Gaurav Londhe Success Story: రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లో గంటల తరబడి ఇరుక్కుపోతే ఎవరికైనా చిరాగ్గా, ఆకలిగా ఉంటుంది. ఆ సమయంలో కొద్దిగా నీళ్లు, తినుబండారాలు ఉంటే బాగుండునని చాలా మంది కోరుకుంటారు. ముంబైకి చెందిన ఓ పిజ్జా డెలివరీ బాయ్ గౌరవ్ లోండేకు కూడా సరిగ్గా ఇదే ఆలోచన వచ్చింది. ఆ చిన్న ఆలోచనే అతన్ని నేడు నెలకు లక్షల్లో సంపాదిస్తున్న విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్చింది.
2019లో ఒక రోజు ముంబైలోని అంధేరి ప్రాంతంలో ప్రయాణిస్తున్న గౌరవ్.. విపరీతమైన ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకుపోయాడు. ఆ సమయంలో అతనికి విపరీతమైన ఆకలి, దప్పిక వేసింది. సరిగ్గా అప్పుడే రోడ్డుపై వాహనాల్లో ఇరుక్కుపోయిన ప్రతి ఒక్కరూ తనలాగే ఇబ్బంది పడుతుంటారని, వారికి ఏదైనా అందించగలిగితే బాగుంటుందని భావించాడు. ఆ ఆలోచనను అక్కడితో వదిలేయకుండా ఆచరణలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ముంబై ప్రసిద్ధ వీధి ఆహారమైన ‘వడా పావ్’ను బాక్సులో పెట్టి, చిన్న నీళ్ల బాటిల్, టిష్యూ పేపర్‌తో కలిపి కేవలం 20 రూపాయలకే విక్రయించడం ప్రారంభించాడు.
గౌరవ్ సొంత వ్యాపారం చేయాలనే కోరికను ‘ది బెట్టర్ ఇండియా’తో పంచుకుంటూ.. మార్కెటింగ్ మెలకువలు తనకు తెలుసని, ఎవరికీ తట్టని సరికొత్త మార్కెట్ అక్కడ ఉందని తాను ముందే పసిగట్టినట్లు తెలిపాడు. అయితే అతని తల్లి రంజనకు ఈ ఆలోచన అసలు నచ్చలేదట. గౌరవ్ అప్పటికే మేనేజర్‌గా నెలకు రూ. 35,000 జీతం పొందుతున్నాడని, ఆ మంచి ఉద్యోగం వదిలేయవద్దని ఆమె ఎంతో నచ్చజెప్పింది. ట్రాఫిక్ మధ్యలో బాక్సుల్లో వడా పావ్ అమ్మడం అసాధ్యమని, వేడి వేడిగా ప్లేట్లో తినే ఈ స్నాక్‌ను బాక్సులో పెడితే ఎవరూ కొనరని భావించింది. అంతేకాకుండా రద్దీ రోడ్లపై ఆహారం అమ్మితే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉందని ఆమె భయపడింది.
కొడుకు పట్టుదల చూసి తల్లి రంజన తన సేవింగ్స్ రూ. లక్ష ఇచ్చింది. అయితే ఆ డబ్బు పోతుందేమోనని ఆమె తొలుత ఆందోళన చెందగా.. తాను దానికి రెట్టింపు డబ్బు తిరిగిస్తానని గౌరవ్ హామీ ఇచ్చాడు. తొలిరోజు 50 వడా పావ్‌లు తయారు చేసి రోడ్డుపైకి వెళ్తే ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. దీంతో నిరాశ చెందిన గౌరవ్.. వాటిని ట్రాఫిక్‌లో ఉన్నవారందరికీ ఉచితంగా పంచేశాడు. మొదటి కొన్ని రోజులు ఇదే పరిస్థితి పునరావృతమైంది. ఆ తర్వాత తన స్నేహితులు ఇద్దరి సహాయాన్ని గౌరవ్ కోరినప్పటికీ తల్లి మాత్రం అది వర్కౌట్ కాదన్న అభిప్రాయంలో ఉండిపోయింది.
అయితే ఆ తర్వాతే అసలు మార్పు వచ్చింది. ఒక రోజు కేవలం గంట వ్యవధిలోనే గౌరవ్ తన ఇంటికి ఫోన్ చేసి కస్టమర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారని వెంటనే మరిన్ని వడా పావ్‌లు తయారు చేసి పంపాలని కోరాడు. ఆ ఒక్కరోజే వారు వందకు పైగా వడా పావ్‌లను విక్రయించారు. క్రమంగా అక్కడి ప్రయాణికులలో వీరికి ఆదరణ పెరిగింది.
ప్రస్తుతం గౌరవ్ ఖర్చులు పోను నెలకు సుమారు రూ. 80,000 వరకు నికరంగా ఆర్జిస్తున్నాడు. ‘తీన్ హాత్ నాకా’ ప్రాంతం వద్ద ఒక ఫుడ్ స్టాల్ ను ఏర్పాటు చేసి ఎనిమిది మంది యువకులను నియమించుకున్నాడు. వారికి నెలకు రూ. 6,000 జీతం ఇస్తూ వారి చేత ట్రాఫిక్ లో వడా పావ్ అమ్మిస్తున్నాడు. వారంతా ఒకేలాంటి ఆరెంజ్ రంగు టీ-షర్ట్స్ ధరించి చేతిలో ‘ది ట్రాఫిక్ వడా పావ్’ ప్యాకెట్ పట్టుకుని వాహనదారులకు విక్రయిస్తున్నారు.
Also Read: ఇల్లు భద్రంగా ఉండాలా? రూ.5 వేలలో టాప్-5 సెక్యూరిటీ కెమెరాలు.. ఇక దొంగల భయమే అక్కర్లేదు!
ప్రస్తుతం రంజన తన కొడుకు వ్యాపారంలో వడా పావ్ తయారీకి కావలసిన మసాలాలు, పిండిని సిద్ధం చేస్తూ సహాయం అందిస్తున్నారు. కష్టనష్టాలను ఎదుర్కొని కొడుకు తన కలను నిజం చేసుకోవడం చూసి ఆమె ఎంతో గర్వపడుతున్నారు. తొలినాళ్లలో ఎదురైన వైఫల్యాలను తట్టుకుని నిలబడిన గౌరవ్.. నేడు తన వ్యాపారం ద్వారా నెలకు దాదాపు రూ. 2 లక్షల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: రూ. 10 లక్షల పెట్టుబడి.. సింగిల్ ఎఫ్‌డీ vs మల్టిపుల్ ఎఫ్‌డీలు.. అధిక రాబడికి ఏది బెస్ట్?