Vallabhaneni Vamsi Case: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వల్లభనేని వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ ఆరోపిస్తుండగా.. అన్ని ఆధారాలతోనే అరెస్ట్ చేసినట్లు ప్రభుత్వం చెప్తోంది. కిడ్నాప్, దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఫోన్ కీలకంగా మారటంతో ఫోన్ పైనే ప్రధానంగా దృష్టి సారించినా దాని ఆచూకీ దొరక్కపోవడం చర్చనీయాంశంగా మారింది.. మరోవైపు వంశీపై ఉన్న పాత కేసులపైనా పోలీసులు ఫోకస్ పెడుతున్నారు.
జగన్ హయాంలో రెచ్చిపోయిన వైసీపీ నేతలు
జగన్ హయాంలో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. అడ్డగోలు దోపిడీలు, కబ్జాలకు పాల్పడ్డారు. ఎదురు వచ్చిన వారితో దారుణంగా ప్రవర్తించారు. పోలీసు స్టేషన్లకు వెళ్లాలంటేనే భయపడాలే చేశారు. కేసు పెడితే ఎంతగానో హింసించే వారు. వైసీపీ పాలించిన ఐదేళ్లలో ఇలాంటి ఘటనలు ఎన్నో రాష్ట్రంలో నమోదయ్యాయి. తప్పును ప్రశ్నించిన బాధితులను అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు భయభ్రాంతులకు గురిచేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అరాచక పాలన సాగించింది. చాలా చోట్ల పోలీసులు కూడా వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకన్యాయం జరుగుతుందన్న నమ్మకంతో బాధితులు బయటకు వస్తున్నారు.
ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా వల్లభనేని వంశీ
ఆ క్రమంలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వల్లభనేని వంశీ కూడా టీడీపీ టికెట్‌తో గెలిచినప్పటికీ, జగన్ పంచకు చేరి ఫక్తు వైసీపీ నేతలా చెలరేగిపోయారు. వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడికి సంబంధించి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి అతను కేసు ఉపసంహరించుకునేలా హింస పెట్టిన కేసులో ఎట్టకేలకు వంశీ పోలీసులకు చిక్కారు. వంశీని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆ తర్వాత విజయవాడకు తరలించి, కోర్టు ఎదుట హాజరుపరిచారు. ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ్ సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
వంశీ ఫోనుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న పోలీసులు
అయితే కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ రాయదుర్గంలోని వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ కేసులో వల్లభనేని వంశీ ఫోన్ కీలకంగా మారటంతో ఫోన్ పైనే ప్రధానంగా దృష్టి సారించారు. హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులకు ఫోన్ లభించలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ కోసం గాలిస్తున్నారు. వల్లభనేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం చేసుకుంటే కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు వల్లభనేని వంశీ పీఏ ఫోన్‌ను గురువారమే స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
రాయదుర్గం నివాసంలో ఫోను కోసం సోదాలు
వంశీ ఫోన్ కోసం హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని ఆయన నివాసంలో.. రెండు గంటల పాటు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అయినా కూడా ఫోన్ ఎక్కడుందనేదీ తెలుసుకోలేకపోయారు. మరోవైపు అరెస్ట్ సమయంలో వల్లభనేని వంశీ దాదాపు గంట పాటు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే వంశీ ఫోన్ చివరి సారిగా రాయదుర్గంలోని ఆయన నివాసంలోనే ఉన్నట్లు సెల్ ఫోన్ టవర్ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. కానీ రెండు గంటలపాటు వెతికినా పోలీసులకు ఫోన్ జాడ తెలియలేదు.
