Udayagiri MLA: పార్టీ అధినేత ఆశయాలు తనకు ఆదర్శమన్నాడు.. ప్రజాసేవే పరమార్థమని చెప్పుకుని ఎన్నికల్లో విజయం సాధించాడు.. ఏళ్ల తరబడి ఉదయగిరి నియోజకవర్గాన్ని ఏలిన నేతలను ప్రజలు పక్కన పెట్టి.. అభివృద్ధే తన లక్ష్యమన్న ఆ యువనేతకు పట్టం కట్టారు.. సీన్ కట్ చేస్తే పరిస్థితి భిన్నంగా మారింది. అభివృద్ధి, ఆశయాలు మాటేమో గానీ ఆ నాయకుడిపై విమర్శలు మాత్రం వెల్లువెత్తుతున్నాయి. అభివృద్ధి మాట ఏంటో కానీ అవినీతి మరకలు మాత్రం అంటుతున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ఆ పార్టీ అధినేత వరకు అందరు ఆయనపై ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తున్నారంట. ఇంతకీ ఏదా నియోజకవర్గం?.. ఎవరు ఆ అధికార పార్టీ నేత?
వెంకయ్యనాయుడు వంటి ప్రముఖులను ఆదరించిన ఉదయగిరి
ఉదయగిరి ఒకప్పుడు రాజులేలిన గడ్డ.. చారిత్రక అవశేషాలు, విశేషాలకు పుట్టినిల్లు.. హేమా హేమీలైన నేతలను అక్కున చేర్చుకున్న నియోజకవర్గం అది. పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాజకీయ ప్రస్థానం అక్కడ నుంచే మొదలైంది. ముప్పవరపు వెంకయ్య నాయుడుని ఆ నియోజకవర్గ ప్రజలు అక్కున చేర్చుకున్నారు. ఆ తర్వాత మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాదాల జానకిరామ్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కంభం విజయరామిరెడ్డి, 2014లో బొల్లినేని రామారావు ఇలా ఆ ప్రాంత వాసులు ఎందరో ప్రముఖులకు పట్టం కట్టారు.
ఉదయగిరిలో టీడీపీకి బలమైన క్యాడర్
జిల్లాలో భౌగోళికంగా అతిపెద్ద నియోజక వర్గంగా, మెట్ట ప్రాంతంగా ఉన్న ఉదయగిరిలో ఆది నుంచి తెలుగుదేశం పార్టీకి బల మైన క్యాడర్, లీడర్షిప్ ఉంది. గతంలో కాంగ్రెస్, వైసిపి వరుస విజయాలు సాధించినప్పటికీ ప్రతిపక్ష హోదాలో దశాబ్ద కాలంగా ధీటైన పోటీనిస్తోంది అక్కడ టిడిపి. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు, నియోజకవర్గ వాసి అయిన ఎన్ఆర్ఐ, ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
కాకర్లను శాసనసభకు పంపిన ఉదయగిరి వాసులు
ఎప్పుడూ కొత్తవారికి చోటిస్తూ, యువ నేతలను అక్కున చేర్చు కునే ఉదయగిరి వాసులు, మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మేకపాటి కుటుంబీకులను కాదని కాకర్ల సురేష్‌కు పట్టం కట్టారు. సురేష్ ను తొలిసారి టిడిపి నుంచి శాసనసభకు పంపారు. జిల్లాలోనే యువ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగు పెట్టిన కాకర్ల సురేష్‌పై ఏడాది కాలంలోనే ఊహించని విమర్శలు , తీవ్రమైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: అసలు గుంట నక్కలు ఎవరో బయటపడ్డారు.. సామా రామ్మోహన్ రెడ్డి ఫైర్
నియోజకవర్గంలో అపారంగా ఉన్న వైట్ క్వార్ట్, ఎర్రమట్టి, గ్రావ్‌ల్
ఉదయగిరి మెట్ట నియోజకవర్గంలో అపారంగా ఉన్న వైట్ క్వాడ్జ్, ఎర్రమట్టి, గ్రావెల్, కంకర అక్రమ తవ్వకాలకు సంబంధించి కాకర్ల సురేశ్‌పై ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవిన్యూ భూముల రికార్డుల తారుమారు, ప్రభుత్వ భూములను సొంతం చేసుకోవడం వంటి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చివరకు లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు చెందిన భూముల్లో సిరులు పండిస్తున్న జామాయిల్, ఎర్రచందనం చెట్లను అక్రమంగా నిలువునా నరికి సొమ్ము చేసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సురేష్‌పై సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు.
ఎమ్మెల్యేపై చంద్రబాబుకి ఫిర్యాదు చేసిన ఉదయగిరి నేతలు
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జండా మోసి, కాకర్ల గెలుపు కోసం కృషి చేసిన సొంత పార్టీ నాయకులే ఆయన్ని టార్గెట్ చేస్తుండటం ఉదయగిరి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పార్టీలోకి వలస తెచ్చుకున్న నాయకుల సలహాలను పాటిస్తూ, సొంత పార్టీ నేతలను నిర్లక్ష్యం చేస్తున్నారని, సొంత వారికి కనీస గౌరవం ఇవ్వడం లేదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి ఫిర్యాదు కూడా చేశారంట. అంతేకాక కాకర్ల సురేశ్ ఏరికోరి చేర్చుకున్న వలస నాయకుల అవినీతి చిట్టాలను కూడా మంత్రి లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు పెట్టారట. దాంతో ఎమ్మెల్యే సురేష్‌పై యువనేత, అధినేత అసహనం వ్యక్తం చేసి, పద్దతి మార్చుకోవాలని వార్నింగ్ కూడా ఇచ్చారంట.
లోకేష్ అండదండలతోనే ఎమ్మెల్యే కాకర్ల దందా చేస్తున్నారని ఆరోపణలు
మరో వైపు అగ్రిగోల్డ్ భూముల్లో ఉండే 100 కోట్లు విలువచేసే జామాయిల్ , ఎర్రచందనం చెట్లను లోకేష్ అండదండ లతోనే ఎమ్మెల్యే కాకర్ల, ఆయన అనుచరులు నరికేసి అక్రమ రవాణా చేశారని ఉదయగిరి వైసిపి ఇన్చార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. అటు అగ్రిగోల్డ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు ముప్పా ళ్ళ నాగేశ్వరరావు కూడా వరికుంటపాడు మండలంలోని చెట్లు నరికివేత, అక్రమ రవాణా జరిగిన అగ్రిగోల్డ్ భూములను పరిశీలించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని.. అక్రమార్కులకు అండగా నిలిచిన అధికారులను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు వాహనాన్ని అడ్డుకుని దాడి యత్నం
భూములను పరిశీలించి వస్తున్న ముప్పాళ్ళ నాగేశ్వరరావు వాహనాన్ని కొందరు అక్రమార్కులు అడ్డుకుని దాడికి యత్నించడంతో అసోసియేషన్ నాయకులు నెల్లూరు నగరంలో ర్యాలీ చేపట్టి జిల్లా కలెక్టర్ , జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తాజాగా నెల్లూరులో జరిగిన ఓ వివాహ వేడుకలో.. ఎమ్మెల్యే అసమ్మతి వర్గం నేతలు సమావేశమై ఎమ్మెల్యేకి వ్యతి రేకంగా తిరుగుబాటు బావుటా ఎగరవేయాలని నిర్ణయించారట. మొత్తానికి ఒకపక్క ఎమ్మెల్యే కాకర్లపై అవినీతి ఆరోపణలు.. మరోవైపు అసమ్మతి వర్గం తిరుగుబాటుతో ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డామేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ పరిస్థితిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి..