడుకోవచ్చు. 2022లో ఇండియా-UAE మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్‌షిప్ అగ్రిమెంట్ జరిగింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, వలసలు పెరిగాయి. వీసా పైలట్ ప్రోగ్రామ్ కింద ఇండియా, బంగ్లాదేశ్‌లను ఎంచుకున్నారు. 3 నెలల్లో 5 వేల మందికి ఈ గోల్డెన్ వీసాలను UAE ఇవ్వబోతోంది. ఈ ప్రోగ్రామ్ విజయవంతమైతే, CEPA అగ్రిమెంట్ సో సంతకం చేసిన చైనా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు విస్తరించవచ్చు.
టెక్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, కార్పొరేట్ రంగాల్లో సీనియర్ ప్రొఫెషనల్స్‌కు ఛాన్స్
అంతకు ముందు గోల్డెన్ వీసా రావాలంటే యూఏఈలో భారీ వ్యాపార పెట్టుబడులు ఉన్న వాళ్లు, చదువుల్లో ప్రతిభ చూపిన వాళ్లు, సామాజిక సేవ చేసిన వాళ్లకే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు మాత్రం టెక్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, కార్పొరేట్ రంగాల్లో సీనియర్ ప్రొఫెషనల్స్ కు ఛాన్స్ ఉండబోతోంది. వీరితో పాటే క్రియేటివ్ ప్రొఫెషనల్స్ అంటే యూట్యూబర్లు, పాడ్‌కాస్టర్లు, రచయితలు, ఫిల్మ్‌మేకర్లు, స్పోర్ట్స్ ప్లేయర్లు, డిజిటల్ ప్రొఫెషనల్స్ కు ఛాన్స్ ఇస్తారు. UAE సాంస్కృతిక, వాణిజ్య, విజ్ఞాన, స్టార్టప్ రంగాలకు సహకరించే కెపాసిటీ ఉన్న వారికి కూడా ఈ గోల్డెన్ వీసా ఇస్తారు. అయితే కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఉన్న పాస్ పోర్ట్ ఉండాలి. క్లీన్ క్రిమినల్ రికార్డ్ అవసరం. ఆరోగ్య బీమా అలాగే ఆర్థిక స్థిరత్వాన్ని చూపించే బ్యాంక్ స్టేట్‌మెంట్లు చూపాలి. సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టారు.., మనీలాండరింగ్ వ్యవహారాల్లో ఉన్నారా అన్నవి చూసుకుంటారు. ఈ వీసా కోసం UAE అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో అలాగే.. ఆఫ్ లైన్ లోనూ ఫిజికల్ డాక్యుమెంట్లు ఇవ్వొచ్చు. మనదేశంలో ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, పుణెలో అందుబాటులో UAE ఆఫీసులు ఉన్నాయి.
ఆరోగ్య బీమా డిస్కౌంట్లు
6 నెలలకు మించి UAE బయట ఉన్నా ఈ వీసా చెల్లుబాటు అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అదనపు శిక్షణ అవసరం లేదు. ఆరోగ్య బీమా డిస్కౌంట్లు ఇస్తారు. ఆస్తులు అమ్మినా లేదా పెట్టుబడులు ఉపసంహరించినా వీసా చెల్లుబాటులో ఉంటుంది. మొత్తంగా UAEలో వ్యక్తిగత ఆదాయంపై పన్ను లేదు, వ్యాపార ఆదాయంపైనా ట్యాక్స్ లేదు. అందుకే భారతీయ సంపన్నులు ఇక్కడి నుంచి దుకాణం సర్దేసి దుబాయ్ షిఫ్ట్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో చాలా మంది వెళ్లిపోయారు. అంతే కాదు దుబాయ్ ఒక గ్లోబల్ బిజినెస్ హబ్. అక్కడ మనవాళ్లు స్టార్టప్‌లు, టెక్, హెల్త్‌కేర్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాల్లో అవకాశాలు వెతుక్కోవచ్చు. దుబాయ్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో 30% మనోళ్లే ఉన్నారు. UAEలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సెక్యూరిటీ ఉంటుంది. UAE ప్రపంచంలో రెండో అత్యంత సురక్షిత ప్రాంతంగా ర్యాంక్ అయింది. సో అందుకే మనోళ్లు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పుడీ వీసా మరింత వెసులుబాటు కల్పించినట్లైంది.
