Shilpa Shirodkar: తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 పూర్తయ్యి చాలాకాలం అయ్యింది. చాలామంది ప్రేక్షకులు దీనిని మర్చిపోయారు కూడా. కానీ బిగ్ బాస్ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేయడం కోసం హిందీ, తమిళంలో ఈ రియాలిటీ షో ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా హిందీ బిగ్ బాస్‌లో ప్రేక్షకులకు కావాల్సినంత కంటెంట్ దొరుకుతుంది. ప్రస్తుతం హిందీలో బిగ్ బాస్ 18వ సీజన్ కొనసాగుతోంది. అందులోకి కంటెస్టెంట్‌గా నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) సోదరి శిల్పా శిరోద్కర్ ఎంటర్ అవ్వడం ఒక్కసారిగా అందరికీ షాకిచ్చింది. మహేశ్ బాబు, నమ్రత ఫ్యామిలీ నుండి వచ్చిన శిల్పా.. చాలాకాలం పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటుందని ప్రేక్షకులు అనుకున్నారు కానీ అలా జరగలేదు.
మధ్యలోనే ఎలిమినేట్
బిగ్ బాస్ 18 (Bigg Boss 18)లో తాజాగా జరిగిన మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో శిల్పా శిరోద్కర్ ఎలిమినేట్ అయిపోయి బయటికి వచ్చేసింది. దీంతో తన ఫ్యాన్స్ అంతా డిసప్పాయింట్ అయ్యారు. ఇన్నాళ్లు కష్టపడి దాదాపు ఫైనల్ వరకు వచ్చిన శిల్పా.. ఫైనల్స్‌లో కూడా తన సత్తా చాటుకొని విన్నర్ అవుతుందని అనుకున్నారు. కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో తను బయటికి వచ్చేయడం చాలామందికి నచ్చలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో బిజీ అయిపోయింది శిల్పా. అలా తను పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో మిడ్ వీక్ ఎలిమినేషన్‌పై నమ్రత రియాక్షన్‌ను బయటపెట్టింది.
ట్రోఫీతో రావాల్సింది
‘‘బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత నేను నమ్రతతో ఫోన్‌లో మాట్లాడాను. ఫినాలేకు ఇంత దగ్గర్లో ఉన్నప్పుడు నువ్వు బయటికి రావడమేంటి? నువ్వు ట్రోఫీతోనే బయటికి వచ్చుండాల్సింది. కానీ నేను ఎలిమినేట్ అయిపోయానని, పర్వాలేదని తనతో చెప్పాను. వివియాన్‌ను సారీ చెప్పకుండా ఉండాల్సిందని తను నాతో చెప్పింది. నేను తనను జనవరి 22న కలుస్తానని, కలిసినప్పుడు మాట్లాడతానని, అప్పటివరకు చిల్ అవ్వమని చెప్పాను. మహేశ్ బాబు పనిలో ఉండడంతో నేను తనతో మాట్లాడలేకపోయాను. నా ఇంటర్వ్యూలు అన్నీ పూర్తయిన తర్వాత తనకు ఫోన్ చేస్తాను’’ అని తెలిపింది శిల్పా శిరోద్కర్ (Shilpa Shirodkar).
Also Read: ఏకంగా 14 ఎకరాలు అమ్మేశా.. కష్టాలు చెప్పుకొని ఎమోషనల్ అయిన శివాజీ..!
తిరిగొచ్చాక నిద్రపట్టలేదు
బిగ్ బాస్ ఎక్స్‌పీరియన్స్ గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ జర్నీ చాలా అందంగా, అద్భుతంగా సాగింది. ఈ ఫీలింగ్‌ను వివరించడానికి మాటలు రావడం లేదు. హౌస్ నుండి వెళ్లిపోయిన తర్వాత దీనిని చాలా మిస్ అవుతామని మాజీ కంటెస్టెంట్స్ చెప్పడం విన్నాను కానీ ఇప్పుడు అదే ఫీలింగ్ నాకు కూడా ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత నాకు నిద్రపట్టలేదు. అందుకే బిగ్ బాస్ లైవ్ చూడడం మొదలుపెట్టాను. అలా రాత్రంతా బిగ్ బాస్ చూస్తూ ఉదయం 6 గంటలకు నిద్రపోయాను. ఈ షో నాపై అంత ప్రభావం చూపించింది’’ అని బిగ్ బాస్‌ను మిస్ అవుతున్నట్టు తెలిపింది శిల్పా శిరోద్కర్.