India GDP World Bank Report | భారతదేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) మూడవ త్రైమాసికం అంటే 2024 సంవత్సరం అక్టోబర్–డిసెంబర్ కాలానికి కూడా బలహీన ధోరణినే కనిబర్చింది. దేశ జీడీపీ వృద్ధి రేటు ఆశించిన స్థాయి కంటే తక్కువగా నమోదైంది. ఈ త్రైమాసికానికి 6.2 శాతం వృద్ధి రేటు నమోదైంది. జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో నమోదైన 5.6 శాతం (సవరణకు ముందు 5.4 శాతం) నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 6.2 శాతానికి పెరిగినప్పటికీ.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి అంటే (2023–24) మూడవ త్రైమాసికంలో నమోదైన 9.5 శాతం రేటుతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయింది. అంతేకాకుండా, ఈ వృద్ధి రేటు ఆర్‌బీఐ అంచనా వేసిన 6.8 శాతం కంటే చాలా తక్కువగా ఉంది.
మైనింగ్, తయారీ రంగాల పనితీరు బలహీనంగా ఉండడం కారణంగానే వృద్ధి రేటు తగ్గడానికి ముఖ్య కారణం. పట్టణ వినియోగం కూడా బలహీనంగానే కొనసాగింది. అయితే అనూహ్యంగా వ్యవసాయ రంగం పటిష్ట పనితీరు కనబర్చింది. దీనికి తోడు ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచడం, వర్షాలు కూడా బాగా పడడం కారణంగా పండుగల సీజన్‌లో గ్రామీణ వినియోగం పెరగడం ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చాయి. డిసెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో- నేషనల్ స్టాటిస్టిక్స్) శుక్రవారం విడుదల చేసింది.
నాలుగేళ్ల కనిష్ట స్థాయికి జీడీపీ..
2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ 6.5 శాతం వృద్ధిని (స్థిర కరెన్సీలో రూ.188 లక్షల కోట్లు) సాధిస్తుందని ఎన్‌ఎస్‌వో తన ద్వితీయ ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఈ ఏడాది జనవరిలో వేసిన తొలి ముందస్తు అంచనాల్లో ఇది 6.4 శాతంగా ఉండడం గమనార్హం. అయినప్పటికీ, ఇది నాలుగేళ్ల కనిష్ట వృద్ధి కానుంది. క్రితం ఆర్థిక సంవత్సరం 9.2 శాతం కంటే తక్కువగా ఉంది. ఎన్‌ఎస్‌వో తాజా అంచనాల ప్రకారం, జీడీపీ 6.5 శాతానికి చేరుకోవాలంటే చివరి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగైన పనితీరు చూపించాల్సి ఉంటుంది.
Also Read: 2024-25 ప్రావిడెంట్ ఫండ్ వడ్డీ రేట్లు ఫైనల్ – మీకు కలిగే ప్రయోజనాలేటంటే?
అధిక ఆదాయ దేశంగా మారాలంటే 7.8 శాతం వృద్ధి అవసరం
ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం, 2047 నాటికి భారత్ అధిక ఆదాయ ఆర్థిక వ్యవస్థగా మారాలంటే సగటున 7.8 శాతం వార్షిక వృద్ధి రేటు అవసరం. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆర్థిక రంగంతో పాటు భూమి, కార్మిక విభాగాల్లో సంస్కరణలు తప్పనిసరి. 2000 నుంచి 2024 మధ్య భారత్ సగటున 6.3% వృద్ధి సాధించింది. భవిష్యత్ లక్ష్యాలను సాధించడానికి అవసరమైన బలమైన పునాదులు ఇప్పటికే వేసినట్లు నివేదిక తెలిపింది. స్థూల తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి దాదాపు 8 రెట్లు పెరగాల్సి ఉంటుందని హెచ్చరించింది.
అంతర్జాతీయ తయారీ హబ్‌గా భారత్‌ను మార్చేందుకు ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టింది. మౌలిక సదుపాయాలు, మానవ వనరుల మెరుగుదల, డిజిటలీకరణలు మరియు ఆర్థిక స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం దీనికి ఉదాహరణలు. చిలీ, కొరియా, పోలండ్ వంటి దేశాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఏకీకృతం కావడం ద్వారా అధిక ఆదాయ దేశాలుగా ఎదిగాయి. భారత్ కూడా వారి నుండి పాఠాలు నేర్చుకోవాలి.
2000 నుంచి ఇప్పటివరకు భారత ఆర్థిక వ్యవస్థ దాదాపు 4 రెట్లు పెరిగింది. తలసరి ఆదాయం మూడింతలైంది. 2000లో అంతర్జాతీయ జీడీపీలో భారత వాటా 1.6% కాగా, 2023లో 3.4%కి చేరింది. భారత్ ప్రపంచంలోనే అయిదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. పేదరికం గణనీయంగా తగ్గగా, సేవల రంగం మరియు మౌలిక సదుపాయాలు విస్తరించాయి. 2047కు భారత్ భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది.