Israel-Hamas ceasefire: 15 నెలల సుదీర్ఘ యుద్ధంలో శాంతి రేఖలు ప్రసరించాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి బ్రేక్ పడింది. హమాస్-ఇజ్రాయెల్ మద్య సీజ్ ఫైర్ ఒప్పందం అమలుతో ప్రపంచమంతా ఊపిరిపీల్చుకుంది. అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు చేసిన మధ్య వర్తిత్వం ఎట్టకేలకు ఫలించింది. గాజాలో బంధీలు సంతోషంతో ఇంటికి చేరుతున్నారు. పాలస్తీనా యుద్ధ ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేస్తోంది. ఇజ్రాయెల్ పంతం నెగ్గింది. హమాస్‌కు వత్తిడి తగ్గింది. అంతా బానే ఉంది. మరి, తుక్కు తుక్కుగా మారిన గాజా పరిస్థితి ఏంటీ..? కలచెదిరిన గాజా కోలుకుంటుందా..? లక్షల మంది నిరాశ్రయుల భవిష్యత్‌కు భరోసా అందిందా..? యుద్ధం ఫలితం ఏం మిల్చింది..?
15 నెలల హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం సృష్టించిన ఉద్రిక్తత
గాజా… యుద్ధం మిగిల్చిన శకలంలా వేలాడుతున్న ఒక చిన్న ప్రాంతం. ఎలుక పిల్లపై ఏనుగు ఆధిపత్యం చెలాయిస్తే ఎలా ఉంటుందో అలా జరిగింది. ఈ యుద్ధం. 15 నెలల పాలు గాజాను జల్లెడలా మార్చాయి ఇజ్రాయెల్ బాంబులు. తుక్కు తుక్కుగా మారిన గాజా గుండెను కొన ఊపిరితో వదిలిపెట్టింది ఇజ్రాయెల్. ప్రపంచ చరిత్ర సంచలనాలు, చారిత్రక ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ, ప్రపంచ గతిని మార్చే సంఘటనలు మాత్రం అరుదుగా వస్తుంటాయి. అలాంటి ఓ భయంకరమైన అనుభవాన్ని అందించిన యుద్ధం హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం. దశాబ్ధాల తర్వాత మిడిల్ ఈస్ట్‌లో అత్యంత భయానక పరిస్థితికి కారణం అయ్యింది.
దాదాపు రెండు లక్షల మందికి తీవ్రమైన గాయాల
దాదాపు ఐదు దేశాలను ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలను పరోక్షంగా ప్రభావితం చేసిన యుద్ధం ఇది. యూరప్‌లో ఉక్రెయిన్-రష్యా యుద్ధం రెండున్నర సంవత్సరాలుగా నడుస్తున్నప్పటికీ.. 15 నెలల హమాస్-ఇజ్రాయెల్ సృష్టించిన ఉద్రిక్తతలు అంతకుమించిన మానవ హననానికి కారణం అయ్యాయి. హైద్రాబాద్ విస్తీర్ణమంత కూడా లేని 365 చదరపు కిలో మీటర్ల గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ తెగబడిన తర్వాత.. 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో పదివేల మృతదేహాలు శిథిలాల కింద ఉండొచ్చనే అంచనా ఉంది. దాదాపు రెండు లక్షల మంది తీవ్రమైన గాయాలతో బతుకీడుస్తున్నారు. 20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఇప్పుడు గాజాకు మిగిలింది ఏంటీ..?
వంద రోజుల్లోగా మృతదేహాలన్నీ వెలికితీయాలనే ప్లాన్
గాజా స్ట్రిప్‌లో జరిగిన విధ్వంసం స్థాయిని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ, రెస్క్యూ వర్కర్లు, పౌర సంఘాలు అంచనా వేయడం మొదలుపెట్టాయి. ముందుగా, గాజాలో శిథిలాల కింద మిగిలున్న మృతదేహాలను వెలికి తీసే పని ప్రారంభం అయ్యింది. మరో వంద రోజుల్లోగా మృతదేహాలన్నీ వెలికితీయాలని భావిస్తున్నట్లు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే, బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత కారణంగా మృతదేహాల వెలికితీత ఆలస్యమవుతుందేమో అనుకుంటున్నారు. జనవరి 19న ఆలస్యంగా అమలులోకి వచ్చిన కాల్పుల విరమణ తర్వాత, గాజాలో నుండి వచ్చిన ఫొటోలు, వీడియోల్లో 15 నెలల విధ్వంసం కళ్లకు కట్టాయి.
