Turmeric Crisis: పసుపు అంటే మంగళకరం.. కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి పసుపు రైతుల పాలిట మాత్రం అది కన్నీటి పర్యంతంగా మారుతోంది. ఎన్నో ఏళ్లుగా పసుపునే నమ్ముకున్న అన్నదాతలు కష్టాల్లో పడి నలిగిపోతున్నారు. లక్షల్లో పెట్టుబడి ఖర్చులు ఒకవైపు.. దళారుల మాయాజాలంతో పడిపోతున్న ధరలు మరోవైపు గిట్టుబాటు ధర లేక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఉదయగిరి నియోజకవర్గ పసుపు రైతుల కష్టాలపై బిగ్ టివి స్పెషల్ స్టోరీ.
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి నియోజకవర్గం పసుపు సాగుకు చిరునామా. ఉదయగిరి, సీతారామపురం, దుత్తలూరు, వరికుంటపాడు, వింజమూరు వంటి ఏడు మండలాల్లో సుమారు 20 హెక్టార్ల విస్తీర్ణంలో పసుపు పంట పండిస్తున్నారు. భూమి ఉన్న ప్రతి రైతు తమకున్న పొలంలో కనీసం సగభాగం పసుపు కోసమే కేటాయించడం ఇక్కడి ప్రత్యేకత. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పసుపు సాగును ప్రాణం కంటే మిన్నగా ప్రేమిస్తున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు వారిని తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. పసుపు పంటను నమ్ముకున్న తమ బతుకుల్లో వెలుగులు నిండకపోగా, చీకట్లు అలుముకుంటున్నాయని వాపోతున్నారిక్కడి రైతులు.
ముఖ్యంగా ఉదయగిరి కొండ దిగువ ప్రాంతాలైన బిజ్జంపల్లి, కొత్తపల్లి, కొట్టాలు, లింగంనేనిపల్లి, దేకూరుపల్లి వంటి గ్రామాల్లో.. పసుపు సాగు అత్యధికంగా కనిపిస్తుంది. పసిడి రంగు పంటను పండించేందుకు రైతులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఒక ఎకరా పసుపు సాగు చేయాలంటే ఏకంగా 2 లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవుతోంది. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు భారంగా మారినప్పటికీ, పంట చేతికొస్తే అప్పులు తీరుతాయని ఆశపడ్డారు. కానీ తీరా మార్కెట్‌కు వెళ్తే అక్కడి దళారులు చెప్పే ధరలు చూసి గుండెలు బాదుకుంటున్నారు. కష్టమంతా తమదైతే, లాభమంతా దళారుల పాలవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కాళేశ్వరం రిపేర్లపై రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్.. కల్నల్ మెహ్రా నేతృత్వంలో హైలెవల్ కమిటీ
ఫిబ్రవరి వరకు క్వింట పసుపుకు 13,500 రూపాయల వరకు లభించగా, ఇప్పుడు అది ఒక్కసారిగా 10,500 నుంచి 11వేల మధ్యకు పడిపోయింది. ఈ ధరలతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ధరలు ఇంకా పడిపోతాయేమోనన్న భయంతో కొందరు రైతులు తక్కువ ధరకే తమ నిల్వలను అమ్ముకున్నారు. ఆ తర్వాత ధర స్వల్పంగా పెరిగినా కూడా.. తాము భారీగా నష్టపోయామని వాపోతున్నారు. రోజుకో రకంగా మారుతున్న ఈ గిట్టుబాటు లేని ధరలు రైతు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రభుత్వం పసుపు పంటకు స్పష్టమైన గిట్టుబాటు ధరను ప్రకటించకపోవడం ఇక్కడ దళారులకో వరంగా మారింది. నిలకడలేని మార్కెట్‌ను ఆసరాగా చేసుకుని.. దళారులు తమ ఇష్టానుసారంగా ధరలను నిర్ణయిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. పండించిన పంటను దాచుకునే వీలు లేక, అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేక రైతులు దళారులు అడిగిన ధరకే పంటను అప్పగిస్తున్నారు. తమకు కనీసం 15వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పుడే తాము పీకల్లోతు అప్పుల నుంచి బయటపడతామని డిమాండ్ చేస్తోంది ఉదయగిరి రైతాంగం.
గతంలో ఉదయగిరి ప్రాంత రైతులు పసుపు విక్రయాల కోసం కడప, దుగ్గిరాల యార్డులకు వెళ్లేవారు. అయితే నేడు రవాణా ఛార్జీలు పెరగడంతో అంత దూరం వెళ్లడం తలకు మించిన భారంగా మారింది. స్థానికంగా కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, దూర ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే ఎక్కువ ఖర్చు అవుతుండటంతో.. రైతులు అనేక పాట్లు పడుతున్నారు. ప్రస్తుతం కడప మార్కెట్ యార్డుకి తీసుకెళ్తున్నట్లు చెబుతున్నారు. దళారులు అడగోలుగా కొనుగోలు చేస్తూ, రవాణా ఖర్చుల పేరుతో ధరల కోత పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. శ్రమ ఒకరిది, ఫలితం మరొకరిదిగా మారిందని వాపోతున్నారు ఉదయగిరి పసుపు రైతాంగం
సంప్రదాయబద్ధంగా పసుపు సాగు చేస్తున్న ఈ రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాల్సిన అవసరం ఉంది. గిట్టుబాటు ధర ప్రకటించి ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తే మాకు న్యాయం జరుగుతుందని అంటున్నారిక్కడి రైతులు. లేదంటే వచ్చే రోజుల్లో పసుపు సాగు వదిలేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అప్పుల బాధతో ఏ రైతు ప్రాణం పోకముందే.. అధికార యంత్రాంగం స్పందించి ఉదయగిరి పసుపు రైతులకు అండగా నిలవాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతోంది.
Storey By: Appa Rao Big Tv
Also Read: ఇరాన్ కీలక నిర్ణయం.. హర్మోజ్ జలసంధి ఓపెన్.. ఊపిరి పీల్చుకున్న ప్రపంచ దేశాలు!