British War Loan: మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటీష్ ప్రభుత్వానికి ఇచ్చిన అప్పు.. వంద ఏళ్ల తర్వాత మళ్లీ వెలుగులోకి వచ్చింది. 1917లో తమ తాతలు బ్రిటీష్ సామ్రాజ్యానికి ఇచ్చిన రూ.35,000 రుణాన్ని తిరిగి పొందేందుకు ఇప్పుడు మనవడు రంగంలోకి దిగాడు. ఇందుకోసం మధ్యప్రదేశ్ చెందిన ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం చేస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై బ్రిటన్ డెట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ (DMO) స్పందించడంతో.. ఈ వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ కు చెందిన 63 ఏళ్ల వివేక్ రూథియా కుటుంబం వద్ద 1917 జూన్ 4వ తేదీకి సంబందించిన మనీ బాండ్ పేపర్ ఉంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం.. తన తాత సేథ్ జుమ్మా లాల్ రూథియా.. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రూ. 35,000 మొత్తాన్ని ‘ఇండియన్ వార్ లోన్’ కింద బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చారు. దీనిపై అప్పటి భోపాల్ పొలిటికల్ ఏజెంట్ W.S డేవిస్ చేసిన సంతకం కూడా ఉంది.
అయితే తమ తాత ఇచ్చిన రూ.35 వేల రుణంపై పూర్తి వివరాలు అందించాలని వివేక్ రూథియా.. ఓ లాయర్ ద్వారా యుకే డెట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్‌ను సంప్రదించారు. దీనిపై తాజాగా స్పందించిన బ్రిటన్ అధికారులు.. బాండ్ ఒరిజినల్ సర్టిఫికెట్‌తో పాటు దానికి సంబంధించిన ఆధారాలను ఈ-మెయిల్ ద్వారా పంపాల్సిందిగా కోరారు. ఇన్నాళ్లకు బ్రిటన్ ప్రభుత్వ శాఖ నుంచి స్పందన రావడంపై మనవడు రూథియా సంతోషం వ్యక్తం చేశారు. తమ వద్ద ఉన్న పత్రాలను, ఇతర సమాచారాన్ని బ్రిటీష్ అధికారులకు సమర్పించేందుకు ప్రస్తుతం ఆయన సిద్ధమవుతున్నారు.
అయితే తమ తాత తీసుకున్న రూ.35 వేల రుణాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం తిరిగి చెల్లించిందా? లేదా? అన్న దానిపై స్పష్టత లేదని మనవడు చెబుతున్నారు. ఒకవేళ చెల్లించనట్లైతే అప్పటి రూ.35 వేల విలువ.. ప్రస్తుతం రూ.10 కోట్లకు పైగానే ఉంటుందని ఆ కుటుంబం అంచనా వేస్తోంది. అయితే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఆ మెుత్తాన్ని రాబట్టడం అంత సులభం కాకపోవచ్చు. నాడు ఈస్టిండియా లేదా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం తీసుకున్న అప్పుకు ఇప్పటి బ్రిటన్ ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై చట్టపరమైన చిక్కులను రూథియా ఎదుర్కొవాల్సి రావొచ్చు.
Also Read: టాటా సన్స్‌కు చంద్రశేఖరన్ రాజీనామా.. కుప్పకూలిన షేర్లు.. గుడ్ బైకి కారణం అదేనా?
అయితే ఈ పోరాటం కేవలం డబ్బు కోసం మాత్రమే చేయడం లేదని వివేక్ రూథియా స్పష్టం చేశారు. తమ కుటుంబంలో తరాల తరబడి భద్రంగా ఉన్న ఈ సర్టిఫికెట్ వెనుక ఉన్న అసలు నిజం బయటకు రావడమే తమకు ముఖ్యమని తెలిపారు. ఒకవేళ రుణం చెల్లించి ఉంటే ఎప్పుడు, ఎలా చెల్లించారో తెలుసుకోవాలని ఉందని తెలిపారు. ఒకవేళ చెల్లించకపోతే తదుపరి కార్యచరణ ఏంటన్న దానిపై తాము కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మెుదటి ప్రపంచ యుద్ధం నాటి 1.9 బిలియన్ పౌండ్ల విలువైన బాండ్లను 2015లోనే బ్రిటన్ ప్రభుత్వం క్లియర్ చేసింది. మరి ఇప్పుడు భారతీయ బాండ్ పరిస్థితి ఏంటన్నది తేలాల్సి ఉంది.