గాజాలోని 90 శాతం భవనాలు నాశనం
ముఖ్యంగా గాజాకు ఉత్తరాన జరిగిన విధ్వంసకాండ ఎంత తీవ్రంగా ఉందో ఈ చిత్రాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. గాజాలోని 90 శాతం భవనాలు నాశనమయ్యాయని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. యుద్ధం ముగిసిందనే ఓదార్పు తప్ప ఇప్పుడు గాజాలో మిగిలింది బూడిదే! కాల్పుల విరమణ ఒప్పందం మొదలు కాగానే బాంబుల మోతల స్థానంలో పాలస్తీనా జెండా రెపరెపలూ, ప్రజలు చప్పట్లు, కౌగిలింతలు, ఆనందబాష్పాలు కనిపించాయి. అయితే, గాజా అంతటా ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులు మాత్రం నిరాశలోనే కొట్టుమిట్టాడుతున్నాయి.
ఫుడ్ ఎయిడ్‌పైనే పూర్తిగా ఆధారపడిన గాజా జనం
యుద్ధం వల్ల గాజాకు చెందిన 20 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారని ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ పేర్కొంది. వీళ్లంతా ఆదాయం లేక, బతకడం కోసం సహాయంగా లభించే ఫుడ్ ఎయిడ్‌పైనే పూర్తిగా ఆధారపడిన జనం. కాల్పుల విరమణ మొదలైన వెంటనే గాజాలోకి సహాయ సామగ్రి రావడం మొదలైంది. జనవరి 19న గాజా స్ట్రిప్‌లోకి 630కి పైగా లారీలు సహాయక సామగ్రిని తీసుకొచ్చినట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. తర్వాత రోజు, మరో 915 లారీలు సహాయక సామగ్రితో ప్రవేశించాయి. యుద్ధం మొదలైన ఈ 15 నెలల కాలంలో ఇన్ని సహాయక వాహనాలు రావడం ఇదే అత్యధికం అని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
మరో రోజు 915 లారీలు సహాయక సామగ్రితో ప్రవేశం
అంటే, కీలకమైన యుద్ధ సమయంలో అక్కడి ప్రజలకు సరైన ఆహారం కూడా అందలేదు. గాజా స్ట్రిప్‌కు తిరిగి జీవం పోసే ప్రయత్నంలో ఈ సహాయక సామగ్రి రావడం తొలి అడుగు మాత్రమే. ఇంకా గాజాకు చేయాల్సింది ఎంతో ఉంది. ఇప్పుడు, కేవలం ఆహారం, ఆరోగ్య సంరక్షణ.. భవనాలు, రోడ్లు, మౌళిక వసతుల నిర్మాణం గురించి మాత్రమే కాదు.. అంతకుమించి, గాజాలోని ప్రజలను, కుటుంబాలను, కమ్యూనిటీలను తిరిగి నిలబెట్టాల్సిన అవసరం ఉంది. 15 నెలలుగా వాళ్లు అనుభవించిన వేదన, బాధ, నష్టాలు, క్షోభ, దు:ఖం, అవమానాలు, క్రూరత్వం నుంచి వారిని బయటకు తీసుకురావాలి. దీనికి ఎంత సమయం పడుతుందో కాలమే నిర్ణయించాలి.
తొలి విడతలో హమాస్ చెర నుండి 33 బంధీల విడుదల
ఒప్పందంలో భాగంగా.. తొలి విడత మార్పిడిలో హమాస్ చెర నుండి 33 బంధీలను ఇజ్రాయెల్‌కు అప్పగించారు. ఒకవేళ కాల్పుల విరమణ తొలి దశ కొనసాగితే, రాబోయే 40 రోజుల్లో ఇజ్రాయెల్ జైళ్లలో ఉన్న 1800 మంది పాలస్తీనియన్ ఖైదీల విడుదల.. దానికి బదులుగా, గాజా నుంచి మరో 30 మంది ఇజ్రాయెల్ బందీలు బయటకు వస్తారు. అయితే, 15 నెలలకు పైగా సాగిన యుద్ధంలో గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు, చిన్నారులే ఎక్కువ. ఐక్యరాజ్యసమితి కూడా ఇదే చెప్పింది. మరణాల సంఖ్యను ఆరోగ్య మంత్రిత్వ శాఖ 40% పైగా తక్కువగా అంచనా వేసి ఉండొచ్చని మెడికల్ జర్నల్ ‘ది లాన్సెట్’ ప్రచురించిన యూకే అధ్యయనం వెల్లడించింది.