ఫోను దొరికితే కీలక సమాచారం లభించే అవకాశం
మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ ఫోన్ స్వాధీనం కోసం కోర్టు అనుమతి కోరుతూ పోలీసులు విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టులో ఇప్పటికే పిటిషన్ వేశారు. వల్లభనేని వంశీ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తే మరింత కీలక సమాచారం తెలుస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వల్లభనేని వంశీ ఎక్కువగా వాట్సప్ కాల్ ద్వారానే మాట్లాడుతుంటారని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే ఫోన్ ఐపీడీఆర్ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టిసారిస్తున్న పోలీసులు
మొత్తమ్మీద అధికారంలో ఉన్న అయిదేళ్లూ గన్నవరం నియోజకవర్గంలో అరాచకం సృష్టించిన మాజీ ఎమ్మెల్యే వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆయన తాలూకా పెండింగ్ కేసులపై కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. విచారణకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న కేసులను బయటకు తీస్తున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ గన్నవరం రాకుండా అజ్ఞాతంలో ఉండడంతో దర్యాప్తునకు ఆటంకం కలిగింది. అలాంటి పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి, రిమాండ్‌లో ఉన్న వంశీని కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇవేకాకుండా గతంలో వంశీ చేసిన అక్రమాలు, అరాచకాలపై కొత్తగా మరికొన్ని కేసులు నమోదు చేసే అవకాశాలున్నాయంటున్నారు.
వంశీ అనుచరుడిగా పనిచేసిన రియల్టర్ రంగబాబు
రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే రంగబాబు గతంలో వంశీకి అనుచరుడిగా ఉండేవారు. యార్లగడ్డ వెంకట్రావుతోపాటు రంగబాబు కూడా టీడీపీలో చేరారు. దీంతో కక్ష పెంచుకున్న వంశీ.. తన అనుచరులతో ఆయనపై దాడి చేయించి, తీవ్రంగా కొట్టించారు. వైసీపీ హయాంలో ఈ ఘటనపై గన్నవరం పోలీసులు తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పునర్విచారణ జరిపి, హత్యాయత్నం కింద 307 సెక్షన్‌ను చేర్చారు. దాడి వెనుక వల్లభనేని వంశీ పాత్ర ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయని, ఆయన్ను నిందితుడిగా చేర్చి, వంశీని కస్టడీలోకి తీసుకోనున్నట్లు తెలిసింది.
Also Read: లగడపాటి దారిలో కేశినేని నాని, కాకపోతే చిన్న ట్విస్ట్
41ఏ నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరుకాని వంశీ
హనుమాన్ జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో గత ఏడాది నవంబరులో నమోదైన కేసులో వంశీ ఏ2గా ఉన్నారు. ప్రాథమిక సహకార సంఘం మాజీ అధ్యక్షుడైన శ్రీనివాసరావు తన స్థలంలో నడుపుకొంటున్న ఎరువుల దుకాణాన్ని వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పోరంబోకు స్థలంగా చూపించి వంశీ కూల్చివేయించారు. ఈ కేసులో కూడా వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారంట .. గత ఏడాది ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై తేలప్రోలులో వంశీ దాడికి పాల్పడ్డారు. దీనిపై ఉంగుటూరు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. వంశీకి 41ఏ నోటీసు కూడా ఇచ్చినా ఇంతవరకు విచారణకు హాజరుకాలేదు. ఈ కేసులోనూ పోలీసులు పీటీ వారెంట్ వేయనున్నారు.
బెయిల్ రద్దు అయితే సీఐడీ పోలీసులకు కస్టడీలోకి
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి ఈ నెల 20 వరకు హైకోర్టులో ఉపశమనం ఉంది. ఆ తర్వాత కోర్టు ముందస్తు బెయిల్ రద్దు చేస్తే ఇందులోనూ విచారణ కోసం సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి ప్రలోభపెట్టడంలో కర్త, కర్మ, క్రియ వంశీనే అని దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగుర్ని అరెస్టు చేసిన పోలీసులు మరికొందరి కోసం గాలిస్తున్నారు. మరోవైపు వంశీ ఫోన్ విషయంలో పోలీసులకు నిరాశతప్పడం లేదు. అరెస్టు సమయంలోనే స్వాధీనం చేసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులకు ఇప్పుడు దాని జాడ కనిపెట్టడం సవాలుగా మారింది. మొత్తమ్మీద వంశీ కేసుల చట్రంలో గట్టిగానే ఇరుక్కునే పరిస్థితి కనిపిస్త్తోంది.