ఒక వ్యక్తి.. జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోవచ్చు? 1 నుంచి 10 సార్లు… లేదా ఇంకొన్ని సార్లు. కానీ, ఈయన తన జీవితంలో 31 సార్లు ఓడిపోయాడు. ఉద్యోగం కోసం ఎక్కడికెళ్లినా.. నువ్వు వేస్ట్, పనికిరావంటూ తిప్పి పంపించేవారు. ఒక్కోసారి లక్ కూడా కలిసి వచ్చేది కాదు. చివరికి.. బాల్యం నుంచి ఆసక్తితో చైనాకు వచ్చే టూరిస్టుల దగ్గర నేర్చుకున్న ఇంగ్లీషే ఆయనికి బతుకుతెరువు అయ్యింది. ఏ ఉద్యోగం దొరక్కపోవడంతో ఇంగ్లీష్ ట్యూటర్‌గా జాయిన్ అయ్యాడు. నెలకు రూ.1000 సంపాదనతో కాలం వెళ్లదీసేవాడు. అనుకోకుండా ఓ రోజు.. ట్రాన్సలేటర్‌గా అతడికి అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అదే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అతడి బుర్రలో మెదిలిన ఒక చిన్న ఆలోచన.. ఇప్పుడు పెద్ద సామ్రాజ్యంగా మారింది. ఇప్పుడు అతడు ప్రపంచ బిలీనియర్లలోనే ఒకడు. సుమారు రూ.3 లక్షల కోట్లకు అధిపతి. అతడే.. ‘అలీబాబా’ వ్యవస్థాపకుడు జాక్ మా.
జాక్ మా 1964లో చైనాలోని హ్యాంగ్‌జౌ నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఆయన అసలు పేరు మా యున్. ఆయనకు చిన్నప్పటి నుంచీ ఓ విచిత్రమైన కోరిక ఉండేది. విదేశీయులతో మాట్లాడాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకొనేవాడు. ఆ సమయంలో చైనాలో ఇంగ్లీష్ నేర్పించేవారు ఎవరూ లేరు. దీంతో 12 ఏళ్ల వయస్సులో ప్రతిరోజూ ఉదయాన్నే 4 గంటలకే లేచి, 40 కిలోమీటర్లు సైకిల్ తొక్కుకుంటూ స్థానిక టూరిస్ట్ హోటళ్లకు వెళ్లేవారు. అక్కడికి వచ్చే విదేశీ టూరిస్టులకు ఉచితంగా నగరాన్ని చూపిస్తూ.. వారి నుంచి ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నారు. అయితే, ఒక విదేశీ టూరిస్ట్ అతని పేరును పలకలేక ఇబ్బంది పడ్డాడు. మా యూన్‌కు ముద్దుగా జాక్ అని పిలిచాడు. ఆ పేరు నచ్చడంతో మిగతా టూరిస్టులకు అదే పేరు చెప్పేవారు. చివరికి ఆ పేరునే సొంత పేరుగా మార్చుకున్నారు.
బాల్యంలో జాక్ మాకు చదువు అబ్బలేదు. ప్రైమరీ స్కూల్ పరీక్షల్లో 2 సార్లు, మిడిల్ స్కూల్‌లో 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో ఏకంగా 3 సార్లు ఫెయిలయ్యాడు. చివరికి టీచర్స్ ట్రైనింగ్ ఇన్సిస్ట్యూట్‌లో చేరాడు. ఆ తర్వాత అసలు కష్టాలు మొదలయ్యాయి. డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. అలా 31 చోట్ల ఆయనను రిజెక్ట్ చేశారు. ఆయన నగరంలో KFC బ్రాంచ్ ఓపెన్ చేశారని తెలిసి.. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఉద్యోగానికి వెళ్లిన 24 మందిలో 23 మందికి జాబ్ వచ్చింది. రిజెక్ట్ అయిన ఏకైక దురదృష్టవంతుడు జాక్ మా. ఆ తర్వాత ఐదుగురు అభ్యర్థులు వెళ్తే నలుగురిని తీసుకుని, నువ్వు ఈ ఉద్యోగానికి పనికిరావు అని జాక్ మాను బయటకు పంపేశారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కు 10 సార్లు అప్లై చేస్తే, 10 సార్లూ రిజెక్ట్ చేశారు. దీంతో నెలకి రూ.1,000 జీతానికి ఇంగ్లీష్ టీచర్‌గా పని చేస్తూ జీవితాన్ని నెట్టుకొచ్చాడు.
1995లో అనువాదకుడిగా అమెరికా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడ మొదటిసారి కంప్యూటర్, ఇంటర్నెట్‌ను చూశాడు. కుతూహలంతో ఇంటర్నెట్‌లో Beer అని టైప్ చేశాడు. అమెరికా, జర్మనీ బీర్ల పేర్లు వచ్చాయి. కానీ చైనా బీర్ అని ఎక్కడా రాలేదు. చైనా అని వెతికితే.. అసలు సమాచారమే రాలేదు. అప్పుడే జాక్ మా మైండ్‌లో ఓ మెరుపు మెరిసింది. ‘‘నా దేశం గురించి.. నా దేశపు వ్యాపారాల గురించి ప్రపంచానికి ఎందుకు తెలియకూడదు?’’ అని అనుకున్నాడు. ఆయనకు సొంతంగా కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. కోడింగ్ రాదు. కానీ ఆలోచన ఉంది. చైనాకు తిరిగి వచ్చి ‘చైనా పేజెస్’ అనే మొదటి వెబ్‌సైట్ మొదలుపెట్టాడు. మొదటి పేజీ లోడ్ అవ్వడానికి 3.5 గంటలు పట్టేది. అంతా ఆయనను చూసి నవ్వారు. ఇది వర్కవుట్ కాదు, ఇంకేదైనా పని చూసుకో అన్నారు. అయినా వెనక్కి తగ్గలేదు.