భారతీయులకు శాశ్వత నివాసం కల్పించాలని UAE ఎందుకు ప్లాన్ చేసింది? దుబాయ్ ఆర్థిక ప్రణాళికల్లో మార్పులు చేసుకుంటోందా? దుబాయ్ లో మనవాళ్లు ఎక్కువ మంది సెటిల్ అయితే వారికొచ్చే లాభాలేంటి? విదేశీయులకు ట్యాక్స్ ఫ్రీ కల్పిస్తూ దుబాయ్ ఎలా ట్రాన్స్ ఫామ్ అవ్వావలని కోరుకుంటోంది? భారతీయ సంపన్నులు దుబాయ్ లోనే సెటిల్ అవడానికి ప్రధాన కారణాలేంటి? గోల్డెన్ వీసాతో దుబాయ్ ప్లాన్ చేసిన ఆర్థిక, వ్యూహాత్మక లక్ష్యాలేంటి?
పెట్రోల్ నిల్వలు అయిపోతే దుబాయ్ భవిష్యత్ ఏంటి?
UAE అనేది ఏడు ఎమిరేట్‌ల సమాఖ్య. ఇందులో అబుదాబి, దుబాయ్ కీలకం. గోల్డెన్ వీసాదారులు ఈ ఏడు చోట్ల ఎక్కడైనా ఉండొచ్చు. సో యూఏఈ ఇలా ఆఫర్లు ఇవ్వడానికి రీజన్స్ చూద్దాం. UAE ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు చమురు ఆధారితమే. అయితే ఈ పెట్రోలియం ఎప్పటికైనా అయిపోతుంది. ఆ తర్వాత దుబాయ్ భవిష్యత్ ఏంటి? పెట్రోలియం ఉత్పత్తులతోనే అరబ్ కంట్రీస్ మనుగడ సాగిస్తున్నాయి. అయితే పెట్రోల్ నిల్వలు అయిపోయాక కూడా మనుగడ సాగించే ప్లాన్ లో దుబాయ్ ఉంది. అందుకే అక్కడి ఆర్థిక వ్యవస్థను టెక్నాలజీ, టూరిజం, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వైపు మళ్లిస్తోంది. ఇది జరగాలంటే ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున జనం రావాలి. స్థిరపడాలి. కొనుగోల్లు అమ్మకాలు జరగాలి. సొంత దేశాల్లో సంపాదించుకున్న ఆదాయాన్ని దుబాయ్ కి షిఫ్ట్ చేసుకోవాలి.. ఇలాంటి ప్లాన్లు చాలానే ఉన్నాయి.
UAE ఒక టాక్స్ ఫ్రీ ఆర్థిక వ్యవస్థ
UAE ఒక టాక్స్ ఫ్రీ ఆర్థిక వ్యవస్థ. అక్కడ పర్సనల్ ఇన్‌కమ్ టాక్స్ లేదు. భారత్ లో గరిష్టంగా 30% ఇన్‌కమ్ టాక్స్‌తో పోలిస్తే, UAEలో జీతం, వ్యాపార లాభాలు, లేదా ఇతర ఆదాయాలపై టాక్స్ సున్నా. ఇది సంపన్నులు, ప్రొఫెషనల్స్‌కు ఆదాయాన్ని ఆదా చేయడానికి పెద్ద అవకాశం. అందుకే మనోళ్లు మాట మాట్లాడితే దుబాయ్ అంటుంటారు. UAEలో ఆస్తులు అంటే రియల్ ఎస్టేట్, షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అమ్మడం ద్వారా వచ్చే లాభాలపై క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ లేదు. మనదగ్గర లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్‌పై 10-20% టాక్స్ ఉంటుంది. ట్యాక్స్ విషయంలో మరో ముఖ్యమైన విషయం. భారత్ – UAE మధ్య 1993లో ఓ అగ్రిమెంట్ జరిగింది. అదేంటంటే డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్. ఈ ఒప్పందం ద్వారా UAEలో సంపాదించిన ఆదాయంపై భారత్ లో టాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇండియాలో ఉన్న వాటిపై ఆదాయం వస్తే మాత్రమే వాటిపైనే ట్యాక్స్ కట్టాలి. సో దుబాయ్ లో ఎంతైనా సంపాదించు. భారత్ కు షిఫ్ట్ చేసుకోవడం ద్వారా ట్యాక్స్ నుంచి రిలీఫ్ పొందొచ్చన్న మాట. UAEలో 5% VAT మాత్రమే ఉంది. అది కూడా GST కంటే చాలా తక్కువ.
