Vijayawada Floods: బెజవాడలో జలవిలయానికి కారణం.. బుడమేరు. ఊహించని విధంగా ప్రవాహం ఉప్పొంగడంతో విజయవాడ మునిగిపోయింది. మరి ప్రతీ వర్షాకాలం ప్రవాహం పెరుగుతుంది. కానీ ప్రతిసారి విజయవాడ విలయవాడగా ఎందుకు మారలేదు..? ఈసారి మాత్రమే ఇలా ఎందుకు జరిగింది? ఈ విషయంపై కాస్త ఆలోచించి.. లోతుగా విచారిస్తే చాలా విషయాలు తెలిశాయి. ఇప్పుడు జరిగిన ఈ జలప్రళయానికి ఏళ్లుగా జరుగుతున్న నిర్లక్ష్యం, అలసత్వమే రీజన్ అని తేలిపోయింది.
తిలా పాపం.. తలా పిడికెడు. ఇప్పుడీ సామెత విజయవాడ వరద నీటిలో మునడానికి పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. మైలవరం కొండల్లో పుట్టింది ఈ బుడమేరు. పేరుకు వాగైనా.. ఏడాది పొడవునా ఇందులో నీళ్లుంటాయి. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న అతిపెద్ద మంచినీటి సరస్సైన కొల్లేరుకు నీటిని సప్లై చేసే వాగుల్లో ముఖ్యమైనది బుడమేరు. కానీ ఈసారి బుడమేరు ఉగ్రరూపం దాల్చడానికి కారణం మనమే. ఈ వరద శాపంగా మారడానికి ఇప్పుడు కాదు. 20 ఏళ్లుగా జరిగిన మార్పులు కారణం. ఇందులో ఆ గవర్నమెంట్.. ఈ గవర్నమెంట్ అని ఏమీ లేదు. అందరి తప్పు ఉంది.. అందుకే తిలా పాపం.. తలా పిడికెడు అనేది.
ఒక్కసారి స్ట్రాటస్టిక్స్ చూస్తే వరద ప్రభావం ఎందుకు ఇంతలా ఉందనేది మీకు అర్థమవుతుంది. 1962 నుంచి చూద్దాం. 1962లో 8 వేల 823 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇందులో డైవర్షన్ పోను.. దిగువకు 2 వేల 923 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్లింది. అదే 1964లో ఏకంగా 39 వేల 595 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇందులో 28 వేల 470 క్యూసెక్కుల వరద దిగువకు వెళ్లింది. అదే 2005లో 24 వేల 945 క్యూసెక్కుల వరద వచ్చింది. ఇందులో 14 వేల క్యూసెక్కులను దిగువకు వదిలారు. ఇక 2024 అంటే ఈ ఏడాదికి వచ్చేసరికి.. 45 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. ఇందులో 40 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. మీరు ఇక్కడో పాయింట్ క్యాచ్ చేయాలి. 1964లో 39 వేల క్యూసెక్కుల వరద వచ్చినా ఏం కాలేదు. కేవలం పంటపొలాలు మాత్రమే మునిగేవి. కానీ 2005కు వచ్చేసరికి 70 వేల క్యూసెక్కులకు బెజవాడ మునిగింది. అంటే బుడమేరు ఎప్పటిలానే ఉంది. కానీ బెజవాడ విస్తరణే అనూహ్యంగా పెరిగింది. కాబట్టి.. ఇక్కడ ప్రకృతిది ఏం తప్పు లేదు.. తప్పంతా మనదే అని అర్థమవుతోంది.
