Big Stories

Vidadala Rajini Vs Galla Madhavi: రజినీకి రంగుపడుద్దా?

Who will win in Guntur West Constituency Vidadala Rajini VS Galla Madhavi ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది. గుంటూరు వెస్ట్ సెగ్మెంటట్లో మాత్రం గతం కంటే స్వల్పంగా పెరిగినప్పటికీ.. మిగిలిన నియోజవర్గాలతో పోలిస్తే పోలింగ్ శాతం గణనీయంగా తగ్గిపోయింది. దాంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పోలింగ్ పర్సంటేజీ తగ్గటం ఏ పార్టీకి కలిసి వస్తుందన్న చర్చ మొదలైంది. ఓటింగ్ శాతం పెరిగిందంటే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. మరి రాష్ట్రమంతా పోలింగ్ పర్సంటేజ్ ఒకలా ఉంటే.. గుంటూరు వెస్ట్‌లో మాత్రం ఎందుకు తగ్గింది? అక్కడ పోలింగ్ సరళి మంత్రి విడదల రజనీకి ప్లస్ అవుతుందా? లేకపోతే ఎప్పటిలా టీడీపీకే కలిసి వస్తుందా?

- Advertisement -

ఏపీలో వైసీపీ నుంచి మంత్రి విడదల రజనీ పోటీ చేస్తున్న గుంటూరు పశ్చిమ ఫలితం పైన వైసీపీతో పాటుగా కూటమి నేతల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. వైసీపీ అభ్యర్దుల మార్పులుచేర్పుల్లో భాగంగా ఫస్ట్ లిస్టులోనే గుంటూరు వెస్ట్ అభ్యర్ధిగా రజనీ పేరు జగన్ ఖరారు చేసారు. పొరుగునే ఉన్న చిలకలూరిపేట నుంచి తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు రజనీ అయితే ఈ సారి చిలకలూరుపేటలో ఆమె గెలిచే పరిస్థితులు లేవని సర్వేలు తేల్చడంతో జగన్ ఆమెను గూంటూరు వెస్ట్‌కి షిఫ్ట్ చేశారు.వైసీపీ గుంటూరు వెస్ట్‌లో ఇంత వరకు గెలవలేదు .. గత రెండు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు.

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009లో కాంగ్రెస్ నుంచి కన్నా లక్ష్మీనారాయణ 3,300 ఓట్ల మెజార్టీతో అక్కడ గెలిచి మరోసారి మంత్రిగా పనిచేశారు. విభజన తర్వాత తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి .. అప్పట్లో జనసేన మద్దతుతో దాదాపు 18 వేల ఆధిక్యతతో గెలుపొందారు. 2014లో అక్కడ 66 పోలింగ్ శాతం నమోదైంది. ఇక గత ఎన్నికల్లో పోలింగ్ శాతం స్వల్పంగా తగ్గి 65.84కే పరిమితమైనప్పటికీ.. టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దాలి గిరి 4,289 మెజార్టీతో విజయం సాధించారు. ఫ్యాన్ గాలి బలంగా వీచి, మరోవైపు జనసేన దాదాపు 28 వేల ఓట్లు చీల్చుకున్నప్పటికీ మద్దాలి గిరి గెలుపొందడం విశేషం.

Also Read: బాలయ్య హ్యాట్రిక్ కొడితే! ఎట్టా ఉంటాదో తెలుసా?

తాజా ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో 66.53 పోలింగ్ శాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 81.86 శాతం పోలింగ్ జరిగినప్పటికీ వెస్ట్‌లో మాత్రం ఎప్పటిలా 66 మార్క్ దగ్గరే ఆగిపోవడంతో ఎన్నికల ఫలితాలపై రకరకాల చర్చలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత మద్దాలి గిరి వైసీపీకి జై కొట్టినప్పటికీ ఆయనను పక్కన పెట్టేసిన జగన్.. రజనీకి టికెట్ కేటాయించారు .. బీసీ వర్గానికి చెందిన రజనీకి జగన్ అక్కడ సీటు కేటాయించటంతో.. టీడీపీ సైతం మహిళా అభ్యర్ధి గల్లా మాధవిని రంగంలోకి దించింది. అయితే, అప్పటికే రజనీ నియోజకవర్గంలో తన మార్క్ ప్రచారం మొదలుపెట్టారు. ఈ సారి నియోజకవర్గంలో గెలుపులో సామాజిక సమీకరణాలే కీలకంగా మారనున్నాయి. దీంతో, ఒక వైపు ప్రచారం కొనసాగిస్తూనే.. మరో వైపు అన్ని వర్గాల ముఖ్యులతో టీడీపీ, వైసీపీ అభ్యర్ధులు సమావేశాలు నిర్వహిస్తూ హడావుడి చేశారు.

