US Attack Iran Crude Price| ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో అందరూ అనుకున్నట్లుగానే అమెరికా ఎంట్రీ ఇచ్చింది. ఇజ్రాయెల్ తరపున అమెరికా దాడులు చేయడంతో ప్రపంచదేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే ఈ దాడులకు సమాధానంగా ఇరాన్ చేసే దాడులు, తీసుకునే చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోయే అవకాశముంది.
ఆదివారం ఉదయం ఇరాన్ లోని అణు కేంద్రాలపై దాడి చేసినట్లు అమెరికా ప్రకటించిన తర్వాత.. ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు పెరగవచ్చని, పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల ఆప్షన్స్ వైపు వెంటనే దృష్టి సారించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఈ దాడిని “విజయవంతం” అయిందని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు. అయితే, ఈ దాడి గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఈ సంఘటన మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచింది, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపవచ్చని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సోమవారం మార్కెట్లు తిరిగి తెరిచే సమయంలో షేర్లు పడిపోవచ్చని, అమెరికన్ డాలర్ వంటి సురక్షిత ఆస్తుల డిమాండ్ పెరగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. “యుద్దం కారణంగా మార్కెట్ కార్యకలాపాలు, పెట్టుబడిదారులు భయంతో పెట్టుబడులు పెట్టేందుకు వెనుకంట వేస్తారు. చమురు ధరలు ఆరంభంలో పెరుగుతాయి,” అని పొటోమాక్ రివర్ క్యాపిటల్‌కు చెందిన మార్క్ స్పిండెల్ అన్నారు. ఈ దాడి వల్ల ఇరాన్‌లో ఎంత నష్టం జరిగిందో ఇంకా స్పష్టత లేదు, ఇది మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతుందని ఆయన చెప్పారు. “ఇప్పుడు అమెరికా ఈ యుద్ధంలో పూర్తిగా చిక్కుకుంది. ఇక ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు,” అని స్పిండెల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ దాడి వల్ల చమురు ధరలు పెరిగితే.. ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే అవకాశం ఉంది. దీంతొ ప్రజలు ఖర్చు పెట్టేందుకు ఇష్టపడరు, వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలను సన్నగిల్లేలా చేస్తుంది. “ఈ సంఘటన మార్కెట్లలో కొత్త రిస్క్‌ను తీసుకొస్తుంది. చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం కూడా పెరుగుతుంది,” అని క్రెసెట్ క్యాపిటల్‌కు చెందిన జాక్ అబ్లిన్ అన్నారు. గత కొన్ని వారాలుగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 18 శాతం పెరిగి, గురువారం బ్యారెల్‌కు $79.04కి చేరాయి, ఇది గత ఐదు నెలల్లో అత్యధికం.
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ అనే సంస్థ.. ఈ యుద్ధం మూడు సంభావ్య ఫలితాలను విశ్లేషించింది: 1) ఉద్రిక్తతలు తగ్గడం, 2) ఇరాన్ చమురు ఉత్పత్తి పూర్తిగా ఆగిపోవడం, 3) స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మూసివేయబడడం. ఈ మూడింటిలో హార్ముజ్ మూసివేయబడితే, చమురు ధరలు బ్యారెల్‌కు $130కి చేరవచ్చని, ఇది అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని 6 శాతానికి పెంచవచ్చని వారు హెచ్చరించారు. దీంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు.
అయితే, కొందరు నిపుణులు ఈ దాడి ఇరాన్‌ను శాంతి ఒప్పందం వైపు నడిపిస్తుందని భావిస్తున్నారు. “ఈ దాడి ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేసింది. ఇప్పుడు ఇరాన్ శాంతి చర్చల వైపు మొగ్గు చూపవచ్చు,” అని హారిస్ ఫైనాన్షియల్ గ్రూప్‌కు చెందిన జామీ కాక్స్ అన్నారు. అయినప్పటికీ, చమురు ధరలు తాత్కాలికంగా పెరిగినా, కొన్ని రోజుల్లో స్థిరపడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
Also Read: ఇరాన్ అణు బాంబులు తయారు చేయడం లేదు.. అమెరికా గూఢాచారుల రిపోర్ట్
గతంలో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన సమయాల్లో.. షేర్ మార్కెట్లు మొదట పడిపోయినా, కొన్ని నెలల్లో కోలుకున్నాయి. ఉదాహరణకు, 2003లో ఇరాక్ యుద్ధం ఆ తరువాత 2019లో సౌదీ చమురు కేంద్రాలపై దాడుల తర్వాత షేర్లు త్వరగా బలపడ్డాయి. అమెరికన్ డాలర్ విషయంలో.. ఈ యుద్ధం మొదట సేఫ్ పెట్టుబడుల డిమాండ్‌ను పెంచవచ్చని, కానీ దీర్ఘకాలంలో దాని విలువపై ఒడిదొడుకులు ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అమెరికాలో భద్రతా అలర్ట్
ఇరాన్‌లోని అణు కేంద్రాలపై అమెరికా దాడుల తర్వాత, అమెరికాలో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. న్యూయార్క్ నగరంలో మత, సాంస్కృతిక ప్రదేశాలు, రాయబార కార్యాలయాల వద్ద పోలీసులు భద్రతను పెంచారు. ఇరాన్ ఈ దాడులను ధ్రువీకరించింది, నతాంజ్, ఇస్ఫహాన్, ఫోర్డోలోని అణు కేంద్రాలపై దాడులు జరిగాయని తెలిపింది. ఇరాన్ మీడియా ప్రకారం.. ఈ ప్రాంతాల్లో రేడియేషన్ సృష్టించే పదార్థాలు లేవని వెల్లడించింది. అమెరికా ఈ దాడులను “విజయవంతం” అని ప్రకటించినప్పటికీ, పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.