Also Read: బిగ్ అలర్ట్.. ఇవాళే మరో అల్పపీడనం.. విజయవాడలో మళ్లీ వర్షం
2005లో వరదల తర్వాత మరి ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారులు అలెర్ట్ కాలేదా? అంటే అయ్యారు. బుడమేరు పరివాహక ప్రాంతాలను రక్షించేందుకు రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు పూనుకున్నారు.. బట్ ఆ ప్రాజెక్ట్ అటకెక్కింది. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం మరొకటి ఉంది. బుడమేరు సహజ ప్రవాహం అనేక మలుపులు తిరుగుతుంది. ఇదే ఇప్పుడు మరింత కొంప ముంచింది. ఎందుకంటే బుడమేరు FTL,బఫర్ కనుమరుగయ్యాయి. లాస్ట్ 30 ఇయర్స్‌లో బుడమేరు కుచించుకు పోతూ వస్తుంది. కొత్త కాలనీలు వెలిశాయి.. వీటికి మన ప్రజాప్రతినిధులే రిబ్బన్‌కట్ చేశారు. దీంతో బుడమేరు సహజ ప్రవాహం దిశ మార్చుకుంది.
బుడమేరు వరద కొల్లేరులో కలవడం కష్టంగా మారింది. అయితే బుడమేరుకు నార్మల్‌గా 10 నుంచి 12 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. అప్పుడు పాక్షికంగా ఈ కాలనీలపై ప్రభావం పడుతూ వచ్చింది.. కానీ సర్దుకు పోయారు. కానీ ఈసారి ఏకంగా 45 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. కాబట్టి పాత బుడమేరు ఏ దిశలో అయితే ప్రవహించిందో.. ఇప్పుడు కూడా అదే దిశలో ప్రవహించింది. ఇప్పుడా దిశలో కాలనీలు ఉన్నాయి.. అవే ఇప్పుడు మునిగాయి.
సింగ్ నగర్, జక్కంపూడి కాలనీ, రాజరాజేశ్వరి పేట, అరుణోదయ కాలనీ, నున్న, చిట్టి నగర్, పాల ఫ్యాక్టరీ, రాయనపాడు, పైడూరుపాడు, కవులూరు, వైఎస్ఆర్ కాలనీ. ఇలా మునిగిన ప్రతి ఒక్క కాలనీ ఒకప్పుడు బుడమేరు ప్రవహించిన ప్రాంతాలే అనేది నగ్న సత్యం. పరిస్థితి ఎంతలా ఉందంటే.. కొన్ని ఏరియాల్లోకి పడవలు కూడా వేసుకొని వెళ్లలేకపోయాయి రెస్క్యూ టీమ్స్.
ఇక్కడ మరో విషయం ఉంది.. వెలగలేరు వద్ద బుడమేరుకు డైవర్షన్ కాలువ ఉంది. అక్కడ 11 గేట్లు ఉన్నాయి. ఇవి ఎత్తితే కృష్ణా నదిలో వరద కలుస్తుంది. కానీ అప్పటికే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. అయినా యథావిధిగా గేట్లు ఎత్తేశారు. దీంతో వరద ముందుకు వెళ్లకుండా.. వెనక్కి నెట్టింది. దీంతో డైవర్షన్ కాలువకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. దీనికి ఫలితమే పలు కాలనీలు నీట మునగడం.
అసలు బుడమేరు FTL, బఫర్ జోన్లలో నిర్మాణాలకు ఎలా అనుమతులిచ్చారు? ఎందుకిచ్చారు? 20 ఏళ్లుగా మెల్లిమెల్లిగా జరుగుతున్న ఆక్రమణలను చూసి చూడనట్టు వదిలేసింది ఎవరు? ఈ 20 ఏళ్లలో అనేక ప్రభుత్వాలు మారాయి? ఎవరిని ప్రశ్నించాలి? ఎవరిని నిందించాలి? సరే.. ఇవన్నీ పక్కన పెడితే.. ప్రభుత్వం ఇప్పుడు ఇక ముందు ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగిస్తుందా? అది సాధ్యమా? లేక బుడమేరు సామర్థ్యాన్నే పెంచుతారా? పెంచితే ఎలా పెంచుతారు? అమరావతి, విజయవాడను కలిపి విశ్వనగరంగా మార్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆలోచనకు ఈ వరదలు ఓ వార్నింగ్ లాంటివనే చెప్పాలి.