Phone overheating mistakes: మనం రోజు వాడే స్మార్ట్ ఫోన్‌లు కొన్నిసార్లు ఓవర్ హీట్ అవుతుంటాయి. ముఖ్యంగా..హై-ఎండ్ గేమింగ్ ఆడేటప్పుడు, ఛార్జింగ్ పెట్టి వాడేటప్పుడు.. లేదా సమ్మర్ లో.. ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఫోన్ ఒక్క సారిగా వేడెక్కగానే.. మనకు కంగారు పుడుతుంది.దీంతో దాన్ని ఎలాగైనా వెంటనే కూల్ చేయాలని కొన్ని పిచ్చి పనులు చేస్తుంటాం. కానీ అలా చేయడం వల్ల మీ ఫోన్ మదర్ బోర్డ్ దెబ్బతినడం లేదా పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ ధర రూ. 15,000 నుంచి ప్రారంభమై లక్ష రూపాయల వరకు ఉంటుంది. అంత విలువైన ఫోన్‌ను మనమే స్వయంగా పాడుచేసుకోకుండా ఉండాలంటే.. ఈ క్రింది పొరపాట్లను అస్సలు కూడా చేయకూడదు.
ఫోన్ వేడెక్కగానే దాన్ని వెంటనే ఫ్రిజ్‌లో పెట్టడం లేదా ఫ్రీజర్‌లో ఉంచడం చాలా మంది చేస్తుంటారు. ఇది చాలా పెద్ద ప్రమాదకరమైన పొరపాట్లు. ఫోన్ లోపలి ఉష్ణోగ్రతకు, ఫ్రిజ్‌లోని అతి చల్లటి వాతావరణానికి మధ్య ఉన్న విపరీతమైన తేడా వల్ల ఫోన్ లోపల తేమ ఏర్పడుతుంది. ఈ నీటి బిందువులు ఫోన్ మదర్ బోర్డును, సర్క్యూట్లను షార్ట్ సర్క్యూట్ చేసి ఫోన్‌ను పూర్తిగా డెడ్ చేసేస్తాయి.
కొంత మంది కంగారులో ఫోన్‌ను చల్లటి నీటిలో.. ముంచడం లేదా తడి క్లాత్తో రుద్దడం చేస్తుంటారు. వాటర్ ప్రూఫ్ ఫోన్లు అయినప్పటికీ.. సడన్ టెంపరేచర్ ఛేంజ్ వల్ల స్క్రీన్ పగిలిపోయే అవకాశం ఉంది. నీరు లోపలికి వెళ్తే రిపేర్ ఖర్చు సుమారు రూ.3,000 నుంచి రూ.8,000 వరకు కావచ్చు.
ఫోన్ వేడిగా ఉన్న సమయంలో.. మళ్లీ దానికి ఛార్జింగ్ పెట్టడం లేదా హై-ఎండ్ గేమింగ్, హెవీ అప్లికేషన్లు రన్ చేయడం చేయకూడదు. ఫోన్ బ్యాటరీ ఛార్జ్ అయ్యేటప్పుడు సహజంగానే వేడెక్కుతుంది. ఆ సమయంలో.. వాడితే లిథియం-అయాన్ బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయే ప్రమాదం ఉంది. కొత్త బ్యాటరీ మార్చాలంటే సుమారు రూ.1,500 నుంచి రూ.3,500 ఖర్చు అవుతుంది.
ఫోన్ హీట్ అయినప్పుడు దానిపై.. ఉన్న ప్లాస్టిక్ లేదా సిలికాన్ కవర్‌ను వెంటనే తొలగించాలి. కవర్ అలాగే ఉంచడం వల్ల లోపలి.. వేడి బయటకు వెళ్లే దారి లేక ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది.
Also Read: అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!
ఫోన్ వేడెక్కితే వెంటనే దాని వాడకాన్ని ఆపివేయండి.
1.బ్యాక్‌కవర్ తీసి, గాలి ఆడే నీడ ప్రాంతంలో (ఫ్యాన్ గాలి కింద) కొద్ది సేపు ఉంచండి.
2.స్క్రీన్ బ్రైట్‌నెస్ తగ్గించి, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన యాప్స్‌ను క్లోజ్ చేయండి.
3.ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయడం వల్ల నెట్‌వర్క్ సిగ్నల్స్ కారణంగా ఫోన్‌పై పడే భారం తగ్గి త్వరగా చల్లబడుతుంది.
4.చిన్నపాటి అవగాహన లోపం వల్ల వేల రూపాయల ఫోన్ పాడైపోతుంది. కాబట్టి ఇకపై మీ ఫోన్ వేడెక్కితే కంగారు పడకుండా ఈ సేఫ్టీ రూల్స్ పాటించండి!