GST Slabs: సామాన్యులు, చిరు వ్యాపారులపై పన్ను భారాన్ని తగ్గించేందుకు దృష్ట సారించింది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 8 ఏళ్ల తర్వాత జీఎస్టీ విధానానికి కీలక సవరణలను శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమలులో నాలుగు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై రెండు శ్లాబ్‌లకు జీఎస్టీని పరిమితం చేయాలని భావిస్తోంది. దీనికి సంబంధించి తెర వెనుక పనులు చకచకా జరిగిపోతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఆలోచన చేస్తోంది మోదీ సర్కార్.
దేశంలో ప్రస్తుత విధానం నాలుగు రకాలుగా ఉంది. నిత్యావసర వస్తువులపై 5 శాతం పన్ను విధిస్తోంది. సాధారణ వస్తువులపై 12 శాతం ఉండగా ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువులపై 18 శాతం ఉంది. ఇంకా విలాస వస్తువులపై 28 శాతం జీఎస్టీ అమల్లో ఉంది. దీనివల్ల సామాన్యుడు బట్టలు, పుస్తకాలు, టూత్ పోస్టులు ఇలా ఏది కొనుగోలు చేయాలన్నా పన్ను పోటు బలంగా సామాన్యుడిని తాకింది.
అంతర్జాతీయ-జాతీయ పరిణామాలను గమనించిన మోదీ సర్కార్, దీపావళి నుంచి జీఎస్టీ విధానంలో మార్పులు తెస్తున్నట్లు శుక్రవారం ఎర్రకోట సాక్షిగా ప్రకటన చేశారు. సాయంత్రానికి ఆర్థిక శాఖ చకచకా అడుగులు వేస్తోంది. కొత్త జీఎస్టీ ప్రకారం ఇకపై రెండు శ్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఒకటి 5 శాతం, మరొకటి 18 శాతం పన్ను శ్లాబ్‌లు ఉండనున్నట్లు తెలుస్తోంది.
సమాజానికి హానికారకంగా గుర్తించిన ఏడు అంశాలపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించనున్నట్లు తెలుస్తోంది. అంతా వేగంగా జరిగితే దీపావళి నాటికి కొత్త జీఎస్టీ విధానం అమలులోకి రానుంది. జీఎస్టీలో సంస్కరణలపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన కమిటీకి కొత్త ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పంపించింది. ప్రస్తుత అమలులో ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్‌లను తొలగించాలన్నది కొత్త ప్రతిపాదన.
ALSO READ: లోన్ క్లియర్ అయ్యిందా? వెంటనే వాటిని తీసుకోండి, లేకుంటే భారీ నష్టం
దీనిపై కమిటీ చర్చించిన తర్వాత జీఎస్టీ మండలికి పంపుతుంది. సెప్టెంబరులో జీఎస్టీ మండలి సమావేశం కానుంది. అందులో చర్చించిన తర్వాత దీపావళి నుంచి కొత్త జీఎస్టీ విధానం అమలుకానుంది. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీ ప్రకటన, సాయంత్రానికి కేంద్రం ప్రతిపాదనలు చేయడం జరిగిపోయింది. సవరించిన విధానాన్ని జీఎస్టీ మండలి ఆమోదించాలి.
ప్రస్తుతం 12 శాతం శ్లాబ్‌లో 99 శాతం వస్తువులు 5 శాతం శ్లాబులోకి రానున్నాయి. 28 శాతం పన్ను శ్లాబులోవున్న 90 శాతం వస్తువులు 18 శాతానికి మారుతాయా? అన్నది పెద్ద ప్రశ్న. హానికారక వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధించే అవకాశం ఉన్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. పొగాకు సహా కేవలం 7 వస్తువులు వర్తించనుంది.
రెండు శ్లాబులు అమల్లోకి వస్తే వ్యవసాయ, వైద్య,బీమా రంగాలకు బిగ్ బూస్ట్ అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జౌళి, ఎరువులు, ఆటోమోటివ్, హస్త కళలు, వ్యవసాయం, వైద్యం, బీమా రంగాలకు ప్రయోజనం చేకూరనుంది. దానివల్ల ఆయా రంగాలు పుంజుకుంటాయని భావిస్తోంది ఆర్థిక శాఖ. కొత్త జీఎస్టీ శ్లాబుల వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది. ఆయా రంగాలు పుంజుకుంటే ఎకానమీ మళ్లీ అభివృద్ధి వైపు పుంజుకోవచ్చని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.