భారత్‌లో ఒక కోటి జీతం ఉంటే రూ.30 లక్షల ట్యాక్స్
2023 జూన్ 1 నుంచి UAEలో కార్పొరేట్ టాక్స్ – 9% రేటు అమలులోకి వచ్చింది. కానీ ఇది వ్యాపార ఆదాయం మన కరెన్సీలో 85 లక్షలు దాటిన సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. చిన్న వ్యాపారాలు, ఫ్రీ జోన్‌లలోని కంపెనీలు ఈ టాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు. భారత్ కు చెందిన సంపన్నులు ఈ నామినేషన్ బేస్డ్ గోల్డెన్ వీసా లేకపోయినా చాలా మంది దుబాయ్ షిఫ్ట్ అవడానికి కారణం అక్కడ పెద్దగా ట్యాక్సులు లేకపోవడమే. సింపుల్ గా చెప్పాలంటే భారత్ లో ఒక కోటి జీతం తీసుకునే వ్యక్తి.. 30 శాతం ట్యాక్స్ అంటే 30 లక్షల రూపాయల దాకా పన్ను కట్టాల్సిందే. ఎంత రిఫండ్ కు అప్లై చేసుకున్నా కట్టేది కట్టాల్సిందే. కానీ దుబాయ్‌లో ఈ మొత్తం పూర్తిగా ఆదా అవుతుంది. అందుకే ఇటీవలి కాలంలో మన దగ్గర బాగా డబ్బులు సంపాదించుకున్న వాళ్లు దుబాయ్ లో బిజినెస్ లు మొదలు పెడుతున్నారు. ఎందుకంటే దుబాయ్‌లో 45 ఫ్రీ జోన్‌లు ఉన్నాయి. ఇక్కడ 100% విదేశీ యాజమాన్యం, టాక్స్ మినహాయింపులు, సులభమైన కంపెనీ సెటప్ సౌకర్యాలు ఉన్నాయి.
దుబాయ్ ప్రపంచదేశాలకు స్ట్రాటజిక్ లొకేషన్
దుబాయ్‌లో రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా ప్రాఫిటబుల్ గా ఉంది. 2023లో దుబాయ్‌లో 40% ఇళ్లను ఇండియన్లే కొన్నారు. ఎందుకంటే అక్కడ రెంటల్ ఆదాయం 7శాతంగా ఉంది. ఇది భారత్ లో 2.7శాతమే. పైగా దుబాయ్ ప్రపంచదేశాలకు స్ట్రాటజిక్ లొకేషన్. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆసియా మార్కెట్‌లకు గేట్‌వే. 1 బిలియన్ కస్టమర్లతో మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా మార్కెట్‌కు యాక్సెస్ ఉంది. ఇండియా నుంచి కేవలం 3 నుంచి 4 గంటలే ఫ్లైట్ జర్నీ. అంతే కాదు UAEలో మన వాళ్లు ఇప్పటికే 35 లక్షల జనాభా ఉంది. ఇది మొత్తం జనాభాలో 27.49%. అక్కడ దీపావళి, ఈద్, క్రిస్మస్ వంటి పండుగలను ఘనంగా జరుపుకుంటారు. భారతీయ రెస్టారెంట్లు, టెంపుల్స్, కమ్యూనిటీ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇండియన్లకు ఇది సొంతదేశం అన్నట్లుగానే వాతావరణం ఉంటుంది.