1999లో జాక్ మా తన 17 మంది స్నేహితులను తన చిన్న అపార్ట్‌మెంట్‌కి పిలిచాడు. తన ఆలోచన చెప్పాడు. మనం చైనాలోని చిన్న వ్యాపారులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు అనుసంధానించే ఒక ఈ-కామర్స్ సైట్ పెడదాం అన్నాడు. అందరూ కలిసి డబ్బులన్నీ పోగేస్తే.. సుమారు 50 లక్షల రూపాయలు వచ్చాయి. తన సంస్థకు Alibaba అని పేరు పెట్టాడు. అలీబాబా, 40 దొంగల కథలో ‘కుల్ జా సిమ్ సిమ్’ అన్నట్లుగా.. తమ కంపెనీ చిన్న వ్యాపారులకు అవకాశాల తలుపులు తెరుస్తుందనే అర్థం వచ్చేలా ఆ పేరు పెట్టాడు. అయితే, ఈ కంపెనీ మొదలుపెట్టిన తొలినాళ్లలో ఘోరమైన నష్టాలు చూశాడు. ఇన్వెస్టర్లు ఎవ్వరూ డబ్బులు పెట్టలేదు. అమెరికాలోని లికాన్ వ్యాలీ ఇన్వెస్టర్లు.. ఈ బిజినెస్ మోడల్ పనికిరాదని తిరస్కరించారు. కానీ, జాక్ మా మాత్రం ఒక్కటే చెప్పాడు.. ‘‘ఈ రోజు నరకంలా ఉండొచ్చు. రేపు అంతకంటే ఘోరంగా ఉండొచ్చు. కానీ, ఎల్లుండి.. సూర్యోదయం అద్భుతంగా ఉంటుంది’’ అన్నాడు. చివరికి.. ఆయన చెప్పిందే నిజమైంది.
2003 లో ప్రపంచ ఈ-కామర్స్ కింగ్ eBay చైనా మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. జాక్ మాను దెబ్బతీయడానికి భారీగా నిధులు గుప్పించింది.
జాక్ మా భయపడలేదు. Taobao అనే ఉచిత ప్లాట్‌ఫారమ్‌ను తీసుకొచ్చాడు. eBay చైనా సంస్కృతిని అర్థం చేసుకోలేకపోయింది. కానీ జాక్ మాకు చైనీస్ వ్యాపారుల మనస్తత్వం తెలుసు. ‘‘eBay సముద్రంలో ఉండే సొరచేప.. నేను యాంగ్జీ నదిలోని మొసలిని. మొసలి సముద్రంలో పోరాడితే ఓడిపోతుంది. కానీ నదిలో పోరాడితే గెలుస్తుంది’’ అని అన్నాడు. ఈ నినాదం.. స్థానిక వ్యాపారులను విశేషంగా ఆకట్టుకుంది. eBayకి బదులుగా.. అంతా అలీబాబాను నమ్ముకున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే eBayను చైనా మార్కెట్ నుంచి తరిమి కొట్టారు.
2014 సెప్టెంబర్ నెలలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో అలీబాబా IPOకి వచ్చింది. చరిత్రలోనే అత్యంత భారీగా రూ. 2 లక్షల కోట్లకు పైగా నిధులను సేకరించి ప్రపంచ రికార్డు సృష్టించింది. ఒక్క రోజులోనే జాక్ మా ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మారాడు. రూ.3 లక్షల కోట్లకు పైగా సంపదకు అధిపతి అయ్యాడు. ఈ రోజు కోసమే.. జీవితంలో ఆయనకు అన్ని తిరస్కరణలు ఎదురై ఉండవచ్చు. ఆయన బిలీనియర్ కావాలని రాసిపెట్టి ఉండటం వల్లే.. ఆయన్ని 31 కంపెనీలు తిరస్కరించాయి. వాటిలో ఏ ఒక్క జాబ్ వచ్చినా.. ప్రపంచానికి జాక్ మా అనేవాడే తెలియకపోయేవాడు.
తన జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు గురించి జాక్ పలు సందర్భాల్లో అన్న మాటలివి. ‘‘నన్ను లోకం ఎన్నిసార్లు రిజెక్ట్ చేసిందో నాకు తెలుసు. కానీ ఆ తిరస్కరణలే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. కాబట్టి.. కుంగిపోవద్దు. మీ సత్తాకు తగినది ఏదో మీ కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. అలాగే వ్యాపారంలో ముందు కస్టమర్, తర్వాత ఉద్యోగి, చివరికే ఇన్వెస్టర్ అనేది గుర్తుంచుకోవాలి. నాకు కోడింగ్ రాదు, అకౌంటింగ్ రాదు. కానీ నాకంటే తెలివైన వ్యక్తులను ఒకే తాటిపైకి తెచ్చి పనిచేయించడం వచ్చు. కాబట్టి, జీవితంలో అన్ని రావాలనే రూల్ ఏమీ లేదు. ఆలోచనలను కరెక్టుగా అమలు చేయడం తెలిస్తే చాలు. మీ జీవితంలో ఎంతమంది మిమ్మల్ని వద్దనుకున్నా, ఎన్ని తలుపులు మూసుకున్నా.. ఇది గుర్తుంచుకోండి. మీరు ప్రయత్నించడం ఆపనంత వరకు మీరు ఓడిపోనట్లే’’. కాబట్టి.. మీరు కూడా మీ ప్రయత్నాలను ఆపొద్దు. ఏదో ఒక రోజు మీరు కూడా జాక్ మాలో ఒకరు కావచ్చు.