టీ కొట్టు దగ్గర 10 రూపాయల నుంచి షాపింగ్ మాల్ లో వేల రూపాయల బిల్లు వరకు దాదాపుగా అందరూ ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ తోనే పే చేస్తున్నారు. వీటికోసం ఎక్కువగా ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి థర్డ్ పార్టీ యాప్స్ ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఫోన్ పే ఈ డిజిటల్ పేమెంట్స్ యాప్స్ పై ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పుకోవాలి. ఇప్పుడిక ఫోన్ పే ఆధిపత్యానికి గండి పడే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. త్వరలో మార్కెట్ లోకి BSNL Pay రాబోతోంది. తన సొంత యూపీఐ సేవలను ప్రారంభించబోతున్నట్టు BSNL ఇప్పటికే ప్రకటించింది. డిజిటల్ చెల్లింపుల రంగంలో BSNL ఏమేరకు రాణిస్తుందో చూడాలి.
BHIM UPI ఆధారంగా
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ(BHIM) యూపీఐ ద్వారా BSNL Pay పనిచేస్తుంది. అయితే BSNL Pay కోసం కొత్తగా మనం యాప్ ని ఇన్ స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు సెల్ఫ్ కేర్ యాప్ ని ఆల్రడీ ఇన్ స్టాల్ చేసుకుని ఉంటారు. వారంతా ఈ యాప్ తోనే ఆన్ లైన్ లో నగదు బదిలీ చేసుకోవచ్చు. ఇతర నెట్ వర్క్ లను వాడే వారయితే ఈ యాప్ ని కొత్తగా ఇన్ స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఈ సేవలు అందుబాటులోకి రాకపోవచ్చు. దీపావళి నాటికి BSNL Pay వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అంత ఈజీనా..?
బీఎస్ఎన్ఎల్ టెలికాం రంగంలోనే కునారిల్లుతోంది. ప్రైవేట్ ఆపరేటర్ల ధాటిని తట్టుకోలేక కుదేలైంది. గ్రామీణ ప్రాంతాల్లో నెట్ వర్క్ కవరేజ్ పుణ్యమా అని ఆ మాత్రం కనెక్షన్లు అయినా ఉన్నాయి. ఇంటర్నెట్ విభాగంలో కూడా జియో, ఎయిర్ టెల్.. ఇతర లోకల్ నెట్ వర్క్ లతో బీఎస్ఎన్ఎల్ పోటీ పడలేకపోతోంది. ఈ దశలో BSNL Pay ఏమాత్రం సక్సెస్ అవుతుందో చూడాలి. ఇప్పటికే ఫోన్ పే, గూగుల్ పే ఈ రంగంలో పాతుకుపోయి ఉన్నాయి. ఆమధ్య వాట్సప్ కూడా పేమెంట్ మోడ్ లోకి వచ్చినా పెద్ద ప్రయోజనం లేదు. వాట్సప్ పే ని అతి కొద్దిమంది మాత్రమే ఉపయోగిస్తున్నారు. మరి బీఎస్ఎన్ఎల్ వాటికి భిన్నంగా ఎలాంటి ప్రయత్నం చేస్తుందో చూడాలి.
ప్రస్తుతం క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఆన్ లైన్ పేమెంట్స్ యాప్ లదే పైచేయి. అయితే ఈ రంగంలో ఎంతమంది పోటీకి వచ్చినా సులభంగా సేవలు అందించేవారిదే పైచేయి అవుతుంది. గతంలో గూగుల్ పే తన హవా చూపించినా, ఆ తర్వాత వచ్చిన ఫోన్ పే దాన్ని అధిగమించింది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన యాప్ లు మాత్రం పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ పే ఎలాంటి ఫలితాలను రాబడుతుందో చూడాలి. కస్టమర్లను ఆకట్టుకోగలిగితే బీఎస్ఎన్ఎల్ మార్కెట్ లో బలమైన శక్తిగా ఎదుగుతుంది. ప్రభుత్వ సహకారంతోపాటు, ఉద్యోగుల బలమైన కాంక్ష కూడా దీనికి అవసరం.