Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభమయిన మొదటిరోజు నుండే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు మొదలయ్యాయి. అవి కూడా మామూలు గొడవలు కాదు. కొందరు ఈ గొడవలను చాకచక్యంగా ఎదుర్కుంటుంటే.. మరికొందరు మాత్రం ఎమోషనల్ అయ్యి వాటి నుండి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా నాగ మణికంఠ పేరు ఎమోషనల్ స్టార్‌గా వైరల్ అయిపోతోంది. ఇక తాజాగా ప్రసారమయిన బిగ్ బాస్ ఎపిసోడ్‌లో నాగ మణికంఠ కారణంగా నిఖిల్ ఎమోషనల్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు అలా ఎందుకు జరిగింది అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంతా ఇప్పుడు మూడు టీమ్స్‌గా విడిపోయారు.
చీఫ్స్.. టీమ్స్..
నిఖిల్, యష్మీ, నైనికా.. బిగ్ బాస్ 8లో ముగ్గురు చీఫ్‌లుగా ఎంపికయ్యారు. ఇప్పుడు ఈ చీఫ్‌లకు వారికి నచ్చిన కంటెస్టెంట్స్‌తో కలిసి టీమ్స్‌ను ఏర్పాటు చేసే అవకాశమిచ్చాడు బిగ్ బాస్. ఒకవేళ ఇద్దరు చీఫ్‌లు ఒకే కంటెస్టెంట్‌ను తమ టీమ్‌లో ఆహ్వానించాలనుకుంటే అప్పుడు ఏ టీమ్‌లోకి వెళ్లాలనే నిర్ణయం కంటెస్టెంట్ చేతిలోనే ఉంటుందని బిగ్ బాస్ వివరించారు. అలా టీమ్స్ విభజన మొదలయ్యింది. ముందుగా ముందుకొచ్చిన ప్రేరణ కోసం యష్మీ, నిఖిల్ పోటీపడగా.. ప్రేరణ మాత్రం తన ఫ్రెండ్ యష్మీ టీమ్‌కే వెళ్లిపోయింది. సీత, ఆదిత్య ఓం లాంటి కంటెస్టెంట్స్‌ను ఏ పోటీ లేకుండా తన టీమ్‌లోకి లాగేసుకుంది నైనికా.
Also Read: బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్.. ముందుగా ఎలిమినేట్ అయ్యేది వాళ్లే!
విష్ణుప్రియా వద్దు
ప్రేరణతో పాటు అభయ్, పృథ్విరాజ్, శేఖర్ భాషా కూడా యష్మీ టీమ్‌లోకి వెళ్లిపోయారు. నాగ మణికంఠను నిఖిల్.. తన టీమ్‌లోకి సెలక్ట్ చేసుకోవడం తోటి కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచింది. అలా నాగ మణికంఠతో పాటు సోనియా, బేబక్క కూడా నిఖిల్ టీమ్‌లోకే వెళ్లారు. నబీల్.. తాను నైనికా టీమ్‌లోకి వెళ్తున్నట్టుగా ప్రకటించాడు. చివరికి విష్ణుప్రియా వచ్చి నిలబడినప్పుడు నిఖిల్, నైనికా, యష్మీలో ఒక్కరు కూడా తనను టీమ్‌లోకి తీసుకోవడానికి సిద్ధమపడలేదు. ఎవరూ లేవడం లేదని ఫీల్ అయిన నైనికా.. తానే లేచి విష్ణుప్రియాను తన టీమ్‌లోకి ఆహ్వానించింది. అయినా విష్ణుప్రియా ఫీల్ అయ్యింది. తన టీమ్‌తో కలిసి నిఖిల్ గురించి నెగిటివ్‌గా మాట్లాడడమే కాకుండా ఇదే విషయాన్ని నిఖిల్‌తో చర్చించాలని కూడా అనుకుంది.
అలా ఎలా అంటారు?
నిఖిల్ దగ్గరకు వెళ్లి తాను చాలా కనెక్ట్ అయ్యానని, అయినా కూడా తన టీమ్‌లోకి తీసుకోవడం బాధగా ఉందంటూ మనసులోని మాటలను బయటపెట్టింది విష్ణుప్రియా. తాను రాజులాగా ఫీల్ అవుతున్నాడు కాబట్టే కొందరికి నచ్చడం లేదని నిఖిల్‌పై ఇతర హౌజ్‌మేట్స్‌కు ఉన్న అభిప్రాయాన్ని తన దగ్గర రివీల్ చేసింది. అంతే కాకుండా నిఖిల్ అసలు ఎమోషనల్ కాదని స్టేట్‌మెంట్ ఇచ్చింది. నాగ మణికంఠను తన టీమ్‌లోకి ఆహ్వానించకపోయింటే అసలు ఎవరూ తనను పట్టించుకునేవారు కాదని, అలా తోటి కంటెస్టెంట్ గురించి ఆలోచించిన తనను ఎమోషనల్ కాదని ఎలా అంటావని విష్ణుప్రియాను నిలదిస్తూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు నిఖిల్. దీంతో అభయ్, పృథ్విరాజ్ వచ్చి తనను ఓదార్చారు.