Manipur Drone Attacks: మణిపూర్‌లో మళ్లీ మంటలు మొదలయ్యాయి. కుకీ, మెయితీల మధ్య దాడులు మొదలయ్యాయి. అయితే ఇదీ కాదు ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం. దాడుల కంటే.. దాడులు జరుగుతున్న విధానం ఇప్పుడు కొత్త భయాలను తెరపైకి తెస్తోంది. కుకీలు ఏకంగా డ్రోన్స్ ద్వారా బాంబులను జార విడుస్తున్నారు. దీంతో మణిపూర్ పోలీసులకు వెన్నులో వణుకు ప్రారంభమైంది. ఇంతకీ మణిపూర్‌లో అసలేం జరుగుతోంది? మిలిటెంట్లకు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఎలా వచ్చి చేరింది?
మణిపూర్ అంటే.. మెయితీ, కుకీలు, దాడులు. ఇదే ఇప్పుడు మణిపూర్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఆరు నెలలుగా అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో.. ఆల్ ఆఫ్ సడెన్ దాడులకు తెగబడ్డారు కుకీలు. మెయితీ గ్రామాలను టార్గెట్ చేస్తూ ఈ దాడులు జరిగాయి. ఇందులో పలువురు మరణించారు. పలువురు అని ఎందుకు చెప్తున్నాం అంటే.. డెత్ టోల్ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ఇద్దరు పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ఈ దాడులు కొత్త తరహాలో జరిగాయి. మెయితీ గ్రామాలపైకి డ్రోన్లు వచ్చాయి.. అక్కడి నుంచి బాంబులు జారవిడుస్తున్నాయి. ఆ గ్రామాల్లో పరిస్థితి అంతా గందరగోళంగా మారిన తర్వాత కుకీ మిలిటెంట్లు ఎంట్రీ ఇస్తూ కాల్పులు జరుపుతున్నారు. దీంతో మణిపూర్ ప్రభుత్వంతో పాటు కేంద్రం కూడా షాక్ అయ్యింది. ఇన్నాళ్లు కుకీలు సైలెంట్‌గా ఉన్నది శాంతి కోసం. ముందు ముందు దాడులకు పక్కా ప్లానింగ్ చేస్తున్నారని తేలిపోయింది. ఎందుకంటే దాడులకు డ్రోన్‌లను ఉపయోగించడం అనేది మాములు విషయం కాదు. అసలు ఈ డ్రోన్స్ వారికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? వాటిని వాడటంలో వారికి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు? అనేది ఇప్పుడు ఆందోళనకరంగా ఉంది.
ఇన్ని ఆందోళనలకు కారణం ఏంటంటే.. మయన్మార్‌లో వేర్పాటువాదులు ఏదైతే వ్యూహాలను అమలు చేస్తున్నారో ఇప్పుడు అవే సీన్స్ మణిపూర్‌లో రీపిట్ అవుతున్నాయి. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం ఈ డ్రోన్స్ అత్యాధునికంగా ఉన్నాయి. మాములుగా యుద్ధాల్లో మాత్రమే ఇలాంటి వ్యూహాలను అమలు చేస్తారు. మరి ఈ వ్యూహాలను ఎవరు రచిస్తున్నారు? ఇప్పటికే మణిపూర్ సర్కార్ ఈ దాడులను స్టడీ చేయడానికి ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అంతేగాకుండా మణిపూర్ పోలీసులు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హెల్ప్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని కూడా తెలుస్తోంది.
Also Read: మావోలకు ఎదురుదెబ్బ.. కాల్పులతో దద్దరిల్లిన బస్తర్, 9 మంది మృతి..
నిజానికి కుకీల వద్దకు ఇంతటి అత్యాధునిక ఆయుధాలు, డ్రోన్స్ వచ్చాయంటే.. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఫెయిల్ అయినట్టే. సరిహద్దు అవతల నుంచి కుకీలకు సాయం అందుతుందని తేలిపోయింది. దీనిని అరికట్టకపోతే మనం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇప్పటికే కుకీల, మెయితీలకు మధ్య బఫర్ జోన్లు పెట్టారు. భారీగా భద్రత బలగాలను మోహరించారు. కానీ ఫలితం సున్నా. ఆరు నెలల్లో శాంతిని నెలకొల్పుతామని ప్రగల్బాలు పలికిన వారంతా ఇప్పుడు ఈ దాడులకు ఏం సమాధానం చెబుతారో వినాలి.
ఈ దాడులు జరిగిన తీరు చూస్తుంటే.. ఇది మణిపూర్ సమస్యను దాటి దేశ సార్వభౌమత్వానికే ముప్పుగా మారుతుంది. 2023 నుంచి ఇరు వర్గాల మధ్య దాడులతో ఈశాన్య రాష్ట్రం అట్టుడుకుతోంది. ఎక్కడ ఏ వర్గం వారు ఎక్కువగా ఉంటే.. ఆ ప్రాంతం వారి అడ్డాగా మారుతుంది. ఇప్పటికే మణిపూర్ అనఫిషియల్‌గా అనేక జోన్లుగా మారిపోయింది. ఇది చాలదన్నట్టు మయన్మార్‌లో జరుగుతున్న అంతర్యుద్ధం మన నెత్తిపైనే ఉంది. దీంతో మణిపూర్‌ను యుద్ధభూమిగానే ఉంచుతుంది. ఇప్పటికే రాష్ట్రం కావొచ్చు.. కేంద్రం కావొచ్చు.. ఏ ఒక్క వర్గానికే కొమ్ము కాయకుండా సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి.
కానీ ఒక విషయం మాత్రం నిజం. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరక్కుండా కొందరు అడ్డుకుంటున్నారు. చర్చలు జరిగినా అవి ముందుకు కదలడం లేదు. లేటెస్ట్ దాడులకు ముందు కూడా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్ మాట్లాడినట్టుగా కొన్ని వీడియోలు బయటికి వచ్చాయి. అందులో కుకీలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడినట్టు ఉంది. వీటిని సాకుగా చూపిస్తూ దాడులు చేశారు. ఎవరో కావాలనే మంట పెట్టారు.. దానికి ఆజ్యం పోసినట్టు కుకీలు దాడులు చేశారు. ఇప్పుడు తెర వెనక తతంగం నడిపించిన వారు ఎవరో కానీ.. వారంతా ఆ మంటల్లో చలికాగుతున్నారు. ఇప్పుడు మణిపూర్ ప్రభుత్వం, కేంద్రం రెండు కూడా రెండు యుద్ధాలు చేయాలి. ఒకటి ఈ మోడ్రన్ వార్ ఫేర్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. ఎట్ ది సేమ్ టైమ్.. ఇరు వర్గాల మధ్య శాంతికి ప్రయత్నించాలి.