Gold Mining: ఏపీలోకి కర్నూల్ జిల్లాలో బంగారు గనులు ఉన్నట్టు అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల్లో బంగారం గనులు ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కర్నూలు జిల్లాలో జొన్నగిరి ప్రాంతం, అనంతపురం జిల్లాలో రామగిరి, చిత్తూరులో కొన్ని ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్టు గతంలో శాస్త్రవేత్తలు చాలా సార్లు చెప్పిన విషయం తెలిసిందే. జొన్నగిరి ప్రాంతంలో.. దేశంలోనే తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్రాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసిన విషయం తెలిసిందే.
అయితే.. జొన్నగిరి ప్రాంతంలో తాము అభివృద్ది చేస్తున్న గనిలో అతి త్వరలోనే పసిడి ఉత్పత్తి ప్రారంభిస్తామని దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ ఎంపీ హనుమ ప్రసాద్ తెలిపారు. పసిడి ఉత్పత్తిని ప్రారంభించడానికి పర్యావరణ అనుమతులు వచ్చాయని .. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాగానే ప్రొడక్షన్ పనులు ప్రారంభిస్తామని అన్నారు. ఇదే జరిగితే దేశంలో గనుల నుంచి బంగారాన్ని ఉత్పత్తి చేసే తొలి ప్రైవేట్ కంపెనీ దక్కగన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ చరిత్రలో నిలిచిపోనుంది. ఏటా ఇక్కడ నుంచి 750 నుంచి 1000 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయవచ్చని అంచనా.
1994లోనే కర్నూలు జిల్లాలోని జొన్నగిరి ప్రాంతంలో భారీగా గోల్డ్ నిల్వలు ఉన్నట్లుగా తొలిసారి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనల్లో తేలింది. ఇక్కడి దాదాపు 1500 ఎకరాల్లో పసిడి నిల్వలు ఉన్నట్లు అనేక నివేదికల్లో వెల్లడైంది. దీంతో.. ఈ సంపదను వెలికి తీసేందుకు.. ప్రైవేటు సంస్థలకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత 2005లో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజు ప్రక్రియను సరళీకరించింది. ఆ నిబంధనల మేరకు.. విదేశీ పెట్టుబడులతో పాటుగా ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు ఎదురుచూశాయి.
ALSO READ: Telangana Jobs: తెలంగాణలో 1623 ఉద్యోగాలు.. అక్షరాల రూ.1,37,050 జీతం.. ఇదే మంచి అవకాశం
చివరకు.. బెంగళూరుకు చెందిన దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అనే కంపెనీ ఈ ప్రాజెక్టును దక్కించుకున్న విషయం తెలిసిందే. 2013లోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్స్ ప్రారంభించేందుకు ప్రైమరీ లైసెన్స్‌ను పొందింది. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అనుమతులు అవసరం కాగా.. అందుకోసం దాదాపు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. అలా.. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొని చివరికి 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ ప్రారంభించింది.
ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 30 వేల బోర్ వెల్స్ వేసి.. ట్రయల్స్ నిర్వహించిన సంస్థ.. ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది ఎట్టిపరిస్థితుల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని టార్గెట్ గా పెట్టుకున్న సంస్థ.. జోన్నగిరిలో దాదాపు రూ.350 కోట్లు పెట్టుబడి పెట్టి వివిధ యంత్రాలను సైతం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సైతం తన తరఫున చేయాల్సిన పనుల్ని పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి రాగానే పనులు స్టార్ట్ కానున్నాయి.