L&T Chairman Subrahmanyan Welfare Scheme Controversy | “ఆదివరాం ఆఫీసుకి రండి. భార్యను ఎంతసేపు చూస్తూ ఉండిపోతారు..వారానికి 90 గంటలు పనిచేయండి” అని ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన L&T చైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ మరో కొత్త వివాదానికి తెరలేపారు. సంక్షేమ పథకాల వల్లే నిర్మాణ రంగంలో కార్మికుల వలసలు తగ్గిపోతున్నాయని ఆయన తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలు కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. వాటి వల్లే కార్మికులు పని చేయడానికి ఇష్టపడటం లేదని అన్నారు.
చెన్నైలో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సదస్సు(CII Mystic Global Linkages Summit)లో మంగళవారం ఎల్ అండ్ టి చైర్మెన్ సుబ్రహ్మణ్యన్ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. కార్మికుల కొరత అంశాన్ని ప్రస్తావించారు. “మా ఎల్ అండ్ టి కంపెనీలో ప్రస్తుతం 4 లక్షల మంది కార్మికులు, 2.5 లక్షల మంది ఉద్యోగులు.. పని చేస్తున్నార. ఉద్యోగుల సంఖ్యలో తగ్గుదల ఉన్నప్పటికీ, ఆ విషయం పెద్దగా బాధించట్లేదు. కానీ, కార్మికుల లభ్యత గురించి నేను ఎక్కువగా ఆందోళన చెందుతున్నాను. ఈ రోజుల్లో కార్మికులు అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లేందుకు ఇష్టపడట్లేదు. బహుశా స్థానికంగా వారికి సంపాదన బాగానే ఉండొచ్చు. దీనికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కారణం కావొచ్చు. వాటి వల్లే వారు వేరే ప్రాంతాలకు వెళ్లి పనిచేయడానికి ఆసక్తి చూపించట్లేదు” అని సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యానించారు.
“అయితే, కేవలం కార్మికుల్లో మాత్రమే కాదు.. వైట్ కాలర్ ఉద్యోగాలు చేస్తున్న వృత్తి నిపుణుల్లోనూ ఇదే భావన ఉందనిపిస్తోంది. నేను L&T సంస్థలో ఇంజినీర్ గా చేరినప్పుడు, మా బాస్ ఢిల్లీలో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని చెబితే నేను ఆయన ఆదేశాలను పాటించాను. కానీ, ఈ రోజుల్లో ఎవరైనా వ్యక్తిని అలా అడిగితే.. ఉద్యోగానికి ‘బై’ అంటూ వెళ్లిపోతున్నారు” అని వివరించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదే కాదు.. భారత కార్మికులు దేశంలో కాకుండా విదేశాల్లో పనిచేయడానికి ఇష్టపడుతున్నారని.. అక్కడ మూడింతలు జీతం ఆశించే వెళుతున్నారని చెప్పారు. అందుకోసం.. ఇండియాలో కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులకు కూలీ కూడా పెరగాలని అభిప్రాయపడ్డారు.
Also Read: సిబిల్ స్కోర్‌తో పెళ్లి క్యాన్సిల్.. వరుడికి షాకిచ్చిన అత్తమామలు
ఆ మధ్య వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. “ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం గడపాలని భార్యలకు ఈ విషయం అర్థమయ్యేటట్లు చెప్పాలి. వారానికి 90 గంటల పాటు ఉద్యోగులు పనిచేయాలి. ఆదివారం సెలవునూ వదిలేయాలి” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఆన్-లైన్ లో పెను దుమారం లేపాయి. దీనిపై ఆ తర్వాత కంపెనీ స్పష్టతనిచ్చింది. అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగే క్రమంలో అసాధారణ లక్ష్యాలను చేరాలంటే అసాధారణ కృషి అవసరం అంటూ తన చైర్మన్ వ్యాఖ్యలను సమర్థించింది.
అయితే అప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, నెటిజెన్లు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. మరి ఈసారి విషయం ఎంత దూరం వెళుతుందో చూడాలి.