Banks Shut Down ATMs| దేశంలో బ్యాంకులు ఏటిఎం మెషీన్లను(ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్లు) మూసివేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం యూపిఐ లాంటి డిజిటల్ లావాదేవీల విస్తృత వినియోగమే. వీటికి తోడు ఏటిఎంల నిర్వహణ కూడా బ్యాంకులకు భారంగా మారింది. ఒకవైపు బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు వినియోగం గరిష్టస్థాయిలకు చేరినప్పటికీ.. మరోవైపు ఏటీఎంల సంఖ్య మాత్రం నిరంతరం తగ్గుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యాంకులు తెరుస్తున్న కొత్త ఏటీఎంల కంటే మూసేస్తున్నవి ఎక్కువ కావడం విశేషం.
ఇప్పటి రోజుల్లో కూరగాయల కొనుగోలు నుంచి బైక్‌లో పెట్రోలు పోయించే వరకూ దేనికైనా ఫోన్ పే, గూగుల్ పే వంటి డిజిటల్ చెల్లింపులే వినియోగంలో ఉన్నాయి. దైనందిన జీవితంలో యూపీఐ పేమెంట్స్ అంతగా భాగంగా మారిపోయాయి. ఈ కారణంగా ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాల్స్ తగ్గిపోతున్నాయి. గతంలో రోడ్ల పక్కన వరుసగా కనిపించే ఏటీఎంలను.. ఇప్పుడు బ్యాంకులు చడీ చప్పుడు లేకుండా మూసివేస్తున్నాయి.
బ్యాంకులు ఏటిఎంలు మూసేయడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ విధించిన ఉచిత ఏటీఎం లావాదేవీలపై పరిమితులు, బ్యాంకుల మధ్య ఏటీఎం ఇంటర్-ఆపరబిలిటీ లేని పరిస్థితి, ఇతర బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలు ఉపయోగిస్తున్నప్పుడు చెల్లించాల్సిన ఇంటర్‌చేంజ్ ఫీజు పెరగకపోవడంతో బ్యాంకులు ఎదుర్కొంటున్న నష్టాలు వంటి అంశాల కారణంగా బ్యాంకులు కొత్త ఏటీఎంల ఏర్పాటు పట్ల ఆసక్తి చూపడం లేదు. ఈ రంగంలో పెట్టుబడి పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నాయి.
2023 డిసెంబర్ నాటికి దేశంలో మొత్తం 2,19,882 ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే ఏడాదిలో 5,484 ఏటీఎంలు మూతపడ్డాయి. ముఖ్యంగా బ్యాంకు శాఖలకు సంబంధించినవి కాకుండా ఇతర ప్రదేశాల్లో ఉన్న ఆఫ్‌సైట్ ఏటీఎంలే ఎక్కువగా మూసేశారు. 2022 సెప్టెంబరులో 97,072గా ఉన్న ఆఫ్‌సైట్ ఏటీఎంలు 2024 డిసెంబర్ నాటికి 85,913కి తగ్గిపోయాయి.
అయితే డిజిటల్ చెల్లింపులతో పాటు నగదు వినియోగం కూడా పెరిగిందన్నది విస్మయకరం. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చలామణీ రూ.34.7 లక్షల కోట్లు (జీడీపీతో పోల్చితే 12 శాతం) గా ఉంది. డీమానిటైజేషన్ తర్వాత ఇది రెట్టింపైంది. కానీ, ఇంత నగదు చెలామణిలో ఉన్నా ఏటీఎంల సంఖ్య మాత్రం తగ్గిపోతుండటం గమనార్హం.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. దేశంలో ప్రతి లక్ష మందికి కేవలం 15 ఏటీఎంలే ఉన్నాయి. మరోవైపు, 2024లో యూపీఐ ద్వారా జరిగిన లావాదేవీల సంఖ్య 17,200 కోట్లకు చేరింది. ఇది 2023లో జరిగిన 11,760 కోట్ల లావాదేవీలతో పోలిస్తే దాదాపు 46 శాతం పెరిగినట్టే. ఇదే సమయంలో.. ఆర్‌బీఐ అనుమతితో బ్యాంకులు ఈ నెల 1 నుండి ఏటీఎం ఛార్జీలను పెంచాయి.
Also Read: వర్క్ ఫ్రమ్ హోంతో సమస్యలు.. ఆఫీసుకే వస్తా.. టెకీ నిర్ణయంపై సోషల్ మీడియాలో చర్చ
ప్రస్తుతం ఉచిత లావాదేవీల సంఖ్య మించితే.. ఒక్కో లావాదేవీకి రూ.21 చార్జీ వసూలు చేస్తున్న బ్యాంకులు, ఇప్పుడు దానిని రూ.23కి పెంచాయి. నెలలో ఒక్క ఖాతాదారుడు తన బ్యాంకు ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో (మెట్రో నగరాలు) 3, నాన్ మెట్రోల్లో 5 ఉచిత లావాదేవీలు చేయవచ్చు. ఇందులో క్యాష్ విత్‌డ్రా మాత్రమే కాదు, బ్యాలెన్స్ ఎంక్వయిరీ వంటి సర్వీసులు కూడా లావాదేవీలుగానే పరిగణించబడుతున్నాయి.
ఇక, కొన్ని బ్యాంకులు బ్రాంచ్‌ల వద్ద ఉన్న ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్‌సైట్ ఏటీఎంల విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చాలాసార్లు సాంకేతిక లోపాలు, లేదా నగదు లేకపోవడం వంటివి సాధారణంగా మారాయి. ఈ కారణంగా అత్యవసరంగా నగదు అవసరం ఉన్నపుడు ఖాతాదారులు ఏటీఎం కోసం రెండు మూడు ప్రదేశాలు తిరగాల్సి వస్తోంది.