నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సీనియర్ పొలిటీషియన్. ఆయన చేతిలో పరాజయం పాలైన కాకాణి గోవర్ధన్ తాజా మాజీ మంత్రి .. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 నియోజకవర్గాలు టీడీపీ కైవసం చేసుకుంది. దాంతో ఓడిపోయిన నేతల్లో పలువురు సైలెంట్ అయిపోయారు. కొందరైతే ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు.
సర్వేపల్లి నియోజకవర్గం వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రత్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. అదే సర్వేపల్లిలో కాకాణి చేతిలో సోమిరెడ్డి అంతకు ముందు వరుసగా రెండు సార్లు ఓడిపోయారు. నాలుగు ఎన్నికల తర్వాత ఎట్టకేలకు సోమిరెడ్డికి విజయం దక్కింది. ఎన్నికల ముందు నుంచి కాకాణి అవినీతికి పాల్పడ్డారని ఎండగడుతూ అక్రమాలకు ఆధారాలు బయటపెడుతూ ప్రజల్లో తిరిగిన సోమిరెడ్డి .. కూటమి వేవ్‌లో ఘన విజయం సాధించగలిగారు.
ఓటమిని ఓర్చుకోలేని కాకాణి ప్రభుత్వం వచ్చి 100 రోజులు కాకపోయినా మీడియా సమావేశాలు పెట్టి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తుతున్నారు. పొదలకూరు మండలం సూరాయపాళెం ఇసుక రీచ్ అసలు ప్రారంభం కాకపోయినా.. 100 కోట్లు దోచేయడానికి తాము ప్రణాళిక సిద్దం చేసుకన్నామని ఆగమాగం చేస్తున్నాడని సోమిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఒక్క ఇసుక సంగతే కాదు.. పొదలకూరులో వెలసిన లేఅవుట్లకు అనుమతులు లేవని వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే సోమిరెడ్డి 7 కోట్లు అడిగినట్లు కాకాణి నిత్యం ఆరోపణలు చేస్తున్నారు.
Also Read: అఖండ కు అడ్డు ఎవడ్రా.. హిందూపురంలో పెద్దదిక్కు కరువైన వైసీపీ
అదలా ఉంటే గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలు, కక్ష్య సాధింపు చర్యలతో అమాయకులపై కేసులు పెట్టడం వంటి వాటిపై ఆధారాలతో సహా ప్రభుత్వానికి సోమరెడ్డి ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా పొదలకూరు మండలం వరదాపురం వద్దనున్న రుస్తుం, భారత్ మైన్స్ లలో భారీ అవినీతికి పాల్పాడ్డాడని మూడు రోజుల పాటు అక్కడ సత్యాగ్రహం కూడ చేపట్టానని గుర్తు చేస్తున్నారు. కాకాణి సుమారు 4వేల కోట్లు ఒక్క మైనింగ్ లోనే సంపాదించారని సోమిరెడ్డి ఎప్పటికప్పుడు ఆరోపిస్తున్నారు.
గ్రావెల్ , ఇసుక, మైనింగ్ మాఫియా, ల్యాండ్ మాఫియా ఇలా కాకాణి దేనిని వదలకుండా దోచేసి సర్వేపల్లిని సర్వనాశనం చేశారని ప్రజల్లోకి తీసుకెళ్లామని వాస్తవ విషయాలను గ్రహించిన ప్రజలు కాకాణికు సరైన బుద్ది చెప్పారని సోమిరెడ్డి అంటున్నారు. అవినీతి, అక్రమాలు బయటపెడుతుండటంతో అది ఓర్చుకోలేని కాకాణి ఎలాగైనా తనను డ్యామేజ్ చేయాలని అక్కడ 100 కోట్లు ఇక్కడ 100 కోట్లని కాకాణి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సోమిరెడ్డి విమర్శిస్తున్నారు. ఎన్నికలు ముగిసి ఇంత కాలం అవుతున్నా ఆ ఇద్దరి నేతల వాగ్యుద్దంతో జిల్లాలో పొలిటికల్ హీట్ కొనసాగుతూనే ఉంది. ఎవరు చెప్పే విషయంలో ఎంత నిజం ఉందో కాని.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి రాజకీయం ఆసక్తికరంగా తయారైంది.