బదులుగా, గాజా నుంచి మరో 30 మంది బందీల విడుదల
అంటే, 50 వేలు కాదు, మరో 20 వేల మంది మృతులు లెక్కల్లో కూడా కనిపించలేదు. ఇప్పుడు, రెస్క్యూ వర్కర్ల పని మరింత హృదయవిదారకంగా మారింది. దారుణ స్థితిలో ఉన్న మృతదేహాలు, మానవ కళేబరాల వెలికితీత వంటి భయంకరమైన పనులను ఏజెన్సీ వర్కర్లు చేస్తున్నారు. గాజా వీధులన్నీ మృతదేహాలే కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ తర్వాత కూడా.. ప్రతీ వీధిలోని భవనాల కింద ప్రజలు తమ వాళ్ల కోసం వెదుకుతూనే ఉన్నారు. తమవాళ్లు భవన శిథిలాల కింద చిక్కుకుపోయారంటూ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీకి ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి.
2023 అక్టోబర్ 7, ఉదయం 6.30 గంటలు..
ఇంత తీవ్రమైన నష్టానికి కారణమైన 15 నెలల క్రితం ఆ రోజును ఇప్పటీకీ ఇరు దేశాల ప్రజలూ మర్చిపోలేదు. 2023 అక్టోబర్ 7.. ఉదయం 6 గంటల 30 నిమిషాలు.. ఇజ్రాయెల్‌లు ‘సిమ్‌చాట్ తోరా’ పండుగను జరుపుకుంటున్న తరుణంలో.. హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంపై ఆకస్మిక దాడికి తెగబడ్డారు. నిమిషాల వ్యవధిలో వేల కొలదీ బాంబులను కురిపించారు. ఇజ్రాయెల్ భూమిలోకి ప్రవేశించి వీధుల్లో కనిపించిన వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
కోల్పోయిన తమ భూభాగాన్ని తిరిగి పొందే లక్ష్యంతో హమాస్ దాడి
ఇజ్రాయెల్ పౌరుల్ని, కుటుంబాలతో సహా బంధీలుగా చేశారు. ఇజ్రాయెల్‌లోని విదేశీయులనూ బంధించారు. ఈ దాడి కోల్పోయిన తమ భూభాగాన్ని తిరిగి పొందే లక్ష్యంతో జరిగింది. హమాస్ ఉగ్ర సైన్యం చేసిన ఈ ఆకస్మిక దాడి గురించి గాజా ప్రభుత్వానికి కూడా ఎలాంటి సమాచారం లేదు.
ఇజ్రాయెల్‌లో కనీసం 1200 మందికి పైగా మృతి
ఏదేమైనప్పటికీ, గాజాలో యుద్ధం మధ్యప్రాచ్యంలో భయానక వాతారణాన్ని సృష్టించింది. ఇది ఇజ్రాయెల్‌ను బలహీన పరచాలనే లక్ష్యంతో మొదలై, గాజాలో సామాన్యుల జీవితాలను బలి తీసుకుంది. ఇటు ఇజ్రాయెల్‌లో, అటు గాజా స్ట్రిప్‌లో సామూహిక ప్రాణనష్టానికి కారణం అయ్యింది. హమాస్ చేసిన క్రూరమైన అక్టోబర్ దాడిలో ఇజ్రాయెల్‌లో కనీసం 1200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 22 మంది అమెరికన్లు కూడా ఉన్నారు.
250 మందిని పైగా బంధీలుగా గాజాకు తీసుకెళ్లిన హమాస్
250 మందిని పైగా బంధీలుగా గాజాకు తీసుకెళ్లారు. అయితే, హమాస్ ఆకస్మిక దాడికి ప్రతిగా, ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో హమాస్ పాలనలో ఉన్న గాజా స్ట్రిప్‌ను కోలుకోలేని దెబ్బ తీసింది. బాంబులతో జల్లెడలా మార్చింది. మిగిలింది శిథిలాలు.. గుండెలవిసేలా రోధిస్తున్న ప్రజలు!
ఒప్పందంలోని మొదటి దశ జనవరి 19 నుంచి అమలు
పాలస్తీనాకి చెందిన సాయుధ, రాజకీయ గ్రూపు హమాస్‌కు, ఇజ్రాయెల్‌కు మధ్య 15 నెలల యుద్ధం తర్వాత ఈ ఒప్పందం జరిగింది. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు చెందిన ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్-హమాస్ అంగీకరించినట్లు అమెరికా, మధ్యవర్తిత్వం వహించిన ఖతార్‌లు ముందుగా తెలిపాయి. ఈ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్, ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపడంతో ఒప్పందంలోని మొదటి దశ జనవరి 19 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే, దాదాపు ఆరు వారాల సమయం ఉన్న తొలి దశ కాల్పుల విరమణ పూర్తి అవ్వకముందే ఈ ఒప్పందం ఎక్కడ కుప్పకూలుతుందో అని రెండు వైపుల నుండీ తీవ్రమైన ఆందోళనలు ఉన్నాయి.
