Mobile Charges: మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్నాయా? జియో, ఎయిర్‌టెల్‌తోపాటు మిగతా సంస్థలు ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయా? ఈ ఏడాది చివరి నాటికి 10 నుంచి 12 శాతం ధరలు పెంచాలని నిర్ణయం తీసుకున్నాయా? సామాన్యుడి జేబుకు చిల్లులు పడినట్టేనా? అవుననే అంటున్నారు మార్కెట్ నిపుణులు.
మొబైల్ రీఛార్జ్ ధరలు పెంచాలని మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది చివరినాటికి దేశీయ టెలికాం సంస్థలు తమ టారిఫ్‌లను ఇప్పుడున్న దానికంటే 10 నుంచి 15 శాతం పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరల పెంపు వెనుక ఎప్పటి మాదిరిగా రకరకాల కారణాలు చెప్పే పనిలో నిమగ్నమయ్యాయట.
రికార్డు స్థాయిలో సబ్‌స్క్రైబర్లు పెరగడం, 5జీ సదుపాయాల నేపథ్యంలో పెంచాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మే నెలలో మొబైల్ యూజర్ల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. కేవలం ఒక్క నెలలో 74 లక్షల మంది కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకున్నారు. గడిచిన రెండున్నరేళ్లలో ఇదే గరిష్ఠం.దీంతో సబ్‌స్క్రైబర్ల సంఖ్య ఏకంగా 108 కోట్లకు చేరువైనట్టు గణాంకాలు చెబుతున్నాయి.
జియో లో కొత్తగా 55 లక్షల మంది చేరినట్టు తెలుస్తోంది. అలాగే ఎయిర్‌టెల్‌కు ఇప్పుడున్న కస్టమర్లకు మరో 13 లక్షల మంది కొత్తగా చేరారు. యూజర్ల అమాంతంగా పెరగడంతో టారిఫ్‌లు పెంపుపై ఆయా సంస్థలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్థిక సేవల సంస్థ జెఫెరీస్ వెల్లడించింది.
ALSO READ: స్టార్టప్స్ ఓనర్ల కోసం టెక్ నేషన్, ఐలాండ్ ని కొన్న బాలాజీ శ్రీనివాసన్, ఎవరాయన?
గతేడాది జులైలో బేస్ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలు 11 నుంచి 20 శాతానికి పెరిగాయి. ఈ ఏడాది చివరినాటికి మరో 10-15శాతం పెంచే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాల మాట. ఈసారి బేస్ ప్లాన్ల జోలికి వెళ్లకపోవచ్చని అంటున్నాయి. కాకపోతే డేటా వినియోగం, డేటా వేగం, డేటాను వినియోగించే సమయం ఆధారంగా ఛార్జీల పెంపు ఉండొచ్చని చెబుతున్నాయి.
గతంలో ఛార్జీలు పెంచినప్పుడు మనకంటే పొరుగుదేశంలో ధరలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయా కంపెనీలు చెప్పే ప్రయత్నం చేశాయి. అక్కడ జనాభాతో పోల్చితే దేశంలో జనాభా ఎక్కువ.. సబ్‌స్క్రైబర్లు సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఈ విషయాన్ని ఏ మాత్రం టెలికాం కంపెనీలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఫలితంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడుతోంది. అదే జరిగితే యూజర్లు బీఎస్ఎన్ఎల్‌కు మళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు.