BigTV English

AP Politics: రాజధాని ప్లేస్ మార్చాలి? జగన్ యూ టర్న్

AP Politics: రాజధాని ప్లేస్ మార్చాలి? జగన్ యూ టర్న్

AP Politics: ఏపీ మాజీ సీఎం జగన్ చాలాకాలం తర్వాత అమరావతి రాజధానిపై స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ స్కామ్ చేస్తుందని పాత ఆరోపణలే తిరిగి గుప్పించారు. అల్రెడీ గతంలో మొదలు పెట్టిన పనులు పూర్తి చేయడానికని, నిర్మాణ వ్యయం పెంచేస్తూ ఎడాపెడా అప్పులు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అమరావతిని ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాంతంలో కాకుండా బెజవాడ, గుంటూరుల మధ్య నిర్మించాలని సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఆయన నోటి వెంట మూడు రాజధానుల ప్రపోజల్ మాత్రం రావడం లేదు. ఇవన్నీ ఎలా ఉన్నా జగన్ రెడ్డి ఏపీ రాజధాని ప్రాంతంలో మళ్లీ బలపడే ఆలోచన చేస్తున్నారని తాజా ప్రెస్‌మీట్ ద్వారా వెల్లడైందని ఎనలిస్ట్‌లు అంటున్నారు. అసలు జగన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు వైసీపీకి ప్లస్ అవుతాయా? లేకపోతే బూమరాంగ్ అవుతాయా?


3 రాజధానుల ప్రతిపాదనతో బొక్కబోర్లా పడ్డ వైసీపీ

వైసీపీ అమరావతి ప్రాంతంలో పూర్తిగా బలహీన పడిందనేది 2024 ఎన్నికల్లో నిరూపితమైంది. ఏకంగా 151 ఒక సీట్లతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ, మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో బొక్కబోర్లా పడింది. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ వైజాగ్‌లో చేసిన హడావిడి వర్కౌట్ కాలేదు. వైజాగ్‌ సిటీలో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. అప్పట్లో వైసీపీలో కీలకంగా ఉన్న విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్లుగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి లాంటి నేతల మధ్య విభేదాలు, వారి అక్రమాలతో వైజాగ్‌లో పార్టీ ప్రతిష్ట పూర్తిగా దిగజారిందన్న అభిప్రాయం ఉంది. స్థానికంగా పెరిగిపోయిన భూకబ్జాలు.. వివాదాలు 2024 ఎన్నికల్లో వైజాగ్ ప్రాంతంలో వైసీపీని ఘోరంగా దెబ్బతీసాయి.


ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో గల్లంతైన వైసీపీ అడ్రస్

ఇక అమరావతిలో అయితే జగన్ రాజధానికి వ్యతిరేకమనే భావన బలంగా పాతుకు పోయింది. రాజధానిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని అమరావతి ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగారు. ఆ ఉద్యమం సుదీర్ఘంగా సాగినా అప్పటి వైసీపీ ప్రభుత్వం అణగదొక్కే ప్రయత్నాలు చేసి రైతుల్లో మరింత వ్యతిరేకత పెంచుకుంది. వాళ్ళని డీల్ చేసే విధానంలో జగన్ ప్రభుత్వం ప్రదర్శించిన దూకుడుతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతైందన్న విశ్లేషణలు ఉన్నాయి. రాజధానికి భూములు ఇచ్చిన అమరావతి ప్రజలు జగన్‌ని ఒక శత్రువుగా భావిస్తున్నారు. ఆ క్రమంలో ఆ ప్రాంత వైసిపి నేతల్లో భవిష్యత్తుపై భయం పట్టుకుందంట.

రాజధాని ప్రాంతంలో ఉనికి చాటుకోవడానికి వైసీపీ ప్రయత్నాలు

ప్రధానంగా అమరావతిలో రాజధాని అనగానే ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడాభూముల రేట్లు ఆకాశాన్నంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాజధాని అమరావతి నుంచి వెళ్ళిపోతుంది అనగానే అక్కడి వారంతా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. దాంతో గత పది నెలల కాలంగా రాజధాని ప్రాంతానికి చెందిన వైసిపి నేతలే కాకుండా మొత్తం పార్టీ నాయకులు కూడా అమరావతిపై సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఎన్నికల జరిగి ఏడాది అయిపోవడంతో నెమ్మదిగా మళ్లీ రాజధాని ప్రాంతంలో ఉనికి చాటుకోవడం కోసం వైసీపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి ప్రాంతంలోని తాడేపల్లిలో అధునాతన ప్యాలెస్ కట్టుకున్న జగన్.. మళ్లీ అమరావతి నిర్మాణ వ్యయాలు పెంచేశారని, అక్రమాలకు తెర లేపుతున్నారని బురద జల్లే ప్రయత్నాలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

నాగార్జున యూనివర్సిటీ భూముల్లో కట్టుకోవాలని సూచన

తాజా ప్రెస్ మీట్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రధానంగా చెప్పింది ఒకటే. రాజధాని పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా నాశనం చేస్తున్నారని. అలాగే అప్పులు ఊబిలో రాష్ట్రాన్ని ముంచేస్తున్నారని. ప్రస్తుతం చంద్రబాబు ఊహిస్తున్న రాజధాని కట్టడం ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సాధ్యం కాదని అందుకే రాజధానిని నాగార్జున యూనివర్సిటీ భూముల్లోనో లేక విజయవాడ గుంటూరు మధ్య ఒక 500 ఎకరాల్లోనో కట్టుకోవాలని సూచించారు. అంతేకానీ రాజధాని పేరుతో వేలకు వేల ఎకరాలు తీసుకుని రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం కరెక్ట్ కాదని విమర్శలు గుప్పించారు.