రజనీకి ధీటుగా టీడీపీ అభ్యర్ధి మాధవి ప్రచారం చేయలేకపోయారన్న టాక్ నడిచింది. రాజకీయాలకు కొత్త అయిన మాధవి.. రజనీ తరహాలో దూకుడు ప్రదర్శించలేకపోయారు. అయితే గుంటూరు ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ప్రచారం మాధవికి కలిసి వస్తుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గతంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు స్థానికంగా సొంత కేడర్ ఉంది. వారంతా తమకే పనిచేశారని చెప్తున్నాయి టీడీపీ శ్రేణులు.

మరోవైపు రజనీ అనుచరులు సెంటిమెంట్ లెక్కలు వేసుకుంటున్నారు. గుంటూరు వెస్ట్ లో ఇంతవరకు ఏ పార్టీకి హ్యాట్రిక్ విజయాలు దక్కలేదని సెంటిమెంట్ పరంగా చూసినా కూడా ఈసారి విడదల రజినీకి కలిసొస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ రోజు ఉదయం నుంచి క్యూలు కట్టి మహిళలు వేసిన ఓట్లు తమ పార్టీకే పడ్డాయని వైసీపీ అంటుంటే.. మార్పు కోరుకునే ప్రజలు ఓటు వేశారని టిడిపి చెప్తుంది.

పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకు అయినా కమ్మ సామాజిక వర్గం ఓటర్లు టీడీపీ వైపు నిలిచిందని బీసీ ఓటు బ్యాంకు రెండు పార్టీలకు చీలిపోయిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కాపు సామాజిక వర్గం ఓట్లపై జనసేన ప్రభావం కనిపించిందంటున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలి వెళ్లిన వారు పలువురు ఈ సారి ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారంతా టీడీపీ వైపు మొగ్గు చూపారన్న టాక్ వినిపిస్తుంది.

గుంటూరు సిటీలో వ్యాపార, ఉద్యోగ వసరాల నిమిత్తం వలస వెళ్లిన వారు గణనీయంగా ఉంటారు. అలాంటి వారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్దగా రాకపోవడం వల్లే పోలింగ్ శాతం తగ్గిందంటున్నారు. అదలా ఉంటే బీసీలతో ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లతో గట్టెక్కేస్తామన్న ధీమా రజనీ వర్గీయుల్లో వ్యక్తమవుతుంది. సంక్షేమ పథకాల లబ్ది పొందిన మహిళలు కూడా తమ వైపే ఉన్నారని వైసీపీ నమ్మకంతో కనిపిస్తుంది.

Also Read: పెద్దిరెడ్డి పెత్తనమా? మా ప్రతాపమా

అయితే టీడీపీ ఎంపీ అభ్యర్ధి పెమ్మాసాని చంద్రశేఖర్ ప్రభంజనం సృష్టించబోతున్నారని  అదే మాధవికి అడ్వాంటేజ్ అవుతుందని .. దానికి తోడు నియోజకవర్గంలో కనిపించకుండా పోయిన అభివృద్ది, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తాయని టీడీపీ శ్రేణులు లెక్కలు వేసుకుంటున్నాయి. టీడీపీ మీద అభిమానంతో గత రెండు ఎన్నికల్లో మోదుగుల, మద్దాలి గిరిలను గెలిపించుకుంటే వారిద్దరు వైసీపీలో చేరడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని .. ఆ సెంటిమెంట్ కూడా తమకు ప్లస్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.

మొత్తమ్మీద నియోజకవర్గంలో ఓటింగ్ పర్సంటేజ్ పెద్దగా పెరగకపోవడంతో .. గెలుపుపై ఏ పార్టీలోనూ క్లియర్ కట్ కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. మరి గుంటూరు వెస్ట్‌ని జగన్‌కి గిఫ్ట్‌గా ఇస్తానంటున్న మంత్రి రజనీ లక్ ఏలా ఉండబోతుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News