NIT Dropout Huge Salary| కాలేజీ డిగ్రీ లేకపోతే మంచి ఉద్యోగం దొరకదని చాలామంది భావిస్తారు. అయితే ఒక తెలుగు యువకుడి కెరీర్ ప్రయాణం ఈ ఆలోచనను మార్చేలా ఉంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపేసిన ఆయన నెలకు రూ.3,000 జీతంతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత తన నైపుణ్యాలను పెంచుకుంటూ ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూ ఏడాదికి రూ.58 లక్షల వరకు సంపాదించారు.
పవన్ చిందుకూరి కెరీర్ తొలుత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో చేరారు. ఇంటికి దూరంగా ఉండటం ఆయనకు ఇబ్బందిగా మారడంతో అక్కడ చదువును కొనసాగించలేకపోయారు. తర్వాతి ఏడాది ఆయన NITలో చేరారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు మరింత కష్టంగా మారడంతో అక్కడ కూడా చదువు ఆపేయాల్సి వచ్చింది.
కోవిడ్ సమయంలో పవన్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. ఆయన తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవారు. తల్లి కూడా బంగారం అమ్మి, అప్పులు చేసి ఆయన చదువుకు సహాయం చేశారు.
కాలేజీ వదిలిన తర్వాత పవన్ మొదట ఉబర్ డ్రైవర్‌గా పనిచేయాలని అనుకున్నారు. అయితే స్నేహితులు యూట్యూబ్ ద్వారా టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలని సూచించారు. ఆయన మామయ్య ఒక పాత ల్యాప్‌టాప్‌ను పవన్ ఇచ్చారు. స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని కీబోర్డ్, మౌస్ కొనుగోలు చేశారు. ఆరు నెలల వైఫై కోసం కూడా డబ్బు అప్పుగా తీసుకున్నారు. పవన్ రెడిట్, డిస్కార్డ్ వంటి ఆన్‌లైన్ కమ్యూనిటీల్లో చేరారు. అక్కడ ఇతరులతో పరిచయాలు పెంచుకుని ఉద్యోగ అవకాశాలను తెలుసుకున్నారు. ఈ ప్రయత్నాలే ఆయనకు మొదటి ఉద్యోగాన్ని అందించడంలో సహాయపడ్డాయి.
పవన్ మొదటి ఉద్యోగంలో నెలకు రూ.3,000 జీతం అందుకున్నారు. తర్వాత దుబాయ్‌కు చెందిన ఓ స్టార్టప్‌లో చేరి నెలకు సుమారు రూ.60,000 సంపాదించారు. తన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ కొత్త అవకాశాలను వెతుకుతూ వెళ్లారు. లింక్డ్‌ఇన్ పరిచయం ద్వారా ఆయన మోసాయిక్ వెల్‌నెస్‌లో ఉద్యోగం పొందారు. అక్కడ ఆయన నెలవారీ ఆదాయం సుమారు రూ.1.2 లక్షలకు పెరిగింది. తర్వాతి రెండు ఉద్యోగాల్లో ఆయన నెలకు రూ.1.8 లక్షల నుంచి రూ.2.1 లక్షల వరకు సంపాదించారు.
తర్వాత పవన్ గంటల ప్రాతిపదికన చెల్లించే రిమోట్ ఉద్యోగంలో చేరారు. ఆయనకు మొదట గంటకు 28 డాలర్ల చొప్పున పేమెంట్ లభించేంది. తర్వాత ఆయన రేటు గంటకు 32 డాలర్లకు పెరిగింది.
పన్నులు, ఇతర మినహాయింపుల తర్వాత ఏడాదికి సుమారు రూ.58 లక్షలు సంపాదించినట్లు పావన్ తెలిపారు. మినహాయింపులు లేకుండా చూస్తే ఆదాయం రూ.63.5 లక్షల వరకు ఉండేదని ఆయన చెప్పారు.
Also Read: పుట్టుకతో ఎడమ చేయిలేదు.. పట్టుదలతో చదివి రూ.50 లక్షల ప్యాకేజీ ఉద్యోగం
లేఆఫ్ కారణంగా పవన్ ఇటీవల తన హై సాలరీ ఉన్న ఉద్యోగాన్ని కోల్పోయారు. ప్రస్తుతం ఆయన సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్, AI ఇంజినీర్ వంటి ఉద్యోగాల కోసం చూస్తున్నారు.
హైబ్రిడ్ ఉద్యోగాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. డిగ్రీ కంటే నైపుణ్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ చెప్పారు. డిగ్రీ లేకపోయినా తనను నమ్మి ఉద్యోగాలు ఇచ్చిన స్టార్టప్‌లకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకంగా మోసాయిక్ వెల్‌నెస్ తన నైపుణ్యాలను నమ్మిందని చెప్పారు.
Also Read: 20 ఏళ్లు ఉద్యోగం చేస్తే మీ EPS పెన్షన్ ఎంత వస్తుంది? ఇలా లెక్కించాలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో కంపెనీలు డిగ్రీలకంటే టాలెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని పావన్ అభిప్రాయపడ్డారు. టైర్ – 1, టైర్ – 2 కాలేజీల అభ్యర్థులను మాత్రమే కోరే ఉద్యోగ ప్రకటనలు నిరాశ కలిగిస్తున్నాయని చెప్పారు. నిరంతరం నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంచుకోవడం, పరిచయాలు పెంచుకోవడం కెరీర్‌లో కొత్త అవకాశాలను తెస్తాయని ఆయన ప్రయాణం చూపిస్తోంది.