Hbd Vijay Sethupathi : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అభిమానుల నుంచి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అయితే చూడడానికి సైలెంట్ గా కనిపించే విజయ్ సేతుపతి ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. నిజానికి సెలబ్రిటీల జీవితాల్లో వివాదాలు అనేవి కామన్. మరి విజయ్ సేతుపతి వివాదాలు ఏంటో చూసేద్దాం పదండి.
ఎయిర్పోర్ట్ వివాదం…
విజయ్ సేతుపతి 2021లో బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో మహా గాంధీ అనే వ్యక్తితో గొడవ పడ్డ ఘటన సంచలనం సృష్టించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. విజయ్ సేతుపతి మనుషులు దాడి చేశారని, అభ్యంతరకర పదాలతో తనను విజయ్ దూషించారని ఆరోపిస్తూ ఆ వ్యక్తి సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో సుప్రీం కోర్టు విజయ్ సేతుపతిని హెచ్చరించింది.
800 వివాదం
శ్రీలంక మాజీ క్రికెటర్ దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’. ఈ సినిమాలో ముందుగా తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని ముత్తయ్య పాత్ర కోసం అనుకున్నారు. కానీ ఈ వార్త బయటకు వచ్చిన కొద్దిసేపటికి తమిళనాడులో వివాదం చెలరేగింది. శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహింద రాజపక్సన్ ను ముత్తయ్య సపోర్ట్ చేయడం వల్లే ఆయన బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. 30 ఏళ్ల పాటు శ్రీలంకలో జరిగిన తమిళ పులుల అంతర్యుద్ధాన్ని అంతమొందించడమే కాకుండా, కొన్ని లక్షల మంది తమిళలను ఊచకోత కోసిన మహేందర్ పై ఇప్పటికీ తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత ఉంది.
తన్నిన వారికి బహుమతి
విజయ్ సేతుపతి ఎయిర్పోర్ట్ వివాదం తర్వాత హిందూ మక్కల్ కట్చి అనే సంస్థ ఆయనపై వివాదాస్పద ప్రకటనను చేసింది. విజయ్ సేతుపతి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు తేవర్ ను అవమానించారని, అతన్ని తన్నిన వారికి బహుమతి ఇస్తామని సదరు సంస్థ చీఫ్ అర్జున్ సంపత్ బహుమతిని అనౌన్స్ చేశారు. ఒకసారి విజయం తంతే రూ, 1001 బహుమతిగా ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇక విజయ్ సేతుపతి క్షమాపణలు చెప్పే వరకు ఈ బహుమతి ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా ప్రపంచంలో ఏకైక దేవుడు జీసస్ మాత్రమే అని విజయ్ సేతుపతి చెప్పడం వల్లే మహా గాంధీ విజయ్ పై దాడి చేశాడని అర్జున్ సంపత్ పేర్కొన్నారు.
పుట్టినరోజు ఫోటో వివాదం
ఈ వివాదం కూడా 2021 లోనే చోటు చేసుకుంది. విజయ్ సేతుపతి పుట్టినరోజు సందర్భంగా ఆ ఏడాది జరిగిన పుట్టినరోజు వేడుకలు వివాదానికి దారి తీసాయి. విజయ్ సేతుపతి కేక్ కట్ చేసిన ఫోటో తీవ్రంగా ట్రోల్ అయింది. తన పుట్టినరోజు సందర్భంగా విజయ్ సేతుపతి ‘పొన్రం’ షూటింగ్ సెట్లో ఒక కత్తితో కేక్ కట్ చేశాడు. దీంతో గూండాల మాదిరిగా ఒక ఖడ్గంతో పుట్టినరోజు కేకు కట్ చేయడం ఏంటి? అంటూ మండిపడ్డారు. సినిమాలో ఆ ఖడ్గం కీలకపాత్రను పోషిస్తుంది కాబట్టే దానితో కేక్ కట్ చేశానని చెప్పి, క్షమాపణలు చెబుతూ హుందాగా ఆ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టారు విజయ్ సేతుపతి.
బిగ్ బాస్ 8 వివాదం
విజయ్ సేతుపతి ప్రస్తుతం బిగ్ బాస్ 8 తమిళ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ కంటెస్టెంట్ దర్శగుప్త తనను విజయ్ మాట్లాడనివ్వలేదంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. ఇక వీటితో పాటే విజయ్ సేతుపతి ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన చేసిన మంచి పనులు కూడా ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.