LPG Gas: రోజురోజుకూ పెరుగుతున్న నిత్యావసరాల ఖర్చుల వేళ, మధ్యతరగతి ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ వచ్చేసింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్ ధరలను పెంచింది. ఏప్రిల్ 7, 2025న కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించిన ప్రకారం, ప్రతి సిలిండర్‌పై రూ.50 వరకు భారం పడనుంది. ఈ నిర్ణయం ఉజ్వలా పథకం లబ్దిదారులపై కూడా ప్రభావం చూపనుంది. ఇప్పటికే గ్యాస్ ధరల భారం మోస్తున్న సామాన్య ప్రజానీకానికి ఇది మరో భారమని చెప్పవచ్చు.
ఎల్పీజీ ధరల కొత్త రేట్లు ఎలా ఉన్నాయి?
ఈ పెంపుతో ఉజ్వలా యోజన లబ్దిదారులకు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 503 నుంచి రూ. 553కు పెరిగింది. ఇదే సమయంలో సాధారణ వినియోగదారుల కోసం ధర రూ.803 నుంచి రూ. 853కు పెరిగింది. అంటే ప్రతి సిలిండర్‌పై రూ. 50 అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ పెంపు వల్ల నెలకు ఒక సిలిండర్ వినియోగించే కుటుంబానికి సంవత్సరానికి అదనంగా రూ. 600 భారం పడనుంది. రెండు సిలిండర్లు వినియోగించే కుటుంబాలకు ఇది ఏడాదికి రూ. 1,200 వరకూ చేరవచ్చు.
ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు ఏంటి?
చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ఇది తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు. దీనిని మేము ముందుకు సాగుతున్న కొద్దీ సమీక్షిస్తామని, ప్రతి 2-3 వారాలకు ధరలను మళ్లీ సమీక్షించనున్నామని ఆయన వివరించారు. అంటే వచ్చే నెలలో మళ్లీ తగ్గిస్తారా లేదా పెంచుతారా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. రూ.50 ఒకే సారి పెంచి మళ్లీ రూ.3 , 5 చొప్పున తగ్గిస్తారని ఇది తెలిసిన నెటిజన్లు అంటున్నారు.
వినియోగదారులపై ప్రభావం
అంతేకాకుండా, ప్రభుత్వం గ్లోబల్ మార్కెట్ పరిస్థితులను కూడా గమనిస్తున్నట్లు తెలిపారు. గత కొంతకాలంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టినా, చమురు మార్కెటింగ్ కంపెనీల వద్ద ఉన్న నిల్వలతో సంబంధం ఉన్న ధరల సర్దుబాటుతో వినియోగదారులపై తక్షణ ప్రభావం పడడం లేదన్నారు.
Read Also: YouTube Shorts: యూట్యూబ్ నుంచి అదిరిపోయే అప్‌డేట్..ఏఐ …
డీజిల్, పెట్రోల్‌పై ప్రభావం
అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇదే రోజు పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కూడా లీటరుకు రూ. 2 పెంచింది. అంటే పెట్రోల్‌పై ఎక్సైజ్ డ్యూటీ రూ.11 నుంచి రూ. 13కి, డీజిల్‌పై రూ.8 నుంచి రూ.10కి పెరిగింది. ఈ సవరణ ఏప్రిల్ 8, 2025 నుంచి అమల్లోకి రానుంది. కానీ ఈ పెంపు వల్ల మాత్రం తక్షణంగా పెట్రోల్ లేదా డీజిల్ ధరలు పెరగబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది వినియోగదారునికి బదిలీ చేయబడదని మంత్రి హర్దీప్ పూరి పేర్కొన్నారు. ముడి చమురు ధరలు తగ్గుతున్న నేపథ్యంలో చమురు కంపెనీలు తాత్కాలికంగా ఈ భారాన్ని భరిస్తాయన్నారు.
చమురు ధరల విశ్లేషణ
మంత్రి హర్దీప్ పూరి ప్రసంగంలో ముడి చమురు ధరల గత గణాంకాలను వివరించారు. జనవరిలో బ్యారెల్ ముడి చమురు ధర $83గా ఉండగా, అది తర్వాత $75కు తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు $60కి చేరుకున్నాయి. అయితే మన చమురు మార్కెటింగ్ కంపెనీలు 45 రోజుల నిల్వలను కలిగి ఉంటాయని పేర్కొన్నారు.
45 రోజుల తర్వాత
దీని అర్థం అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన వెంటనే దేశీయంగా దాని ప్రభావం కనిపించదని ఆయన చెబుతున్నారు. కంపెనీలు గత ధరలతో కొనుగోలు చేసిన నిల్వలతో అమ్మాల్సి ఉండటంతో, తాజా ధరల ప్రభావం కొంత ఆలస్యం అవుతుంది. కానీ 45 రోజుల తర్వాత మాత్రం బాదుడు తప్పదని చెప్పకనే చెప్పారు.
ఉజ్వలా పథకం
ప్రధాన మంత్రి ఉజ్వలా యోజన (PMUY) 2016లో ప్రారంభమైంది. దీనిద్వారా దేశంలోని పేద కుటుంబాలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం, మహిళల ఆరోగ్య పరిరక్షణ, వంట సమయంలో కలిగే కాలుష్యాన్ని తగ్గించడం వంటి లక్ష్యాలతో ముందుకు వచ్చింది. ఈ పథకంలో లబ్దిదారులకు సబ్సిడీతో గ్యాస్ అందించడమే కాదు, తక్కువ ధరలకు గ్యాస్ సౌకర్యం అందిస్తున్నారు.