Tesla Cars India | ప్రపంచ కుబేరుడు, టెస్లా సిఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) భారతదేశానికి టెస్లా ప్రీమియం ఎలెక్ట్రిక్ కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబై, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో టెస్లా షోరూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు, అందులో పనిచేయడానికి కావలసిన నిపుణులను నియమించుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే.. టెస్లా కార్లు భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశిస్తే వాటి ధరలు ఎలా ఉంటాయి? భారతీయులు ముఖ్యంగా మధ్యతరగతి వారు వాటిని మిగతా కంపెనీలతో పోలిస్తే కొనడానికి ఇష్టపడతారా? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఇండియాలో టెస్లా కార్లు అమ్మకాలు జరిపేందుకు ఎలాన్ మస్క్ గత నాలుగు అయిదేళ్ల నుంచి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇంతకాలం భారత ప్రభుత్వం దిగుమతులపై అధిక సుంకాలు విధించడంతో అది సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు అనుకోకుండా అమెరికా ఎన్నికల్లో ట్రంప్ ప్రెసిడెంట్ విజయం సాధించడం. ఇదంతా మస్క్ సాయం వల్లే సాధ్యం కావడంతో.. అమెరికాలో మస్క్ చెప్పిందే వేదంగా మారింది. దీంతో అధ్యక్షుడు ట్రంప్ ఇతర దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధిస్తానని అన్ని దేశాలకు బెదిరించారు. ఈ జాబితాలో భారత దేశంకూడా ఉంది. అందుకే అమెరికా సుంకాల బారి నుంచి తప్పించుకోవడానికి భారత దేశం కూడా దేశంలో దిగుమతులపై సుంకాలు తగ్గించే పనిలో పడింది. దీంతో టెస్లాకు ఇండియాలో ప్రవేశించడానికి మార్గం సుగమమైంది.
Also Read: రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్.. ముందస్తు చెల్లింపుల ఛార్జీలకు నో చెప్పిన ఆర్బిఐ
టెస్లా కార్ల ధరలు ఎలా ఉంటాయి?
టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే, కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది. ధరలు తగ్గిన తర్వాత కూడా, టెస్లా కారు ప్రారంభ ధర రూ. 35 లక్షల నుంచి ప్రారంభమవుతుందని గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ (CLSA) నివేదికలో వెల్లడించింది.
ప్రస్తుతం అమెరికాలో టెస్లా యొక్క చౌకైన కారు మోడల్ 3 ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ మరియు ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది.
భారతీయ ఈవీ మార్కెట్‌తో పోలిక
మహీంద్రా XUV400 EV, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువ. కాబట్టి, టెస్లా కార్ల అమ్మకాలు భారతదేశంలో ఆశాజనకంగా ఉంటాయా అనేది ఒక ప్రశ్న. అయితే, టెస్లా ధరలు భారతీయ ఈవీ మార్కెట్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని సీఎల్ఎస్ఏ నివేదిక వెల్లడించింది.
టెస్లా ప్రణాళికలు
టెస్లా కంపెనీ రూ. 25 లక్షల కంటే తక్కువ ధర కలిగిన ఎంట్రీ-లెవల్ మోడల్‌ను భారతదేశంలో లాంచ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. టెస్లా ప్రవేశం ప్రధాన భారతీయ వాహన తయారీదారులపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని నివేదికలో నిపుణలు పేర్కొన్నారు. ఎందుకంటే, భారతదేశంలో మొత్తం ఈవీల వ్యాప్తి చైనా, యూరప్, అమెరికా కంటే తక్కువగా ఉంది.
టెస్లా కార్లు భారతదేశంలోకి ప్రవేశిస్తే, అవి ప్రీమియం ధరలతో అందుబాటులోకి రావచ్చు. అయితే, టెస్లా తన ధరలను సర్దుబాటు చేసుకుని, భారతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే, అది భారతీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చు. టెస్లా యొక్క ప్రవేశం భారతీయ ఈవీ మార్కెట్‌కు ఒక పెద్ద సవాలుగా మారవచ్చు.