EMI Trap India| భారతదేశంలో చాలా మంది ఉద్యోగులు ఈఎంఐ (EMI – సమాన నెలవారీ వాయిదాలు)ల భారంతో నిశ్శబ్దంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే సంపాదన లేదా ఆదాయాన్ని.. కొత్త కారు కొనడం, ఫోన్ అప్‌గ్రేడ్ చేయడం, లేదా విహార యాత్ర బుక్ చేయడం వంటి ఆర్థిక విజయాలు ఇప్పుడు అప్పులతో ముడిపడి ఉన్నాయని ఫైనాన్షియల్ అనలిస్ట్ అయిన సంజయ్ కతూరియా ఒక లింక్డ్ఇన్ పోస్ట్‌లో వివరించారు.
సంజయ్ తన పోస్ట్ లో ఇలా రాశారు. “కొత్త కారు కొన్నారు – EMI. ఫోన్ మార్చారు – EMI. విహార యాత్ర బుక్ చేశారు – EMI. ఇల్లు కొన్నారు – 25 సంవత్సరాల EMI.” బయటి నుండి చూస్తే, మీరు విజయం సాధించినట్లు కనిపిస్తారు, కానీ లోపల ప్రతి నెల 1వ తేదీన వేతనం కోసం ఎదురుచూపులు చూడడం ఆ వచ్చన వేతనాన్ని వెంటనే ఖర్చు చేయాలన్సిన ఒత్తిడి కూడా ఉంటుంది.
ఈఎంఐ ఒక ఉచ్చు
ఈ పరిస్థితిని సంజయ్.. “EMI ఉచ్చు” అని వర్ణించారు. ఆదాయం పెరిగినప్పుడు ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇలా చేస్తే.. ఆదా చేయడం, రిస్క్ తీసుకోవడం లేదా వ్యక్తిగత స్వేచ్ఛ తో పెట్టుబడులు చేయడానికి అసలు వీలు పడదు. ఉద్యోగం కూడా మారలేరు. “మీరు జీవనం కొనసాగించడానికి పని చేస్తారు, అభివృద్ధి కోసం కాదు. కెరీర్ మార్చడం లేదా ‘నో’ అని చెప్పలేరు,” అని ఆయన అన్నారు.
ఆర్థిక స్వీయ-అవగాహన అవసరమని సంజయ్ హెచ్చరించారు. భవిష్యత్ ఆదాయాన్ని ఈఎంఐలకు కట్టిపడేయడం వల్ల సౌలభ్యం, మనశ్శాంతి తగ్గుతాయి. “మీ భవిష్యత్తుపై మీ కంటే బ్యాంకుకు ఎక్కువ హక్కు ఉంటుంది,” అని ఆయన రాశారు. ఈ సమస్య ఆర్థికమే కాదు, సాంస్కృతికమైనది కూడా. లోన్ EMIల అగ్రీమెంట్ పై సైన్ చేయడానికి త్వరపడతారు. కానీ అత్యవసర పరిస్థితులు లేదా జీవన మార్పులను ఎదుర్కోవడంలో సౌలభ్యం కోల్పోతామని ఆలోచించరు. “సౌలభ్యమే నిజమైన సంపద,” అని ఆయన ముగించారు. నిజమైన ఆర్థిక శ్రేయస్సు అనేది ఎక్కువ వస్తువులు కొనడం కాదు, మీ ఎంపికలు, భవిష్యత్తును మీ చేతుల్లో ఉండే విధంగా చూసుకోవడం. అందుకు తగినట్లు వ్యవహరించడం.
ద్రవ్యోల్బణం: మీ సంపదను తగ్గించే నిశ్శబ్ద శత్రువు
ద్రవ్యోల్బణం (ఇన్‌ఫ్లేషన్) కారణంగా డబ్బు విలువ సమయంతోపాటు తగ్గిపోతుంది. సోషల్ మీడియా ఎక్స్‌లో ఒక పోస్ట్ దీనిని హైలైట్ చేసింది.ఉదాహరణకు 7 శాతం వార్షిక ద్రవ్యోల్బణం రేటు ఉంటే.. ఈ రోజు రూ.1 కోటి నగదలు విలువ 10 సంవత్సరాల తరువాత రూ. 50 లక్షలు, 15 సంవత్సరాల్లో రూ. 36 లక్షలు, 20 సంవత్సరాల్లో రూ. 25 లక్షల విలువకు సమానం. దీనివల్ల దీర్ఘకాల ఆర్థిక ప్రణాళికలో ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.
ద్రవ్యోల్బణం ఎందుకు పెరుగుతోంది?
ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కరెన్సీ ముద్రణను పెంచడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. 2018 నుండి ప్రపంచవ్యాప్తంగా సగటున 8 శాతం కరెన్సీ ముద్రణ జరిగింది. దీనివల్ల సాంప్రదాయ పెట్టుబడి విధానాలు సంపదను కాపాడలేకపోవచ్చు.
Also Read: సేవింగ్స్ అకౌంట్‌లో డబ్బు పెట్టడం ఇక వేస్ట్.. తగ్గిన వడ్డీ రేట్లతో సంపద సృష్టి కష్టమే
ద్రవ్యోల్బణాన్ని అధిగమించే పెట్టుబడులను ఎంచుకోవడం అవసరం. మార్కెట్ ట్రెండ్‌లను అర్థం చేసుకోవడం, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చడం ముఖ్యం. వడ్డీ రేట్లు, ప్రభుత్వ విధానాలు వంటి అంశాలను అర్థం చేసుకోవడం ద్వారా, స్థిరమైన ఆర్థిక భవిష్యత్తును సాధించవచ్చు.