గత అయిదేళ్లు నిర్మాణాలను పాడుపెట్టిన వైసీపీ ప్రభుత్వం

ఇక అమరావతిలో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఐకానిక్ టవర్స్‌పై మాజీ సీఎం జగన్ విమర్శలు గుప్పించారు. అమరావతిలో కొలువుదీరే ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి సీఆర్‌డీఏ ఇప్పటికే టెండర్లు పిలిచింది. సమీకృత రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల ఆఫీసులు ఇందులో ఉంటాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాదిరే ఈసారి కూడా మూడు ప్యాకేజీల కింద విభజించారు. రూ. 46 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. ఐకానిక్‌ టవర్ల నిర్మాణానికి గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.2,703 కోట్లతో టెండర్లను పిలిచారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరి కారణంగా ఇప్పుడు అంచనా వ్యయం 73 శాతం పెరిగింటున్నారు. అయితే ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన ఐకానిక్ టవర్స్ నిర్మాణ వ్యయం పెరగడంపై జగన్ విమర్శలు గుప్పిస్తున్నారు. గత అయిదేళ్లు వాటిని పాడుపెట్టిన విషయాన్ని మర్చిపోయినట్లు జగన్ చేస్తున్న విశ్లేషణలతో అక్కడి వైసీపీ శ్రేణుల్లో గుబులు మరింత పెరిగిపోతోందంట.

ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్న చోట ల్యాండ్ రేటు ఖరీదు చెప్తున్న జగన్

అమరావతి రాజధాని ప్రాంతం ముంపు ప్రాంతమని, ఐకానిక్ టవర్స్ దగ్గరకు మళ్లీ నీళ్లు వచ్చాయని అప్పట్లో వైసీపీ నేతలు ప్రచారం చేశారు . ఇప్పుడు నిర్మాణాలు తిరిగి ప్రారంభమవుతున్న తరుణంలో మాజీ సీఎం ఐకానిక్ టవర్స్ నిర్మిస్తున్న చోట ల్యాండ్ రేటు ఎంత ఖరీదైందో చెప్తున్నారు. అక్కడ పెడుతున్న ఖర్చుతో హైదరాబాద్, బెంగళూరుల్లో 5 స్టార్ వసతులతో అద్భుతమైన భవంతులు కట్టుకోవచ్చని లెక్కలు చెప్పడం మొదలు పెట్టారు. అమరావతి రాజధాని పున:నిర్మాణ పనులను ప్రధాని మోడీప్రారంభించడం.. మూడేళ్ళలో అమరావతి రాజధాని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన తర్వాత కూడా వైసీపీ నేతలు తీరు చూస్తే వారి విధానం మారలేదని స్పష్టమవుతోంది.

500 ఎకరాల్లో నిర్మించే అవకాశం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు?

అప్పులు తెచ్చి అమరావతి కోసం పెడితే మిగిలిన ప్రాంతాల సంగతేంటని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అమరావతికి కృష్ణా నది ముంపు ప్రమాదం పొంచి ఉందని తిరిగి ప్రచారం మొదలుపెట్టారు.. అమరావతి పేరిట నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ఈ నెలలోనే అంబటి రాంబాబు వంటి నేతలు కూడా ఆరోపణలు గుప్పించారు. తాజాగా జగన్ ప్రెస్‌మీట్‌తో ఆయన అమరావతికి ఎంత వ్యతిరేకో స్పష్టమవుతుందంటున్నారు. అలాగే క్లియర్‌గా జగన్ మిస్ అయిన ఒక పాయింట్‌ని లేవనెత్తుతున్నారు. అంత సులభంగా ఏపీ రాజధానిని యూనివర్సిటీ భూముల్లోనో.. లేక విజయవాడ గుంటూరు మధ్య 500 ఎకరాల భూముల్లో నిర్మించే అవకాశం ఉన్నప్పుడు తమ ప్రభుత్వ హయాంలో జగన్ మూడు రాజధానుల ప్రహసనానికి ఎందుకు తెర లేపారని ప్రశ్నలు కురిపిస్తున్నారు. ఆయన ఇప్పుడు చేస్తున్న సూచనలు అప్పుడే అమలు చేసి ఉంటే పార్టీ ఇంత దారుణంగా ఓడిపోయే పరిస్థితి వచ్చేది కాదని, అమరావతి ప్రాంత ప్రజలు ఆ పార్టీపై అంత వ్యతిరేకత పెంచుకునే వారు కాదని విశ్లేషకులు అంటున్నారు.

Also Read: అష్టదిగ్భంధనంలో పెద్దిరెడ్డి.. వైసీపీ నేతలు హ్యాపీ

ఇంకోవైపు చూస్తే ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్‌గా మారింది. అమరావతి విషయంలో ఎవరేమి చెప్పినా జనాలు పట్టించుకునే మూడ్‌లో లేరని స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వైసీపీ నేతలు చేస్తున్న దుష్ట్రచారంతో ఆ పార్టీకి రాజకీయంగా నష్టమే తప్ప మరేమీ ఉండదని అంటున్నారు. వైసీపీ ఎటూ బాహటంగా అమరావతికి మద్దతు ఇవ్వలేదు కాబట్టి సైలెంట్‌గా ఉన్నా బెటర్ అని ప్రజలు విసుక్కుంటున్నారంట. చూడాలి మరి అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ ఇప్పటికైనా మారుతుందో? లేదో?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×