స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా BSNL సంస్థ చేసిన ప్రకటన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది, అదే సమయంలో కాస్త అయోమయంలోకి కూడా నెట్టింది. నెలరోజుల రీచార్జ్ కేవలం ఒక్క రూపాయి మాత్రమేనంటూ BSNL ప్రకటించడంతో వినియోగదారులు అలర్ట్ అయ్యారు. దాని గురించి ఎంక్వయిరీ మొదలు పెట్టారు. ఈ ఆఫర్ బాగానే ఉన్నా ఇందులో కండిషన్లు కూడా ఉన్నాయి. వాటికి కట్టుబడి ఉంటేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.
ఆజాదీకా ప్లాన్..
ఉచిత 4G సిమ్ కార్డ్‌తో కూడిన 30 రోజుల ప్యాక్
నెలరోజులు అన్ లిమిటెడ్ కాలింగ్
రోజుకు 100 SMSలు
రోజుకు 2GB 4G డేటా
ఇవీ క్లుప్తంగా ఆజాదీకా ప్లాన్ విశేషాలు. అయితే ఈ ప్లాన్ ఆగస్ట్ 1 నుంచి 31 వరకు మాత్రమే అమలులో ఉంటుంది. ఆలోగా సిమ్ కార్డ్ తీసుకున్నవారికి మాత్రమే ప్లాన్ అమలవుతుంది. ఇక ఇందులో మరో ముఖ్యమైన కండిషన్ ఇది కొత్త వినియోగదారులకు మాత్రమే. అంటే ఆల్రడీ BSNL కస్టమర్లుగా ఉన్నవారికి, అదే నెంబర్ పై ఈ ఆఫర్ వర్తించదు. కొత్తగా BSNL కనెక్షన్ తీసుకునేవారికి మాత్రమే ఆజాదీకా ప్లాన్ అమలవుతుంది.
సూపర్ సక్సెస్..
ఆజాదీకా ప్లాన్ విషయంలో BSNL సూపర్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పటి వరకు ఇలాంట్ ప్లాన్ ని ఏ కంపెనీ కూడా ఆఫర్ చేయలేదు. నెలరోజులపాటు అపరిమిత కాలింగ్, రోజూ 2GB 4G డేటా అంటే మాటలు కాదు. కానీ వాటన్నిటినీ కేవలం రూపాయికే ఆఫర్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. తరలిపోతున్న కస్టమర్లను ఒడిసి పట్టుకోడానికి BSNL ఈ ప్లాన్ చేసింది. ఈ ప్లాన్ అనౌన్స్ చేసిన వెంటనే చాలామంది ఆసక్తి చూపించడం విశేషం. దేశవ్యాప్తంగా ఈ ప్లాన్ సూపర్ సక్సెస్ అయిందని అంటున్నారు నెటిజన్లు. అయితే పాత కస్టమర్లకు కూడా దీన్ని వర్తింపజేయాలని కోరుతున్నారు.
వీటిపై క్లారిటీ లేదు..
BSNL డోర్ స్టెప్ సిమ్ డెలివరీ సర్వీస్ ద్వారా కూడా సిమ్ కార్డ్ లను ఆ సంస్థ ఇస్తోంది. అయితే ఇలా దరఖాస్తు చేసుకునే వినియోగదారులకు ఈ ఆఫర్ ఉందా, లేదా అనేది తేలాల్సి ఉంది. ఆన్‌లైన్‌లో సిమ్ ఆర్డర్ చేసి డెలివరీ తీసుకునే కస్టమర్లు ఆజాదీకా ప్లాన్ లోకి వస్తారా రారా అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికి BSNL స్టోర్ లేదా BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్ కి స్వయంగా వెళ్లి ఆజాదీకా ప్లాన్ లో సిమ్ తీసుకోవచ్చు.
కొత్తవారికి బెస్ట్ ఆప్షన్..
కొత్తగా 4G కనెక్షన్ తీసుకోవాలనుకునేవారికి మాత్రం BSNL ఆఫర్ అద్భుతంగా సరిపోతుందని అంటున్నారు నెటిజన్లు. డేటాతో అవసరం ఉన్నా లేకపోయినా ఈ కనెక్షన్ తీసుకుంటే నెలరోజులపాటు కేవలం ఒక్క రూపాయికి మాత్రమే అపరిమితమైన ఔట్ గోయింగ్ కాల్స్, ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్ లను అందుకోవచ్చు. అందుకే చాలామంది ఈ ప్లాన్ కి ఆకర్షితులవుతున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోటీ నెట్ వర్క్ లకు BSNL గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. మరి పోటీ కంపెనీలు ఎలాంటి ఆఫర్లతో వస్తాయో చూడాలి. ఇప్పటి వరకు ఎయిర్ టెల్, జియో.. టారిఫ్ లను పెంచడంలో పోటీ పడ్డాయి. ఇప్పుడు BSNL ఇచ్చిన షాక్ తో వారు ఎలాంటి ప్లాన్ లు అమలు చేస్తారో వేచి చూడాలి.