సైనిక చర్య తిరిగి ప్రారంభించే హక్కు తమకుందన్న ఇజ్రాయెల్
గాజాలో ఏ సమయంలోనైనా సైనిక చర్యను తిరిగి ప్రారంభించే హక్కు తమకు ఉందని ఇప్పటికే ఇజ్రాయెల్ స్పష్టంగా చెప్పింది. అయితే, జనవరి 20న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరస్ మాట్లాడుతూ, ఈ ఒప్పందం ఒక ఆశాకిరణం అంటూ స్వాగతించారు. ఒప్పందంలోని విధివిధానాలను తప్పక పాటించాలని అన్నారు. ఇక, అంతర్జాతీయంగా.. ఈ ఒప్పందంతో యుద్ధం శాశ్వతంగా ఆగిపోవాలని అనుకుంటున్నారు.
గాజాలోని 23 లక్షల జనాభాలో 20 లక్షల మంది నిరాశ్రయులు
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన ఆకస్మిక దాడి తర్వాత.. అక్టోబర్ 27న హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై ఇజాయేల్ సైనిక చర్యలు ప్రారంభించింది. భూతల దాడులను ముమ్మరం చేసింది. ఇజ్రాయెల్ భారీస్థాయిలో జరిపిన సైనిక దాడులతో, గాజా ధ్వంసం కావడంతో పాటు గాజాలో ఉన్న 23 లక్షల జనాభాలో 20 లక్షల మంది నిరాశ్రయులు కాగా.. 50 వేల మంది మృతి, రెండు లక్షల మందికి గాయాలు.. మరో 20 వేల మంది శిథిలాల కింద చనిపోయి ఉంటారనే అంచనా ఉంది.
240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్
అయితే, ఇంత నష్టం వాటిల్లకు ముందే.. అంటే, 2023 నవంబర్‌లోనే ఇలాంటి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. నవంబర్ 21న, అమెరికా, ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ – హమాస్ మధ్య వారం రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా, 105 మంది బందీలను హమాస్ విడుదల చేయగా, ఇజ్రాయెల్ 240 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందం విఫలం కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒప్పందం ప్రకారం నడుచుకోలేదని ఇజ్రాయెల్, హమాస్, ఒకరినొకరు నిందించుకున్నాయి.
ఇజ్రాయెల్ చేసిన మూడు దశల కాల్పుల విరమణ
ఇక, అదే ఏడాది డిసెంబర్‌లో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించి మరో ఒప్పందం కోసం నిరంతర దౌత్య ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 2024, మే నెలలో బందీల విడుదలకు సంబంధించి, ఇజ్రాయెల్ చేసిన మూడు దశల కాల్పుల విరమణ ప్రతిపాదనలను నాడు అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ ప్రకటించారు. అయితే, ఎనిమిది నెలల తర్వాత రెండు పార్టీల అంగీకారం కుదిరిన ఈ ఒప్పందానికి ఇదే ఆధారమని చెప్పాలి.
ముగిస్తూ లెబనాన్‌తో ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం
అయితే, మధ్యలో హమాస్ కీలక నేతలను ఇజ్రాయెల్ చంపుతూ పోవడంతో.. ఇరాన్‌తో పాటు లెబనాన్, సిరియాల్లోని ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుల ఇన్వాల్వ్‌మెంట్‌తో యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఇక, గతేడాది నవంబర్‌లో, హమాస్‌కు మద్దతు ఉన్న సాయుధ గ్రూపుల్లో ఒకటైన హిజ్బొల్లాతో 13 నెలలుగా కొనసాగుతున్న ఘర్షణలకు ముగింపు పలికేందుకు లెబనాన్‌తో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ డీల్ గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంపై మరోసారి ఆశలు పెంచింది. మిడిల్ ఈస్ట్‌లోని ఇతర దేశాల సాయంతో మరోసారి ప్రయత్నిస్తానని బైడెన్ చెప్పడంతో మళ్లీ ఆశలు రేకెత్తాయి.
