Google Layoffs : అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థలో పనిచేస్తున్న మేనేజ్ మెంట్ విభాగాల్లో పని చేస్తున్న వారికి లేఆఫ్స్ ప్రకటించింది. అది ఆ సంస్థ గతంలో తీసుకున్న లేఆఫ్ లలో రెండో పెద్ద నిర్ణయం కావడం గమనార్హం. ఈ మేరకు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ సంస్థ ఉద్యోగులకు ఈ నిర్ణయాన్ని తెలియజేశారు.
మేనేజ్మెంట్ విభాగంలో పనిచేస్తున్న మేనేజర్లు, డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పనిచేస్తున్న వారిలో ఏకంగా 10 శాతం మందికి టెక్ దిగ్గజం గూగుల్ లేఆఫ్‌లు ప్రకటించింది. మరికొంత మందికి ర్యాంక్ లను తగ్గించి.. వ్యక్తిగత హోదాలకే పరిమితం చేయాలని సంస్థ నిర్ణయించినట్లు సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఈ విషయాన్ని బిజినెస్ ఇన్ సైడర్ తెలిపింది. తన తోటి సాంకేతిక సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకుని మార్కెట్లో ధీటుగా నిలబడేందుకు ప్రయత్నిస్తున్న గూగుల్.. ఇలాంటి నిర్ణయాల్ని తీసుకుంటోంది. ముఖ్యంగా.. ఓపెన్‌ఏఐ వంటి ఏఐ సంస్థల నుంచి పోటీ పెరుగుతున్న వేళ తన సామర్థ్యాలను మెరుగుపరుచుకునేందుకే లేఆఫ్ లు ప్రకటిస్తున్నట్లు పిచాయ్ తెలిపారు.
అంతర్జాతీయ టెక్ సంస్థల పోటీని తట్టుకునేందుకు గూగుల్ ఫిషియెన్సీ డ్రైవ్ లో ఉంది. ఇందులో భాగంగా.. తన సేవలు, పని తీరు 20% మరింత సమర్థవంతంగా ఉండాలని కోరుకుంటోంది. ఇదే విషయాన్ని రెండేళ్ల క్రితమే సుందర్ పిచాయ్.. ఉద్యోగులతో మీటింగ్ లో వెల్లడించారు. ఆ తర్వాత 2023 జనవరిలోనే కంపెనీ నుంచి ఒకేసారి 12 వేల మందిని తొలగించారు. అప్పట్లో ఇది అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. గూగుల్ చరిత్రలోనే అత్యధిక మందిని తొలగించిన లే ఆఫ్ గా నిలిచిపోయింది.
ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు గూగుల్ పునర్ వ్యవస్థీకరణ చేపట్టింది. నిధుల సమర్థ వినియోగం, ఉద్యోగుల శక్తి సామార్థ్యాల మదింపు సహా.. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తాజా లేఆఫ్స్ ప్రకటించింది.
టెక్ రంగంలో ఏఐ సాంకేతిక విభాగంలో గూగుల్ కి గట్టిపోటీ ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను గూగుల్ వినియోగిస్తోంది. దీని ద్వారా ఇతర సంస్థల పోటీని ఎదుర్కోంటోంది. ముఖ్యంగా ఓపెన్ ఏఐ సంస్థ నుంచి గట్టిపోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న గూగుల్.. కొత్తగా ఏఐ వీడియో జనరేటర్, దాని థింకింగ్ ప్రాసెస్ ను చూపించే “రీజనింగ్” మోడళ్లను పరిచయం చేసింది. దాంతో పాటే.. సరికొత్త జెమినీ మోడళ్లను ప్రారంభించింది.
Also Read : 4 లక్షల కోట్ల ఫార్మా సామ్రాజ్యానికి వారసురాలు, ఇంతకీ ఎవరీ విధి శాంఘ్వీ?
ఇలా అనేక రకాల చర్యల ద్వారా అంతర్జాతీయ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్న గూగుల్.. అవసరమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే తాజా లేఆఫ్ లను ప్రకటించింది. అయితే.. ఈ పరిణామాలతో ఉద్యోగ వర్గాల్లో కలవరం మొదలైంది. దిగ్గజ గూగుల్ వంటి సంస్థే లేఆఫ్ ప్రకటిస్తే, మిగతా టెక్ సంస్థల పరిస్థితులు ఏంటో అనే చర్చ జరుగుతోంది.