Real vs fake hallmark gold: ఇంట్లో పెళ్లిళ్లు, పండగలు వచ్చాయంటే బంగారం కొనడం మన దేశంలో ఆనవాయితీ. అయితే మనం ఎంతో కష్టపడి కొనే బంగారం అసలైనదేనా? లేదా నకిలీ హాల్‌మార్క్‌తో మోసపోతున్నామా? అనే అనుమానం చాలా మందికి ఉంటుంది. మార్కెట్లో మోసాలు పెరిగిపోతున్న తరుణంలో, మన ఆభరణాలపై ఉన్న హాల్‌మార్క్ నిజమైనదా కాదా అని స్వయంగా చెక్ చేసుకునే అద్భుతమైన అవకాశం ఇప్పుడు ప్రభుత్వమే కల్పించింది. ఆ సింపుల్ పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ప్రతి బంగారు ఆభరణంపై 6 అంకెల ఆల్ఫా-న్యూమరిక్ కోడ్ (ఉదాహరణకు: AZ1234) ఉంటుంది. దీనినే HUID అంటారు. ఈ కోడ్ ఉంటే ఆ నగ ఏ లాబొరేటరీలో పరీక్షించబడిందో, దాని పూర్తి హిస్టరీ ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది. ఒకవేళ నగలపై ఈ 6 అంకెల HUID లేకపోతే.. అది పాత స్టాక్ అయి ఉండాలి లేదా నకిలీ అయి ఉండొచ్చు.
మీ మొబైల్ ద్వారానే అసలు హాల్‌మార్క్‌ను గుర్తించడానికి ప్రభుత్వం అధికారికంగా BIS Care అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ ప్లే స్టోర్ నుంచి ‘BIS Care App’ను డౌన్‌లోడ్ చేసుకోండి. యాప్ ఓపెన్ చేసి అందులో ఉండే ‘Verify HUID’ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ నగలపై ఉన్న 6 అంకెల HUID కోడ్‌ను అక్కడ టైప్ చేసి సెర్చ్ చేయాలి. వెంటనే ఆ బంగారం ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది, దాని క్యారెట్లు ఎంత (ఉదాహరణకు 22K లేదా 18K), జ్యువెలరీ షాప్ వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి.
22K916: అంటే 22 క్యారెట్ల బంగారం (91.6% స్వచ్ఛత).
18K750: అంటే 18 క్యారెట్ల బంగారం (75% స్వచ్ఛత).
14K585: అంటే 14 క్యారెట్ల బంగారం (58.5% స్వచ్ఛత).
Also Read: ఫోన్ వేడిగా ఉన్నప్పుడు పొరపాటున కూడా..ఈ పనులు చేయొద్దు!
బంగారంపై హాల్‌మార్క్ వేయించుకోవడానికి లేదా చెక్ చేయడానికి BIS సంస్థ చాలా తక్కువ డబ్బులు వసూలు చేస్తుంది. సాధారణంగా ప్రతి ఆభరణానికి హాల్‌మార్క్ ఫీజు కేవలం రూ. 45 నుంచి రూ.50 వరకు మాత్రమే ఉంటుంది. కొన్ని నగల దుకాణాలు ఈ ఛార్జీలను బిల్లులో కలుపుతుంటాయి.
బంగారం కొనే ప్రతిసారీ పక్కాగా హాల్‌మార్క్ లోగో, BIS లోగో, HUID కోడ్ ఉన్నాయో.. లేదో బిల్లులో రికార్డ్ చేయించుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ హాల్‌మార్క్ లేని బంగారాన్ని కొనకండి. భవిష్యత్తులో మీరు ఆ బంగారాన్ని విక్రయించేటప్పుడు లేదా తాకట్టు పెట్టేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. ఈ చిన్న జాగ్రత్తలు చాలా ముఖ్యం.