Income Tax | ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం, పన్ను చెల్లింపులకు సంబంధించి అన్ని వివరాలకు ఆధారాలు కలిగి ఉండాలి. ఎందకంటే ఐటీ శాఖ అధికారులకు త్వరలో స్పెషల్ పవర్స్ అంటే ప్రత్యేక అధికారాలు లభించనున్నాయి.
ట్యాక్య్ పేయర్స్.. పన్ను ఎగవేతకు పాల్పడుతున్నట్లు లేదా అప్రకటిత ఆస్తుల కలిగి ఉన్నట్ల అనుమానం వస్తే.. వారి ఇ-మెయిల్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్, ఆన్‌లైన్ పెట్టుబడులు, బ్యాంక్ ఖాతాలు, ట్రేడింగ్ ఖాతాలను సైతం దర్యాప్తు చేసే చట్టబద్ధమైన హక్కు ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్‌కు ఉంటుంది. ఈ నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. ఇది ఆర్థిక మోసాలు.. అప్రకటిత ఆస్తులు, పన్ను ఎగవేతలను నిరోధించడానికి డిజిటల్ యుగానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.
ప్రస్తుతం అమలులో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 132 ప్రకారం.. పన్ను అధికారులు అప్రకటిత ఆస్తులు లేదా ఆర్థిక రికార్డులు దాచిపెట్టినట్లు అనుమానించినట్లయితే, తలుపులు, సేఫ్‌లు, లాకర్లను పగులగొట్టి దర్యాప్తు చేయగలరు. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. ఈ అధికారాలు ఇప్పుడు డిజిటల్ సాధనాలకు కూడా విస్తరిస్తాయి. అంటే.. పన్ను ఎగవేతకు సంబంధించిన సమాచారం దాచినట్లు అనుమానించినట్లయితే.. కంప్యూటర్ సిస్టమ్‌లు, ఆన్‌లైన్ ఖాతాలను యాక్సెస్ చేసే హక్కు కూడా పన్ను అధికారులకు ఉంటుంది.
ఆర్థిక లావాదేవీలు డిజిటల్‌గా మారడంతో, పన్ను దర్యాప్తు ప్రక్రియ కూడా ఆధునికంగా మారుతోంది. ఈ మార్పు పన్ను ఎగవేతను అరికట్టడంలో ప్రభావవంతంగా ఉంటుందా లేక వ్యక్తిగత గోప్యతను హరించే ప్రమాదం ఉందా అనేది చర్చనీయాంశంగా మిగిలిపోయింది. డిజిటల్ ఫోరెన్సిక్స్ పన్ను దర్యాప్తులో కీలక పాత్ర పోషిస్తుందని ఈ కొత్త చట్టం సూచిస్తోంది.
Also Read: నెలకు జస్ట్ రూ. 5400 సేవింగ్.. ఈ స్కీంలో రెండు కోట్ల రాబడి పక్కా..!
ఆదాయపు పన్ను శాఖ (ఐటీ డిపార్ట్మెంట్) అసెస్మెంట్ పూర్తి చేసే సమయంలో.. ప్రతి అసెస్సీ (వ్యక్తి) నుండి సమాచారం అడగడానికి విస్తృత అధికారాలు కలిగి ఉంది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం కింద సెక్షన్ 142(1) ప్రకారం.. ఈ అధికారాలు ఉన్నాయి. ఇటీవల ఒక అసెస్సీకి నోటీసు జారీ చేయబడింది, దానిలో ఇలా పేర్కొన్నారు: “మీరు మీ ఇంటి ఖర్చులు, వ్యక్తిగత వినియోగం లేదా డ్రాయింగ్స్‌ను చాలా తక్కువగా చూపించారు. కాబట్టి.. మీ కుటుంబ సభ్యుల వివరాలు, వారి ప్రొఫైల్‌లు, వారి పర్మనెంట్ అకౌంట్ నంబర్లు (PAN), వారి వార్షిక ఆదాయం వివరాలు సమర్పించండి.” ఇది నోటీసు సారాంశం.
నోటీసులో అడిగిన వివరాలు చూస్తే షాకవ్వాల్సిందే.. ఒకసారి చూడండి..
ఈ వివరాలతో పాటు, ఇంట్లో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నారు, వారి ఆదాయం, ఖర్చుల వివరాలు, రుజువు డాక్యుమెంట్స్‌తో సహా సమర్పించాలి.
చివరగా.. ఈ నోటీసులో ఒక హెచ్చరిక కూడా ఉంది: “ఈ వివరాలు సమర్పించకపోతే, మీరు ప్రతి సంవత్సరం ఇంటి ఖర్చుల కోసం రూ. 10,00,000 విత్‌డ్రా చేసినట్లు భావిస్తాము.” అంటే.. ఈ మొత్తంపై పన్ను విధించబడుతుంది. ఈ ఖర్చులకు సరైన ఆధారాలు చూపించకపోతే.. వాటిని కూడా ఆదాయంగా పరిగణించి దానిపై కూడా పన్ను వసూలు చేస్తారు.
ఈ విధంగా, ఆదాయపు పన్ను శాఖ.. ట్యాక్స్ పేయర్స్ నుంచి వివరాలు అడగడం ద్వారా పన్ను ఎగవేతను నియంత్రించడానికి ప్రయత్నిస్తోంది.