2025 జనవరి 13న, బైడెన్, నెతన్యాహు ఫోన్ సంభాషణ
అయితే, అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ పదవీ కాలం చివరి వారంలో ఉండగా, 2025 జనవరి 13న, బైడెన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని, ట్రంప్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే ఒప్పందం కుదురుతుందని చెప్పారు.
జనవరి 19 నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రకటన
కాగా, జనవరి 15న, గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందంపై ఇజ్రాయెల్ – హమాస్ మధ్య అంగీకారం కుదిరింది. జనవరి 19 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని ఖతార్ ఖరారు చేసింది. ఈ ఒప్పందంతో గాజాలో కొనసాగుతున్న యుద్ధం ఆగడంతో పాటు.. పాలస్తీనా పౌరులకు అవసరమైన మానవతా సాయం కూడా అందుతుందని బైడెన్ వెల్లడించారు.
ఆరు వారాల పాటు ఉండే తొలి దశ ఒప్పందం
అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నారు. ఆరు వారాల పాటు ఉండే తొలి దశ ఒప్పందంలో పూర్తిగా కాల్పుల విరమణ ఉంటుంది. అలాగే, బందీలు, ఖైదీల బదలాయింపుతో పాటు, గాజా నుండి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ… నిరాశ్రయులైన పాలస్తీనా ప్రజలు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లడానికి అవకాశం ఉంది. అయితే, తర్వాత.. విరమణ మొదలైన 16వ రోజున ఒప్పందంలోని రెండో దశ, మూడో దశకు సంబంధించిన చర్చలు మొదలవుతాయి. ఇలా చర్చలు జరిగినంత కాలం కాల్పుల విరమణ కొనసాగుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
కీలకమైన గాజా పునర్నిర్మాణానికి సంబంధించిన పనులు
ఇక, రెండో దశ ఒప్పందంలో యుద్ధానికి శాస్వత ముగింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దశలో, ఇజ్రాయెల్ విడుదల చేసే వెయ్యి మంది పాలస్తీనా ఖైదీల చివరి దశకు బదులుగా హమాస్ దగ్గర బందీగా ఉన్న పురుషులతో సహా మిగతావారు విడుదల అవుతారు. ఈ దశలో గాజా నుంచి బలగాలను ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించుకుంటుంది. ఇక, చివరి మూడో దశలో.. బందీల మృతదేహాలు ఉంటే వాటిని కూడా అప్పగిస్తారు. అలాగే, కీలకమైన గాజా పునర్నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలౌతాయి. అయితే, గాజాను తిరిగి నిలబెట్టడానికి దాదాపు 21 సంవత్సరాలు పట్టొచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా కాల్పుల విరమణ అంత స్ట్రాంగ్ కాదనే అభిప్రాయాలు
ఏది ఎమైనప్పటికీ, ఒప్పదం కుదిరింది. కానీ, ఈ యుద్ధం శాంతిని కోరుతూ ముగిసిందా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇజ్రాయెల్ ప్రధాన యుద్ధ లక్ష్యాల్లో భాగంగా.. హమాస్ సైన్యాన్ని, దాని అధికార యంత్రాంగాన్ని నాశనం చేసింది. అయితే, తిరిగి కోలుకునే సామర్థ్యం ఇంకా హమాస్ లేదని చెప్పలేము. ఇకపోతే, హమాస్ దగ్గర బందీలంతా సజీవంగా ఉన్నారా.. చనిపోయారా? అనే విషయంలో తెలియలేదు. ఆచూకీ లేని వారి వివరాలపై కూడా స్పష్టత లేదు.
అలాగే, కొంతమంది ఖైదీల విడుదల అంశంలో హమాస్ డిమాండ్‌కు ఇజ్రాయెల్ ఒప్పుకోలేదు. వీరిలో అక్టోబర్ 7 దాడుల్లో పాల్గొన్నవారు కూడా ఉన్నారు. ఇక, సరిహద్దులో బఫర్ జోన్ నుంచి వైదొలగడానికి ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా? లేదా అనేది అస్పష్టంగానే ఉంది. ఏది ఏమైనా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరిగిన ఈ కాల్పుల విరమణ అంత స్ట్రాంగ్ కాదని మాత్రం అర్థం అవుతోంది. గతంలో కూడా, యుద్ధాల సమయంలో జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాలు.. తర్వాత వచ్చిన వాగ్వాదాల కారణంగా ఉల్లంఘనకు గురై, ఒప్పందాలు వీగిపోయాయి. మరి ఈసారి ఏమౌతుందో అనే ఆందోళన మాత్రం అలాగే ఉంది.