స్టార్టప్‌లకు ఫండింగ్, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్ ఛాన్స్
దుబాయ్ ఒక గ్లోబల్ టెక్ స్టార్టప్ హబ్‌గా మారింది. UAE ప్రభుత్వం స్టార్టప్‌లకు ఫండింగ్, పార్టనర్‌షిప్‌లు, గ్లోబల్ మార్కెట్ యాక్సెస్‌ను అందిస్తోంది. భారతీయ స్టార్టప్‌లు ముఖ్యంగా AI, టెక్, హెల్త్‌కేర్ రంగాల్లో అక్కడ 30 శాతంతో ఉన్నాయి. UAE దిర్హామ్ కరెన్సీ స్థిరంగా ఉంటుంది. మన రూపాయితో పోలిస్తే ఎక్కువ విలువ ఉంది. దుబాయ్‌లో ఆదాయం సంపాదించి ఇండియాకు ట్రాన్స్‌ఫర్ చేస్తే, ఎక్స్చేంజ్ రేట్ వల్ల మంచి వాల్యూ వస్తుంది. దుబాయ్ లో ఉంటూ అక్కడి నుంచి గ్లోబల్ మార్కెట్‌లలో బిజినెస్ చేయడం ఈజీ. ఎందుకంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ పై ఆంక్షలు అక్కడ చాలా తక్కువ. అందుకే అక్కడి నుంచే బిజినెస్ లో చేయాలనుకుంటున్న వారికి ఈ గోల్డెన్ వీసా మరింత బెనిఫిట్ కాబోతోంది. వీటికి తోడు అక్కడ లగ్జరీ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, షాపింగ్ మాల్స్, టాప్ రెస్టారెంట్లు, ప్రపంచ స్థాయి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నాయి. ఇవి సంపన్నులను ఆకర్షిస్తాయి.
8-9 గంటల పనివేళలు, శుక్ర, శనివారాలు సెలవులు
దుబాయ్‌లో క్రైమ్ రేట్ చాలా తక్కువ. మహిళలు, పిల్లలకు సేఫ్టీ. దుబాయ్‌లో 8-9 గంటల పనివేళలు ఉన్నాయి. వారాంతం అంటే శుక్ర, శనివారాలు సెలవులే. అలాగే సంవత్సరానికి 30 రోజుల లీవ్‌లు ఉంటాయి. మెరుగైన వర్క్ బ్యాలెన్స్ కూడా మన నిపుణులు దుబాయ్ వెళ్లడానికి కారణం. దుబాయ్ పర్మినెంట్ వీసా వెనుక ప్లాన్, లక్ష్యాలు, అలాగే ఇండియన్లు ఎక్కువగా సెటిల్ అయితే UAEకి కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. 2023లో భారతదేశం నుంచి UAEకి $74.6 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో ఇండియన్ ఎగుమతులు $31.3 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం భారతీయులకు దుబాయ్‌లో వ్యాపార అవకాశాలను పెంచింది. ఇప్పుడీ గోల్డెన్ వీసాతో మరింత బెనిఫిట్ ఉండబోతోంది.
విజన్ 2030 టార్గెట్ పెట్టుకున్న UAE
తాజాగా ప్రవేశపెట్టిన నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసా పైలట్ ప్రాజెక్ట్ కింద ఇండియా, బంగ్లాదేశ్‌లను ఎంచుకున్నారు. మొదటి మూడు నెలల్లో 5,000 ఇండియన్ అప్లికేషన్లు రావొచ్చని అంచనా వేస్తున్నారు. దుబాయ్ తనను తాను గ్లోబల్ టెక్, ఫైనాన్స్, ఇన్నోవేషన్ హబ్‌గా మార్చుకోవాలని టార్గెట్ పెట్టుకుంది. విజన్ 2030తో ముందుకెళ్తోంది. ఇది జరగాలంటే విదేశాల నుంచి టెక్ ప్రొఫెషనల్స్, వ్యవస్థాపకులు, డాక్టర్లు, క్రియేటివ్ పర్సనాలిటీస్ అవసరం. భారత్ లో జనాభా ఎక్కువ. మ్యాపన్ పవన్ హ్యూమన్ రీసోర్స్ ఎక్కువ. సో మనోళ్లనే మొదట టార్గెట్ చేయడానికి కారణం ఇదే. భారతీయ సంపన్నులు, ప్రొఫెషనల్స్ దుబాయ్ వెళ్లి సెటిల్ అయితే.. ట్యాక్సులు పెద్దగా ఉండవు కాబట్టి అక్కడే రియల్ ఎస్టేట్, స్టార్టప్‌లు, టెక్ రంగాలలో పెట్టుబడులు పెడతారు. కంపెనీలను విస్తరించుకుంటారు. మరింత మంది మనవాళ్లను రప్పించుకుంటారు. దీంతో దుబాయ్ ఆర్థిక వృద్ధికి బెనిఫిట్ అవుతుంది. 2015-2021 మధ్య ఇండియన్లు దుబాయ్ రియల్ ఎస్టేట్‌లో 1.94 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. ఈ గోల్డెన్ వీసాతో అది మరింత పెరుగుతుంది.
