Telangana BJP: రెండు పార్టీల అగ్రనేతలను ఓడించిన లీడర్ ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పాపులరైన ఆ నేత.. గత కొన్ని రోజులుగా చాలా సైలెంట్‌గా ఉంటున్నారట. పార్టీ కార్యక్రమాల్లోనూ ఓ మాదిరిగానే పాల్గొంటున్నారట. ఇలాంటి పరిస్థితుల్లోనే.. ఇటీవలె పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమానికీ హాజరు కాలేదట. అసలు ఎందుకీ పరిస్థితి..? కమలంలో ఏం జరుగుతోంది..?
కామారెడ్డి పాలిటిక్స్‌లో కాటిపల్లి గ్రాండ్ విక్టరీ
కాటిపల్లి వెంకటరమణారెడ్డి. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు ఆయన రేంజ్ ఒకలా ఉంటే.. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరోలా మారిపోయింది. నిజమే.. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు కాటిపల్లి. అయితే.. ఇదేదో సాధారణ విక్టరీ అయ్యుంటే ఇంతగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి హేమాహేమీలైన అభ్యర్థులు బరిలో దిగారు. బీఆర్ఎస్ నుంచి గులాబీ బాస్ కేసీఆర్ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి బరిలో దిగారు. కానీ, వీరిద్దరిపై పైచేయి సాధించి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేశారు కాటిపల్లి వెంకటరమణారెడ్డి.
రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు దూరంగా వెంకటరమణారెడ్డి
జెయింట్ కిల్లర్‌గా కామారెడ్డి నుంచి విజయం సాధించడంతో కాటిపల్లి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగింది. అలాంటి నేత మొదట్లో బాగానే ఉన్నా.. గత కొంత కాలంగా ఆయన పేరు గట్టిగా విన్పించడం లేదన్న కామెంట్లు వస్తున్నాయి. పార్టీ కార్యక్రమాలకు కొన్ని రోజుల పాటు అందుబాటులో లేరు కాటిపల్లి. ఎక్కడా ఆయన పేరు సైతం సరిగా విన్పించని పరిస్థితి. ఇప్పుడిప్పుడే మళ్లీ నియోజకవర్గంలోని కార్యక్రమాలకు హాజరవుతున్న ఆయన.. రాష్ట్రస్థాయిలో జరిగే కార్యక్రమాలపై పెద్దగా స్పందించడం లేదన్న అభిప్రాయం కార్యకర్తల్లోనే విన్పిస్తోంది.
రామచంద్రరావును కలిసేందుకు సైతం రాని కాటిపల్లి..!
ఎక్కడిదాకో ఎందుకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రామచంద్రరావు. ఇలాంటి వేళ కనీసం నూతన అధ్యక్షుడ్ని విష్ చేసేందుకు సైతం ఆయన రాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. కమలం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కాటిపల్లి ఎందుకు రాలేదు..? నియోజకవర్గంలో అంత పని ఏం ఉంది..? అయినా ఎంత వర్క్ ఉన్నా.. పార్టీకి నూతన అధ్యక్షుడు వచ్చినప్పుడు కనీసం వచ్చి కలవడం అనేది నేతలు సర్వసాధారణంగా చేసే పని. మరి ఆ రకంగా చూసినా ఆయన ఎందుకు రాలేకపోయారు అన్న ప్రశ్న తలెత్తుతోంది.
గతంలో ఎంతో యాక్టివ్‌గా కన్పించిన వెంకట రమణారెడ్డి
వాస్తవానికి కొన్ని నెలల క్రితం కాటిపల్లి పార్టీలో ఎంతో యాక్టివ్‌గా కన్పించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటామన్నారు. హైడ్రా కూల్చివేతలకు వ్యతిరేకంగా గళమెత్తారు. అసలు కార్పొరేట్ల కోసమే ఈ కూల్చివేతలు అంటూ అందుకు సంబంధించిన ఆధారాలు సైతం తన వద్ద ఉన్నాయంటూ ప్రకటించారు. అంతేనా.. తన వద్ద ఉన్న ప్రూఫ్స్ అబద్దమని నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటా అన్న రేంజ్‌లో కమలం తరఫున బలంగా గళం విన్పించారు కాటిపల్లి. అలాంటి నేత ఎందుకు ఇప్పుడు రాష్ట్ర కార్యాలయానికి, రాష్ట్ర నాయకత్వానికి దూరంగా ఉంటున్నారన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది. అదే సమయంలో ఇటీవలి కాలంలో నియోజకవర్గంలో తిరుగుతున్న కాటిపల్లి.. రాష్ట్ర కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాటిపల్లి మౌనం వెనుక మర్మమేంటి..?
ఇక్కడే మరో మాట విన్పిస్తోంది. కేవలం కాటిపల్లి మాత్రమే కాదు.. బీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మరికొందరు సైతం పార్టీ పట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారట. ఎమ్మెల్యే రాజాసింగ్ బహిరంగంగానే తన అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఇదే కాదు.. గతంలోనూ ఇలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయన్న టాక్ విన్పిస్తోంది. పైగా రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు అసెంబ్లీ, బీజేఎల్పీ కార్యాలయంలో సమావేశమైన విషయాలను గుర్తుచేస్తున్నారు. కానీ.. అప్పటితో పోలిస్తే ఇప్పటికి అధ్యక్షులు మారారు.
Also Read: దుమారం రేపుతున్న బీహార్ ఓటర్ల జాబితా వివాదం
నూతన నాయకత్వం కొలువు తీరింది. మరి పార్టీలో ఇప్పటికైనా ఎమ్మెల్యేలు తమ వైఖరి మార్చుకుంటారా..? లేదంటే అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తారా..? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఇతర ఎమ్మెల్యేల సంగతి కాస్త పక్కన పెడితే బీజేపీలో జెయింట్ కిల్లర్‌గా పేరు పొందిన కాటిపల్లి మౌనం వెనుక.. కారణాలు ఏంటన్న వాటిపై జోరుగా చర్చ జరుగుతోంది.