గ్లోబల్ టాలెంట్ హబ్‌గా అవ్వాలన్నది దుబాయ్ లక్ష్యం
సిలికాన్ వ్యాలీ లేదా సింగపూర్ వంటి గ్లోబల్ టాలెంట్ హబ్‌గా మార్చుకోవాలని దుబాయ్ కోరుకుంటోంది. భారతీయ టెక్ ప్రొఫెషనల్స్ AI, డేటా సైన్స్, సాఫ్ట్‌వేర్, డాక్టర్లు, క్రియేటివ్ వ్యక్తులతో ఈ లక్ష్యం సాధ్యమవుతుంది. అందుకే పర్మినెంట్ సెటిల్మెంట్ అంటూ గోల్డెన్ వీసాను దుబాయ్ తీసుకొచ్చింది. తెరవెనుక వ్యూహం ఇదే. UAE జనాభాలో 88 శాతం విదేశీయులే. కేవలం 12 శాతమే స్థానికులు. భారతీయుల జనాభా క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 35 లక్షలకు పైగా ఉన్నారు. ఇప్పుడీ గోల్డెన్ వీసాతో మరింతగా పెరుగుతారు. 5 వేల మంది ఇండియన్లు గోల్డెన్ వీసాకు అప్లై చేసుకుంటే వారు కట్టే 23 లక్షల రూపాయలతో దుబాయ్ ఆర్థిక వ్యవస్థకు నేరుగా ఈజీగా ఒక్క దెబ్బతో 11 వేల 650 కోట్ల రూపాయలు వారి ఖజానాకు వెళ్తాయి.
Also Read: కాటిపల్లి సైలెంట్.. అసలు కారణాలు ఇవేనా?
ఇండియన్ ప్రొఫెషనల్స్‌కు UAEకి ప్రయోజనాలు
భారతీయ సంపన్నులు దుబాయ్‌లో షాపింగ్, టూరిజం, లగ్జరీ సర్వీసెస్‌పై ఖర్చు చేస్తారు. దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్, టూరిస్ట్ డెస్టినేషన్లు ఇండియన్ కస్టమర్ల నుంచి మంచి ఆదాయాన్ని పొందుతున్నాయి. సో ఏ లెక్కన చూసినా దుబాయ్ లో స్థానిక జనాభా తక్కువ. కేవలం వారితో తాము పెట్టుకున్న లక్ష్యం రీచ్ అవడం కష్టం. అందుకే విదేశీయులను ఆకర్షించి, ముఖ్యంగా ఇండియన్లకు రెడ్ కార్పెట్ పరిచి టార్గెట్ రీచ్ అవ్వాలనుకుంటున్నారు. ఇందులో మనవాళ్లూ బెనిఫిట్ అవుతారు. అదే సమయంలో UAEకి కూడా ప్రయోజనం. పైగా దుబాయ్ ఇంకా పెట్రోలియంను నమ్ముకునే పరిస్థితిలో లేదు. అందుకే ఈ వీసా ఆఫర్లు. వేర్వేరు రంగాల్లో హబ్ గా నిలవడం ద్వారా సుస్థిరంగా ఉండాలన్న ప్లాన్ దుబాయ్ ది. మన వాళ్ల ప్లాన్ మనవాళ్లది. ఉపాధికి మార్గం, ట్యాక్సులు ఫ్రీ. అదీ మ్యాటర్.